Begin typing your search above and press return to search.

సీజేపీ అభిజీత్, సౌరవ్‌ లకు మూడింది.. వాంగ్ చుక్ కు కేంద్రంపై మండింది..

మరోవైపు పశ్చిమ బెంగాల్ వేదికగా జరుగుతున్న సీజేపీ నిరసనలపై లాయర్ రింకీ ఛటర్జీ పోలీసులకు చేసిన ఫిర్యాదు కొత్త వివాదానికి తెరలేపింది.

By:  A.N.Kumar   |   6 Aug 2026 10:42 AM IST
సీజేపీ అభిజీత్, సౌరవ్‌ లకు మూడింది.. వాంగ్ చుక్ కు కేంద్రంపై మండింది..
X

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల చుట్టూ వివాదాలు రోజురోజుకూ మరింత ముదురుతున్నాయి. ఒకవైపు లడఖ్‌కు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా.. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో సీజేపీ ప్రతినిధులతో పాటు ఆందోళనల నిర్వాహకులపై ఏకంగా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ రెండు వైపులా ఎదురవుతున్న పరిణామాలు ఈ వివాదాన్ని సరికొత్త మలుపు తిప్పాయి.

నీట్ లీకేజీపై ఏకంగా 26 రోజుల పాటు కఠిన నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రుల వైఖరిని ఎండగట్టారు. తన దీక్ష విరమణ సమయానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను ఆయన పంచుకున్నారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధుల సమక్షంలో అధికారిక ప్రకటన వెలువడేంత వరకు అర్ధరాత్రి జరిగిన సమావేశానికి సంబంధించిన ఎలాంటి ఫొటోలను లేదా దృశ్యాలను మీడియాకు విడుదల చేయకూడదని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తనకు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.

అయితే కేంద్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన మాటను పూర్తిగా విస్మరించిందని వాంగ్‌చుక్ ఆరోపించారు. అధికారిక ప్రకటన రాకముందే సమావేశ దృశ్యాలను మీడియాకు ముందే విడుదల చేశారని.. ఇది స్పష్టంగా నమ్మకద్రోహమేనని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని, విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదనే భావన కలిగిస్తోందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్ వేదికగా జరుగుతున్న సీజేపీ నిరసనలపై లాయర్ రింకీ ఛటర్జీ పోలీసులకు చేసిన ఫిర్యాదు కొత్త వివాదానికి తెరలేపింది. సీజేపీ ప్రతినిధులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్‌లతో పాటు ఈ ఆందోళనలను వెనుకుండి నడిపిస్తున్న నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, పోక్సో చట్టం కింద కేసు దాఖలు చేయాలని ఆమె కోరారు. నిరసనల సమయంలో 12 ఏళ్ల చిన్నారిపై పోలీసులు తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారని, అసభ్యంగా ప్రవర్తించారని అభిజీత్, సౌరవ్‌లు సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తూ దుష్ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు.

అసలు అంతటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న ఆందోళనా కార్యక్రమాల్లోకి చిన్న పిల్లలను తీసుకురావడానికి అనుమతించిన నిర్వాహకుల బాధ్యత ఏమిటని రింకీ ఛటర్జీ నిలదీశారు. పిల్లల భద్రతను పణంగా పెట్టి వారిని రాజకీయ నిరసనల్లోకి లాగడం, ఉపయోగించుకోవడం తీవ్రమైన నేరమని పేర్కొంటూ ఇందుకు కారణమైన అందరిపైనా బాధ్యత నిర్ధారించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ నిరసనల వెనుక కొందరు దళారులు, దేశ వ్యతిరేక శక్తుల హస్తం ఉందేమోనన్న తీవ్ర అనుమానాలను కూడా ఆమె వ్యక్తం చేశారు.

ఒకవైపు వాంగ్‌చుక్ ఆరోపణలతో కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండగా మరోవైపు బెంగాల్‌లో సీజేపీ నాయకులు, నిర్వాహకులపై పోక్సో కేసు డిమాండ్ రావడం నిరసన నిర్వాహకులను డిఫెన్స్‌లో పడేసింది. కేంద్రం వైఖరిపై వాంగ్‌చుక్ చేసిన కామెంట్లు, సీజేపీ నాయకులపై దాఖలైన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఒక ప్రధాన జాతీయ రాజకీయ, న్యాయపరమైన అంశంగా మారింది. ఈ రెండు పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం, సీజేపీ నాయకత్వం ఎలా స్పందిస్తాయో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.