Begin typing your search above and press return to search.

చినుకే పడని ఎడారిలో ఈ మంచు ఏంటబ్బా.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

పొడిబారిన ఇసుక నేలలు మంచు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయి. నాసా విడుదల చేసిన ఈ అరుదైన దృశ్యాలు, వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల గురించి పరిశోధకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

By:  Madhu Reddy   |   3 Sept 2026 11:54 AM IST
చినుకే పడని ఎడారిలో ఈ మంచు ఏంటబ్బా.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
X

ఎడారి అంటేనే ఎండలు, ఇసుక తిన్నెలు, చుక్క నీరు లేని ఎండమావులు గుర్తుకొస్తాయి. అసలు వర్షపు బొట్టు పడని ప్రదేశంలో సడన్‌గా మంచు కురిస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే వింతగా ఉంది కదా! దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో ఉన్న ప్రసిద్ధ అటకామా ఎడారిలో సరిగ్గా ఇదే అద్భుతం జరిగింది. పొడిబారిన ఇసుక నేలలు మంచు తెల్లటి దుప్పటి కప్పుకున్నాయి. నాసా విడుదల చేసిన ఈ అరుదైన దృశ్యాలు, వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పుల గురించి పరిశోధకులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

డ్రైయెస్ట్ ప్లేస్‌లో ఊహించని మంచు తుఫాను:

ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతంగా, అసలు వర్షమే పడని ఎడారిగా అటకామాకు పేరుంది. అలాంటి చోట భారీగా మంచు కురవడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక ఉత్తర చిలీ ప్రాంతం నుంచి మొదలై పసిఫిక్ మహాసముద్ర తీరం వరకు ఉన్న ఎడారి ప్రాంతం అంతా దట్టమైన మంచు పొరతో కప్పబడిపోయింది. ఏళ్ల తరబడి చుక్క నీటి కోసం తపించే నేలలు ఇప్పుడు హఠాత్తుగా మంచుతో నిండిపోవడం ఒక వింత సంఘటనగా మారింది.

అంతరిక్షం నుంచి నాసా అరుదైన ఫోటోలు:

ఈ అరుదైన దృశ్యాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఉపగ్రహాల ద్వారా చిత్రీకరించి ప్రపంచానికి చూపించింది. ఇసుక గుట్టలపై తెల్లటి మంచు తెలతెలలాడుతూ కనిపించే దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఎడారి మైదానాలు మంచు కొండలుగా మారిపోయిన ఈ ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఆ విశేషాలు చూద్దాం..

వాతావరణంలో వస్తున్న తీవ్ర మార్పులే కారణమా?:

సాధారణంగా ఎడారుల్లో ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లో పడిపోయినప్పటికీ, అసలు తేమ లేని ప్లస్ లో మంచు పడటం సాధారణ విషయం కాదు. గ్లోబల్ వార్మింగ్, భూగోళం వేడెక్కడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక దానికి సంకేతంగానే ఎప్పుడూ వర్షం పడని ప్రాంతాల్లో ఇటువంటి అసాధారణ పరిస్థితులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.

ప్రకృతి ఎప్పుడు ఎలాంటి వింతలను చూపిస్తుందో చెప్పడం కష్టం. ఎడారిలో మంచు కురవడం చూడటానికి ఎంతో అందంగా, అద్భుతంగా అనిపించినప్పటికీ.. ఇది భవిష్యత్తులో భూమి ఎదుర్కొబోయే తీవ్రమైన వాతావరణ ముప్పుకు ఒక హెచ్చరిక లాంటిది. ఇక ఇప్పటికైనా మానవాళి పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టకపోతే, ప్రకృతి సమతుల్యత దెబ్బతిని మరిన్ని విపరీత పరిణామాలు చూడాల్సి వస్తుంది.