Begin typing your search above and press return to search.

వద్దన్నా స్కూలుకు.. హోంవర్క్ ఒత్తిడి.. యూకేజీ ప్రణయ్ హఠాన్మరణం వెనుక చేదునిజాలు

ఆ పిచ్చి కుర్రాడేమో తిరుపతి, హైదరాబాద్ టూర్ వెళ్లి వచ్చాడట. ప్రయాణ బడలికతో పాటు హోంవర్క్ పూర్తి కాలేదనే భయం బాలుడిని పట్టి పీడించిందంటున్నారు.

By:  A.N.Kumar   |   21 Aug 2026 1:46 PM IST
వద్దన్నా స్కూలుకు.. హోంవర్క్ ఒత్తిడి.. యూకేజీ ప్రణయ్ హఠాన్మరణం వెనుక చేదునిజాలు
X

ఆంధ్రప్రదేశ్‌లో ఆరేళ్ల యూకేజీ కుర్రాడు ప్రణయ్ హఠాన్మరణం చెందడం ఖచ్చితంగా ఒక ఘోరమైన విషాదం. అయితే ఈ దారుణ ఘటనపై సోషల్ మీడియాలోనూ.. వార్తల్లోనూ జరుగుతున్న విశ్లేషణలు, వైద్యనిపుణుల అమూల్యమైన లీకులు.. మన విద్యా వ్యవస్థ వైఖరిని చూస్తుంటే బాధపడాలో లేక ఈ వ్యవస్థ లీలలకు నవ్వాలో అర్థం కాని పరిస్థితి దాపురించింది. ఆరేళ్ల పిడుగు హోంవర్క్ చేయలేదనే భయంతో గుండెపోటు వచ్చి చనిపోయాడనే ప్రచారం వింటుంటే ఐదేళ్లకే పిల్లలను దేశాన్ని ఏలే ఐఏఎస్, ఐపీఎస్‌లు లేదా అంగారక గ్రహానికి వెళ్లే శాస్త్రవేత్తలుగా మార్చేసే రేంజ్‌లో మన బడులు ప్రెజర్ కుక్కర్లుగా మారిపోయాయని స్పష్టమవుతోంది. ఈ విద్యా వ్యవస్థ సాధిస్తున్న ఊహించని పురోగతికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మరోవైపు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ ఈ ఘటనపై స్పందిస్తూ చిన్నారికి తీవ్రమైన ఒత్తిడి వల్ల గుండె ఆగిపోయిందేమోనని సందేహం వ్యక్తం చేస్తూ గతంలో ఎంసెట్ పరీక్షల సమయంలో విద్యార్థుల్లో జరిగిన సంఘటనలను ఉదాహరణగా తిరగేస్తున్నారు. అంటే ఇక్కడ ముచ్చటైన విషయం ఏమిటంటే ఆరేళ్ల యూకేజీ కుర్రాడికి ఇచ్చే ఏబీసీడీలు, రంగులు వేసే వర్క్‌షీట్లు ఇప్పుడు మన రాష్టంలో అత్యంత క్లిష్టమైన ఎంసెట్, నీట్ వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ స్థాయికి ఎదిగిపోయాయన్నమాట. ఆ పిచ్చి కుర్రాడేమో తిరుపతి, హైదరాబాద్ టూర్ వెళ్లి వచ్చాడట. ప్రయాణ బడలికతో పాటు హోంవర్క్ పూర్తి కాలేదనే భయం బాలుడిని పట్టి పీడించిందంటున్నారు. అంటే మూడేళ్లకే వీకెండ్ వెకేషన్స్.. ఆపై బడికి రాకపోతే మేనేజ్‌మెంట్ పంపే హెచ్చరికలు... ఇవన్నీ మన చిన్నార్లకు కాబోయే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాల ప్రెజర్‌ను ఆరేళ్లకే ప్రాక్టికల్‌గా రుచి చూపిస్తున్నాయి.

పాఠశాలల్లో పిల్లలు కిందపడిపోతే వెంటనే ప్రాథమిక చికిత్స అందించారా లేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చేలోపు తమ "విద్యా సంస్థ క్రమశిక్షణ" రికార్డును కాపాడుకునే పనిలో పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ వీడియోలు బయటపడి కంటిపాపను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నా బడి యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు అసలు వివరణ ఇవ్వడానికి వీలైనంత ఆలస్యం చేస్తోంది. "హోంవర్క్ ఎందుకు చేయలేదు?" అని క్లాస్‌రూమ్‌లో బెత్తంతోనో లేక గంభీరమైన గొంతుతోనో నిలదీసే ఉపాధ్యాయులకు, ఆ చిన్నారి అలసిపోయాడో లేక రాయలేక ఇబ్బంది పడుతున్నాడో కనీసం "ఏమైంది నాన్నా?" అని అడిగేంత ఓపిక.. సున్నితత్వం ఉండటం లేదు. బహుశా అంత ప్రేమగా అడిగితే తమ స్కూల్ బ్రాండ్ ఇమేజ్, ఐఐటీ ఫౌండేషన్ రేటింగ్ తగ్గిపోతుందేమోనని వారి భయం కావచ్చు. పిల్లాడి మృతికి గుండెపోటే కారణమా లేక అత్యవసర సమయంలో సరైన ఫస్ట్ ఎయిడ్ అందించలేని పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమా అనేది పోస్టుమార్టం, నివేదికలు వస్తే కానీ తేలదు.

ఏదేమైనా ఆరేళ్ల ప్రణయ్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం వెనుక పాఠశాలల వ్యాపార ధోరణి, హోంవర్క్ రాక్షసత్వం, తల్లిదండ్రుల ఆత్రుత స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిల్లల వెన్నుపై పుస్తకాల మోతతో పాటు గుండెల్లో ఒత్తిడిని కూడా సమానంగా నింపుతున్న నేటి చదువుల శాలా వ్యవస్థకు ఈ చిన్నారి మరణం ఒక చెంపపెట్టు లాంటిది.