అమరావతికి శోభా గ్రూప్ గుడ్ న్యూస్... భారీ విరాళం, బాబు హర్షం!
ఈ నేపథ్యంలో తాజాగా దుబాయ్ లోని ప్రముఖ రియాల్టి సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్ తో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శోభా గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది.
By: Raja Ch | 22 Oct 2025 8:59 PM ISTఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఓ కొలిక్కి తీసుకురావాలని అవిరామంగా ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు.. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచదేశాలు తిరుగుతున్నారు.. దిగ్గజ సంస్థలను కలుస్తున్నారు.. ఏపీకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దుబాయ్ లోని ప్రముఖ రియాల్టి సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్ తో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శోభా గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది.
అవును... ఏపీ రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పందించిన సీఎం చంద్రబాబు... శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్లు విరాళం ప్రకటించడంపై ప్రత్యేకంగా అభినందించారు.
తన మూడు రోజుల పర్యటనలో భాగంగా... మొదటి రోజున శోభా రియాల్టీ గ్రూప్ చైర్మన్ రవి మీనన్ తో చంద్రబాబు ముఖాముఖి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా మార్చే దార్శనికతను సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఆతిథ్యం, మౌలిక సదుపాయాలలో అభివృద్ధి చెందుతున్న వ్యవస్థను ఆయన హైలైట్ చేశారు.
ఇదే సమయంలో పీ4 విధానంలో జీరో పావర్టీకి ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలను వివరించిన చంద్రబాబు.. రాజధాని అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా.. శోభా రియాల్టి సంస్థ కూడా ఇందులో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఏపీకి వచ్చి అమరావతి నిర్మాణాన్ని పరిశీలించాలని పీఎన్సీ మీనన్ ను కోరారు. దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ సరైన గమ్యస్థానం ఏపీ అని వివరించారు.
ఇదే క్రమంలో... విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానున్నాయని వివరించిన చంద్రబాబు... రాష్ట్రంలోని విశాఖ, అమరావతి, తిరుపతి లాంటి నగరాలకు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని చెప్పారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని మీనన్ ను సీఎం ఆహ్వానించారు.
భారత్ లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం!:
మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్... బ్రిస్బేన్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా... భారత్ - ఆస్ట్రేలియా మధ్య స్వేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలు అమలవుతున్నాయని చెప్పారు. గత 16 నెలల్లో ఏపీకి రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు.
ఇదే సమయంలో... ఏపీలో పారిశ్రామికవేత్తల కోసం సులభతర పాలసీలు అమలుచేస్తున్నట్లు చెప్పిన లోకేష్... ఆర్సెలార్ మిత్తల్ సంస్థ రూ.1.35 లక్షల కోట్లతో అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించబోతోందని.. అదే విధంగా విశాఖలో రూ.1.33 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిందని వివరించారు. ప్రస్తుతం భారత్ లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్ వేగా మారిందని అన్నారు.
