Begin typing your search above and press return to search.

సెలవులో ఉన్న స్మితా సభర్వాల్ హైకోర్టుకు ఎందుకు?

పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారుల్లో స్మితా సభర్వాల్ ముందు వరుసలో ఉంటారు.

By:  Garuda Media   |   24 Sept 2025 11:45 AM IST
సెలవులో ఉన్న స్మితా సభర్వాల్ హైకోర్టుకు ఎందుకు?
X

పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారుల్లో స్మితా సభర్వాల్ ముందు వరుసలో ఉంటారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకభూమిక పోషించిన ఆమె.. రేవంత్ ప్రభుత్వంలో ఆమెకు పెద్దగా ప్రాధాన్యత లభించింది లేదు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం చైల్డ్ కేర్ లీవ్ ను అప్లై చేసుకున్న ఆమె ఆర్నెల్లపాటు సెలవులో ఉండేందుకు అనుమతి తీసుకున్నారు.

‘కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ప్రశాంతమైన కాలాలు మనతో బిగ్గరగా మాట్లాడతాయి. కొన్ని నెలలుగా వెన్నెముక సమస్య నా ప్రపంచాన్ని కుదిపేసింది. చాలా బాధతో, నెమ్మదిగా కోలుకుంటున్నా. ఈ సమస్యను అధిగమిస్తా’ అని పేర్కొంటూ ఒక పోస్టు పెట్టారు. అదే పోస్టులో ఓ పర్యాటక ప్రాంతాన్ని ఆస్వాదిస్తున్న వీడియోనూ జత చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో సీఎంవో అడిషనల్ సెక్రటరీగా పని చేసిన ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా పలు కీలక అంశాల్లో ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే.కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు నియమించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ ఎదుట హాజరైన ఆమె.. ఆ సందర్భంగా ఇబ్బందికి గురయ్యారన్న మాట వినిపించింది. ఈ పరిస్థితుల్లోనే ఆమె సెలవులో వెళ్లినట్లుగా ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడించింది.

కట్ చేస్తే.. నాటి వాదనలు నిజమనిపించే పరిణామం తాజాగా చోటు చేసుకుంది. కాళేశ్వరం అంశంపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇచ్చిన నివేదికను హైకోర్టులో సవాలు చేశారు. నోటీసుల జారీ.. వాంగ్మూలాం నమోదు చేసిన విధానాన్ని సవాలు చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సదరు నివేదిక ఆధారంగా తనపై తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది.

ఈ పిటిషన్ ప్రస్తుతం రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పరిశీలన పూర్తైన లిస్ట్ అయిన తర్వాత విచారణకు వచ్చే వీలుంది. కాళేశ్వరం ఉదంతంలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ కు సంబంధించిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి.. నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషీ సైతం హైకోర్టును ఆశ్రయించటం.. ఆయనకు ఊరట లభించటం తెలిసిందే.

ఆయన కూడా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటాన్ని గుర్తు చేస్తున్నారు తాజాగా స్మితా సభర్వాల్ సైతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించే వేళలో.. తాను ప్రభుత్వ అధికారిగా ఉంటూ.. ఈ తరహాలో వ్యవహరించటం ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఆమె దీర్ఘకాలిక సెలవులో వెళ్లి ఉంటారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారు ఏర్పాటు నుంచి తన నిర్ణయాలతో తరచూ వార్తల్లో ఉండే ఆమె.. తాజాగా మరోసారి అదే తీరును ప్రదర్శించారని చెబుతున్నారు. కంచె గచ్చిబౌలి భూముల ఉదంతంలోనూ ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టేలా పోస్టు పెట్టటం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.