ప్రాణాలొడ్డి 180 మందిని కాపాడిన రియల్ హీరో కోసం మేము సైతం
ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్‌కు తోడుగా నిలిచేందుకు ప్రపంచవ్యాప్తంగా మానవత్వం మురిసిపోతోంది.
By: A.N.Kumar | 4 Oct 2026 9:52 AM ISTకర్తవ్య నిర్వహణలో ప్రాణాలను ఫణంగా పెట్టి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ సమయస్ఫూర్తికి నేడు ప్రపంచం నీరాజనాలు పడుతోంది. ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న అత్యంత ప్రమాదకరమైన.. అనూహ్య ఘోర ఘటనలో ఆయన ప్రదర్శించిన మానవీయ కోణం.. వృత్తి నిబద్ధత వందలాది కుటుంబాల్లో వెలుగులు నింపాయి. ప్రాణాపాయ స్థితి ఎదురైనా ఏమాత్రం బెదరక.. చివరి నిమిషం వరకు ప్రయాణికుల భద్రతనే తన ప్రథమ ప్రాధాన్యంగా భావించిన ఆయనను ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒక ‘రియల్ హీరో’గా అభివర్ణిస్తున్నారు.
విమానం ఆకాశంలో ఉన్న సమయంలో కోపైలట్ తీవ్రస్థాయిలో దాడి చేసినప్పటికీ.. తీవ్ర గాయాల పాలైన స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని వీడలేదు. క్షణక్షణం మృత్యువు కనిపిస్తున్న క్లిష్ట సమయాల్లోనూ అప్రమత్తంగా వ్యవహరించి.. విమానంలో ఉన్న సుమారు 180 మంది ప్రయాణికులను అత్యంత సురక్షితంగా నిలబెట్టారు. తీవ్ర గాయాలతో శరీరం సహకరించకపోయినా తన వృత్తి పట్ల ఉన్న అంకితభావంతో విమానాన్ని అదుపు చేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన తీరు విమానయాన చరిత్రలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన ఘట్టంగా నిలిచింది.
ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్‌కు తోడుగా నిలిచేందుకు ప్రపంచవ్యాప్తంగా మానవత్వం మురిసిపోతోంది. ఆయన త్వరితగతిన కోలుకోవడానికి వైద్య ఖర్చుల నిమిత్తం 'గో ఫండ్ మీ' ద్వారా ప్రారంభించిన నిధుల సేకరణకు విశేష స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియగానే వేలాది మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 1,700 మందికి పైగా దాతలు కలిసి ఏకంగా 1,41,802 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.36 కోట్లకు పైగా) విరాళంగా సేకరించడం ఆయనపై ప్రజల్లో ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనం.
తమ ప్రాణాలను కాపాడటానికి సొంత ప్రాణాలను పణంగా పెట్టిన ఒక వీరుడికి సమాజం అందిస్తున్న నిజమైన నీరాజనం ఇది. చిన్న మొత్తాల నుంచి పెద్ద విరాళాల వరకు ప్రజలు స్వచ్ఛందంగా అందిస్తూ "మేము నీకు అండగా ఉన్నాం" అని భరోసానిస్తున్నారు.
ఆపదలో ధైర్యాన్ని కోల్పోకుండా తోటివారి భద్రత కోసం పోరాడటమే అసలైన నాయకత్వమని స్మిత్ మచ్చర్ నిరూపించారు. విమానయాన రంగానికి చెందిన నిపుణులు, ప్రముఖులు ఆయన వృత్తి ధర్మాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి కోలుకుంటున్న ఈ రియల్ హీరో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చి.. సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు.
