Begin typing your search above and press return to search.

త్వరలో కొత్త గవర్నర్లు...ఏపీకి చాన్స్ ?

కొత్తగా గవర్నర్ల నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది.

By:  Satya P   |   19 Aug 2026 4:00 AM IST
త్వరలో కొత్త గవర్నర్లు...ఏపీకి చాన్స్ ?
X

కొత్తగా గవర్నర్ల నియామకాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది. బీజేపీ ఇప్పటికే తన పార్టీకి సంబంధించిన జాతీయ కార్యవర్గం ప్రకటించింది. అందులో చాలా మంది సీనియర్లను ఎంపీలను అకామిడేట్ చేసింది. దాంతో పాటు ఇపుడు మరో కీలకమైన నియామకాలను చేపట్టాలని నిర్ణయించుకుంది అని ఢిల్లీ వర్గాలలో జోరుగా వార్తలు ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. కొత్తగా గవర్నర్లను నియమించడం ద్వారా పలువురు కేంద్ర మంత్రులకు రాజ్ భవన్ దారి చూపిస్తారు అని అంటున్నారు.

ఆరు రాష్ట్రాలలో భర్తీ :

ఇదిలా ఉంటే దేశంలో ఆరు రాష్ట్రాలలో గవర్నర్ పదవులను కొత్తగా భర్తీ చేస్తారు అని తెలుస్తోంది. అంతే కాదు కొందరు గవర్నర్లను ప్రస్తుతం ఉన్న రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు బదిలీ చేస్తారు అని అంటున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణను దృష్టిలో పెట్టుకుని కొందరు కేంద్ర మంత్రులను గవర్నర్లుగా పంపుతారు అన్న ప్రచారం కూడా సాగుతోంది. అలాగే వచ్చే ఏడాది జరగనున్న ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా గవర్నర్ల నియామకం కీలక పాత్ర పోషించనుంది అని అంటున్నారు.

కొందరికి విశ్రాంతి :

ఇక చూస్తే కొంతమంది గవర్నర్లు సుదీర్ఘ కాలం రాజ్ భవన్ లలో పనిచేసి ఉన్నారు. వారికి ఇక విశ్రాంతి ఇస్తారు అని అంటున్నారు. బీజేపీ పాలన కేంద్రంలో వచ్చాక తొమ్మిదేళ్ల పాటు కూడా గవర్నర్లుగా వివిధ రాష్ట్రాలలో పనిచేసిన వారు ఉన్నారు. ఒక ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఆనందిబెన్ పటేల్, కర్ణాటక గవర్నర్ ధవన్ చంద్ గెహ్లాట్ ల పదవీ కాలం ముగుస్తోంది. దాంతో అక్కడ కొత్త వారికి అవకాశం ఇస్తారు అని అంటున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆనందిబెన్ పటేల్ జూలై 2019 నుండి కొనసాగుతున్నారు. ఆమె పదవీకాలం ఇప్పటికే ఐదేళ్లు దాటి ఏడేళ్లకు చేరింది. ఆనందీబెన్ పటేల్ ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక కాలం పనిచేసిన గవర్నర్‌గా రికార్డు సృష్టించారు.

పెద్ద ఎత్తున ఊహాగానాలు :

ఇదిలా ఉంటే కొత్త గవర్నర్ల నియామకంపై ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆమె ఆ పదవిలో కొనసాగుతారు. ఇక దేశంలోని కొన్ని రాజ్ భవన్ లలో కొత్త వారికి అవకాశం ఇచ్చేలా మార్పులు ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీకాలం రాష్ట్రపతి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మరో వైపు చూస్తే గవర్నర్లుగా రాజ్యాంగం పట్ల అవగాహన సమర్ధత సీనియారిటీ వంటివి దృష్టిలో ఉంచుకుని కొత్త వారి ఎంపిక జరగవచ్చు అని అంటున్నారు. ఎన్డీయే కూటమిలో మిత్రులకు కూడా చాన్స్ ఉండొచ్చు అని వినిపిస్తోంది.

టీడీపీకి లక్కీ చాన్స్ :

ఏపీలో అతి పెద్ద పార్టీగా కూటమిలో ఉంటూ కేంద్రంలోని ఎన్డీయే లో కూడా కీలకమైన మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశానికి గవర్నర్ పదవుల విషయంలో చాన్స్ ఉండొచ్చు అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ గా చాన్స్ ఇచ్చారు. ఇపుడు రెండవ చాన్స్ ఇస్తే అది దక్కేది ఎవరికీ అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంది. టీడీపీలో ఎంతో మంది అనుభవం కలిగిన ఆరు సీనియర్లు ఉన్నారు. మరి ఎవరికి రాజ్ భవన్ స్వాగతం పలుకుతుంది అన్నది చూడాల్సి ఉంది.