జైల్లో అంబటికి స్లీప్ అప్నియా పరికంతో నిద్ర.. ఎందుకిలా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దారుణంగా దూషించిన కేసులో వైసీపీ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు కావటం.. ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే.
By: Garuda Media | 4 Feb 2026 10:30 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును దారుణంగా దూషించిన కేసులో వైసీపీ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు కావటం.. ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు దీర్ఘకాలంగా స్లీప్ అప్నియా పరికరంతో నిద్ర పోతుంటారన్న విషయం వెలుగు చూసింది. ఇప్పటివరకు ఆయనకు ఉన్న ఈ ఆరోగ్య సమస్య గురించి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తప్పించి ఎవరికి తెలియదని చెబుతున్నారు. ప్రస్తుతం జైల్లో ఉంటున్న ఆయనకు ఈ పరికరం ద్వారానే నిద్ర పోవాల్సి ఉంటుంది. దీంతో.. కోర్టు అనుమతితో ఈ పరికరం సాయంతోనే ఆయన నిద్రపోతున్నట్లు తెలుస్తోంది.
ఇంతకూ ఈ ఆరోగ్య సమస్య ఏమిటి? అదెలా ఇబ్బంది పెడుతుంది? ఎందుకి పరికరాన్ని వినియోగిస్తారు? ఈ పరికరం లేకుండా నిద్ర పోవటం ఎంత ప్రమాదకరం అన్న విషయంలోకి వెళితే.. స్లీప్ అప్నియా అన్నది నిద్రలో ఉన్నప్పుడు శ్వాస పదే పదే ఆగిపోవటం లేదంటే నెమ్మదిగా అందటంగా చెప్పాలి. ఇదో తీవ్రమైన ఆరోగ్య రుగ్మత. ఇలాంటివి ఒక్కోసారి కొన్ని సెకన్ల నుంచి నిమిషాల వరకు సాగొచ్చు. ఒక రాత్రిలో కొన్ని వందలసార్లు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది.
నిద్రలో శ్వాస తాత్కాలికంగా ఆగిపోయినప్పుడు శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. అప్పుడు మెదడు శ్వాసను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతకూ ఇదెందుకు వస్తుంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. గొంతు కండరాలు వదులై గాలి మార్గాన్ని అడ్డుకోవటం ఒక కారణంగా చెబుతారు. మెదడు కండరాలకు సరైన సంకేతాలు పంపనప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. రాత్రివేళ బిగ్గరగా గురక పెట్టటం.. నిద్రలో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి కావటం.. పగటిపూట విపరీతమైన అలసటతో పాటు ఉదయాన్నే వచ్చే తలనొప్పులు కూడా ఇందుకు కారణంగా చెప్పొచ్చు.
దీన్ని నిర్లక్ష్యం చేస్తే బీపీ.. గుండెపోటు.. స్ట్రోక్ కు అవకాశం ఉంది. ఇలాంటి సమస్యను ఎదుర్కొనే వారికి ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించటం ద్వారా సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తారు. అధిక బరువు ఉన్న వారికి కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అధిక బరువు ఉన్న వారిలో గొంతు, మెడ చుట్టూ అదనపు కొవ్వు పేరుకుపోతుంది. దీంతో నిద్ర పోయినప్పుడు గొంతులోని కండరాలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవటంతో గాలి లోపలకు వెళ్లే మార్గం మూసుకుపోతుంది. టైప్ 2 షుగర్ ఉన్న వారికి.. బీపీ తీవ్రంగా ఉండే వారిలోనూ ఇలాంటి సమస్యలు ఉంటాయి.
ఈ సమస్యను అంబటి రాంబాబు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారు ప్రత్యేక పరికరం లేకుండా నిద్రపోతే ప్రాణాపాయానికి ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లటంతో స్లీప్ అప్నియా మెషిన్ ను జైల్లో అంబటికి అందుబాటులో ఉండేలా.. ఆయన నిద్ర సమయంలో దాన్ని ఉపయోగించేందుకు వీలు కల్పిస్తూ కోర్టు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఈ మెషిన్ సాయంతోనే అంబటి రాంబాబు జైల్లో నిద్రిస్తున్నారు. మరో విషయం.. ఈ మెషిన్ వాడేవారు దానిని వెంట తీసుకెళ్లేందుకు వీలుగా ఒక చిన్న బ్యాగులో ఉంచుకుంటారని చెబుతారు.
