Begin typing your search above and press return to search.

స్మృతి మంధాన పెళ్లి పోస్టులు డిలీట్‌... అభిమానుల్లో ఆందోళన!

వివాహం వాయిదా పడిన తర్వాత స్మృతి మంధాన సోమవారం ఉదయం తీసుకున్న నిర్ణయం అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

By:  A.N.Kumar   |   24 Nov 2025 7:24 PM IST
స్మృతి మంధాన పెళ్లి పోస్టులు డిలీట్‌... అభిమానుల్లో ఆందోళన!
X

టీమ్‌ ఇండియా స్టార్‌ మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన జీవితంలో ఒక్కసారిగా వరుస నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనుకోకుండా ఆమె వివాహం వాయిదా పడటం, వెంటనే సోషల్ మీడియా అకౌంట్‌లో పెళ్లికి సంబంధించిన అన్ని పోస్టులు మాయం కావడం అభిమానుల్లో భారీ చర్చకు, ఆందోళనకు దారితీసింది.

* అకస్మాత్తుగా వాయిదా పడిన వివాహం

స్మృతి మంధాన-పాలాష్ ముచ్చల్‌ల వివాహం ఆదివారం నవంబర్ 23, 2025 మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సి ఉంది. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్‌ మంధానకు గుండెపోటు రావడంతో కుటుంబం వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్చింది. ఈ ఊహించని ఆరోగ్య సమస్య కారణంగా కుటుంబం వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. దీనికి తోడు, మరుసటి రోజు ఉదయం వరుడు పాలాష్ ముచ్చల్‌కు కూడా ఆసిడిటీ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. చికిత్స అనంతరం ఆయన త్వరగా డిశ్చార్జ్ అయ్యారు.

* సోషల్ మీడియాలో స్మృతి ఆకస్మిక నిర్ణయం

వివాహం వాయిదా పడిన తర్వాత స్మృతి మంధాన సోమవారం ఉదయం తీసుకున్న నిర్ణయం అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ నుండి పెళ్లికి సంబంధించిన కీలక పోస్టులన్నింటినీ ఒక్కసారిగా తొలగించింది. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు, ప్రీ-వెడ్డింగ్ లుక్స్, పాలాష్ చేసిన ప్రేమ ప్రపోజల్ వీడియో అంతేకాకుండా ఆమె టీమ్‌మేట్‌లు జెమిమా రోడ్రిగ్స్‌, శ్రేయంక పటిల్ కూడా తమ అకౌంట్ల నుంచి స్మృతి వెడ్డింగ్‌కు సంబంధించిన వీడియోలను తొలగించడం గమనార్హం. అయితే గతంలో స్మృతి–పాలాష్ కలిసి ఉన్న సాధారణ ఫోటోలు మాత్రం అలాగే ఉన్నాయి.

* ఎందుకు తీసేశారు పోస్టులు? చర్చనీయాంశమైన ఊహాగానాలు

స్మృతి ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక కారణంపై స్పష్టత లేనప్పటికీ, క్రికెట్ వర్గాల్లో రెండు ప్రధాన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకే రోజులో తండ్రి, వరుడికి ఆరోగ్య సమస్యలు రావడం... కుటుంబం ఈ సంఘటనలను "అసుభం"గా భావించి, పెళ్లికి సంబంధించిన అన్ని జ్ఞాపకాలను తాత్కాలికంగా తొలగించాలని నిర్ణయించుకుందా? అన్న అనుమానాలున్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా, పెళ్లి గురించి వచ్చే అనవసర చర్చలను నివారించడానికి, కుటుంబం నుంచి వచ్చిన సూచనల మేరకే పోస్టులు తొలగించిందా? అనే డౌట్లు వస్తున్నాయి. ఈ విషయంలో స్మృతి లేదా ఆమె కుటుంబం నుంచి అధికారిక స్పష్టత వస్తేనే అసలు కారణం తెలుస్తుంది.

అభిమానుల్లో ఆందోళన

వరుసగా జరిగిన ఈ సంఘటనలు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ "అన్నీ బాగానే ఉన్నాయా?" , "వివాహం నిజంగానే జరుగుతుందా?" అని ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతానికి, కుటుంబ ఆరోగ్యం ముందున్నందున, పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను వారు పూర్తిగా నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. క్రికెట్ ప్రపంచం , అభిమానులు అందరూ స్మృతి తండ్రి శ్రీనివాస్‌, పాలాష్ ముచ్చల్‌గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.