Begin typing your search above and press return to search.

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్.. కంటైనరు బజారులో ఏమున్నాయో తెలుసా?

సుమారు రూ.8.40 కోట్లతో 200 కంటైనర్లతో స్మార్టు బజారు నిర్మించారు. నెల్లూరు నగరంలోని మైపాడు జంక్షన్ లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన స్మార్టు బజారును చాలా సుందరంగా తీర్చిదిద్దారు.

By:  Tupaki Political Desk   |   12 Oct 2025 3:00 PM IST
నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్.. కంటైనరు బజారులో ఏమున్నాయో తెలుసా?
X

స్మార్ట్ స్ట్రీట్ బజార్.. వినడానికి కొత్తగా ఉందా? నిజమే ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ కాన్సెప్ట్ నెల్లూరులో శనివారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో స్మార్టు బజారును ఆవిష్కరించారు. మున్సిపల్ మంత్రి నారాయణ తన సొంత నియోజకవర్గంలో మహిళల కోసం కొత్తగా ఈ స్ట్రీట్ బజార్ నిర్మించారు. పూర్తిగా కంటైనర్లతో ఏర్పాటు చేసిన స్మార్ట్ బజారులో ఆధునాతన ఏర్పాట్లు చేశారు. దాదాపు 200 కంటైనర్లలో వివిధ రకాల వ్యాపారాలకు ఇక్కడ అవకాశం కల్పించారు.

తక్కువ పెట్టుబడి, మెరుగైన వసతులతో దుకాణాలు ఏర్పాటు చేయడమే స్మార్టు బజారు లక్ష్యం. ఈ వినూత్న ప్రాజెక్టును తొలిసారిగా రాష్ట్రంలో నెల్లూరులో ఏర్పాటు చేశారు. సుమారు రూ.8.40 కోట్లతో 200 కంటైనర్లతో స్మార్టు బజారు నిర్మించారు. నెల్లూరు నగరంలోని మైపాడు జంక్షన్ లో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన స్మార్టు బజారును చాలా సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి కంటైనర్ షాపునకు సీసీ కెమెరా, మైక్ అనౌన్స్మెంట్, సోలార్ పవర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఒక్కో దుకాణం ఏర్పాటుకు రూ.4 లక్షలు ఖర్చు కాగా, మెప్మా, నెల్లూరు నగరపాలక సంస్థ రూ.2 లక్షల చొప్పున సమకూర్చాయి. మంత్రి నారాయణ కుటుంబం పీ4లో భాగంగా రూ.లక్ష చొప్పున అందజేసింది. ఇక మిగిలిన రూ.లక్షను లబ్ధిదారులైన మహిళలు భరించారు. మొత్తం 200 దుకాణాలు ఏర్పాటు చేయగా, శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో 120 షాపులను ప్రారంభించారు. ఈ దుకాణాలను ఇప్పటికే మహిళలకు కేటాయించారు.

కొత్తగా ప్రారంభించిన ఈ స్మార్టు బజారులో మహిళలను వ్యాపారం రంగంలో ప్రోత్సహించాలనే ప్రభుత్వ సంకల్పం ఉంది. షాపులు కేటాయించిన మహిళలు ఇందులో నిత్యావసరాలు విక్రయించే కిరాణా షాపులతోపాటు జ్యూస్ షాపులు, ప్రూట్స్, కూల్ డ్రింక్స్, ఫొటో స్టుడియోలు నిర్వహించేలా శిక్షణ ఇచ్చారు. ముందుగా మహిళలను చెన్నై తీసుకువెళ్లి అక్కడ బర్మా బజారు ఎలా నడుస్తుందీ చూపించారు. ఇక నెల్లూరులో ఈ ఫార్ములా సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.