స్మృతి మందాన జీవితంలో గుడ్ న్యూస్.. పెళ్లి బాజాలు మోగనున్నాయి!
టీమిండియా మహిళా క్రికెట్‌లో దిగ్గజం మిథాలీ రాజ్ తర్వాత అత్యధిక గుర్తింపు తెచ్చుకున్న పేరు స్మృతి మందాన.
By: A.N.Kumar | 18 Oct 2025 10:23 PM ISTటీమిండియా మహిళా క్రికెట్‌లో దిగ్గజం మిథాలీ రాజ్ తర్వాత అత్యధిక గుర్తింపు తెచ్చుకున్న పేరు స్మృతి మందాన. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ అద్భుతమైన బ్యాటర్, తన క్లాస్ బ్యాటింగ్ శైలితో, క్రీజ్‌లో ధైర్యంగా నిలబడే తీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి సీజన్‌లో రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, జట్టును విజేతగా నిలిపిన ఘనత కూడా స్మృతిదే. ప్రస్తుతం మహిళల వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఆమె కొనసాగుతూ, భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్‌గా వెన్నెముకగా నిలుస్తోంది. ఇటీవల జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్‌కప్‌లోనూ స్మృతి అదరగొడుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆమె కనబరచిన ఆత్మవిశ్వాసం, సాంకేతిక ప్రతిభకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
* ప్రేమ, పెళ్లి కబురు!
ఆటలో అదరగొడుతున్న స్మృతి మందాన వ్యక్తిగత జీవితంలోనూ ఒక మంచి వార్త బయటకు వచ్చింది. గత ఆరు సంవత్సరాలుగా సినీ నిర్మాత, సంగీత దర్శకుడు పలాష్ మచ్చల్తో స్మృతి ప్రేమలో ఉన్నట్టు సమాచారం. తాజాగా పలాష్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి.
పలాష్ మాట్లాడుతూ “త్వరలోనే నాకు నచ్చిన వ్యక్తితో ఏడు అడుగులు వేయబోతున్నాను. ఆమె ఇండోర్ కోడలు కాబోతోంది” అంటూ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు, స్మృతి మందానతో ఆయన వివాహం ఖాయమని సూచిస్తున్నాయి.
* క్రికెట్ కెరీర్‌కు మద్దతు
స్మృతి క్రికెట్ కెరీర్‌పై పలాష్ మచ్చల్ ఎంతో సానుకూలంగా ఉన్నారు. “స్మృతి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. వివాహం తర్వాత కూడా ఆమె క్రికెట్ కొనసాగిస్తే నాకు చాలా ఆనందమే. ఆమె కెరీర్‌కి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకుంటాను” అని తెలిపారు.
ఈ వ్యాఖ్యలతో స్మృతి అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె భారత క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆటలో అదరగొడుతూ జీవితంలో కొత్త అడుగులు వేస్తున్న స్మృతి మందాన.. క్రికెట్‌లో గెలిచినట్టే, జీవితంలోనూ విజయపథంలో ముందుకెళ్తుందనే నమ్మకం అభిమానుల్లో నెలకొంది.
