మోడీ వ్యక్తిగత విషయాల్ని రివీల్ చేసిన బీజేపీ మహిళా నేత
సాధారణంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి సంబంధించిన విషయాలు.. వివరాలు ఎక్కువగా బయటకు వస్తుంటాయి.
By: Garuda Media | 16 Sept 2025 10:00 AM ISTసాధారణంగా అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి సంబంధించిన విషయాలు.. వివరాలు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. సిత్రంగా దేశ ప్రధానిగా పదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకొని.. మూడో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాదు.. విజయవంతంగా సర్కారును నడుపుతున్న ప్రధాని నరేంద్రమోడీ విషయంలో మాత్రం అలాంటివి అస్సలు కనిపించవు. బీజేపీలో సీనియర్ నేతలు మొదలు ఏ స్థాయి నేత కూడా మోడీ గురించి ఎక్కువ విషయాలు మాట్లాడరు. అదే సమయంలో ఆయన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగడటం కూడా కనిపించదు. ఆయనకు సంబంధించి ఎవరికి తెలియని విషయాల్ని ఎవరూ ఏ సందర్భంలోనూ షేర్ చేయటం కనిపించదు.
అందుకు భిన్నంగా తాజాగా బీజేపీ మహిళా ఫైర్ బ్రాండ్.. మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవుల్ని చేపట్టి.. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మహిళా నేత స్మ్రతి ఇరానీ గుర్తున్నారుగా? ఆమె.. ప్రధాని మోడీకి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని.. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ నిర్వహిస్తున్న పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె.. మోడీకి సంబంధించిన ఒక పెద్ద అపోహను తాను తొలగిస్తానని పేర్కొంటూ.. ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు.
మోడీకి సన్నిహితులు అంటూ ఎవరూ ఉండరని చెప్పిన ఆమె.. ఎవరైనా ఆయనకు సన్నిహితుడని చెబుతుంటే.. ఆయన గురించి వారికి పూర్తిగా తెలియాదన్నట్లే. లేదంటే.. వారు అబద్ధం చెబుతున్నట్లు లెక్కేనని స్పష్టం చేశారు. ‘‘ఏ విధంగా పని చేయాలో నేర్పుతారు. మనం చేస్తున్న పనేంటో మనకు బాగా తెలిసి ఉండటం మంచిది. ఒక అంశంపై ఏళ్ల క్రితం ఏం మాట్లాడారో కూడా ఆయన గుర్తుంచుకుంటారు’’ అని మోడీ స్టైల్ ను రివీల్ చేశారు.
రాజ్యసభకు రెండుసార్లు నామినేట్ కావటం వెనుక ప్రధాని మోడీ తోడ్పాటు ఉందన్న ఆమె.. ఆయన నేత్రత్వంలో పదేళ్లు మంత్రిగా తాను పని చేశానని.. రాజ్యసభలో లభించిన రెండు అవకాశాలు మోడీ కారణంగానే సాధ్యమైనట్లు చెప్పారు. తనకు ఒకే జీవితం ఉందని.. దాన్ని దేశసేవకు అంకితం చేయాలన్న దానిపై మోడీకి స్పష్టత ఉందన్న ఆమె.. ‘‘ఒక గొప్ప ఉద్దేశంతో మోడీ తన ఇంటిని విడిచి పెట్టారు. దాన్ని సాధించే ప్రయత్నంలో అంతగా సహకరించని వ్యక్తులను మాత్రమే కాదు.. ఎవరిని ఆయన ఎక్కువగా దగ్గరకు తీసుకోలేదు’’ అంటూ మోడీ తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ప్రధాని మోడీ తీరును ఇంత వివరంగా చెప్పిన అతి తక్కువ బీజేపీ నేతల్లో స్మ్రతినే ముందుంటారని చెప్పక తప్పదు.
