డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ‘అ‘న్యాయమైన’ భోజనం.. నీళ్ల చారులో ఆలూ తేలుతోంది జర భద్రం!
ప్రభుత్వ బడుల్లో చదివే చిన్నారులకు కడుపు నిండా పోషకాహారం పెట్టాలని ‘మధ్యాహ్న భోజన పథకం’ పెట్టారు.
By: A.N.Kumar | 6 Aug 2026 12:00 AM ISTప్రభుత్వ బడుల్లో చదివే చిన్నారులకు కడుపు నిండా పోషకాహారం పెట్టాలని ‘మధ్యాహ్న భోజన పథకం’ పెట్టారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా బడి పిల్లలకు లభిస్తున్న రాజభోజనం చూస్తే మాత్రం నెటిజన్ల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ పవర్ ఏంటో చూపించడానికి ఏమో గానీ అక్కడ వడ్డిస్తున్న కూరలో నీళ్లు ఏరులై పారుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోవడం ఖాయం. ఆ పళ్లెంలో పోసిన చారును చూస్తే కూర అనుకోవడానికి వీలులేదు. బహుశా ప్లేట్లు కడిగిన నీళ్లను పొరపాటున కూర గిన్నెలో పోశారేమో అన్నంత పల్చగా ఉంది. పాపం ఆ పసిపిల్లలు వరుసగా కూర్చొని ఆ నీళ్ల చారుతోనే చపాతీలు నములుతుంటే... “వాహ్! పౌష్టికాహారమంటే ఇది కదా” అని నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్లేట్ కడిగిన నీళ్లా... అదో స్పెషల్ సూపా?
ఈ దృశ్యాలు చూసిన జనాలు ఊరుకుంటారా? అధికారుల పనితీరుపై విమర్శల తోటకూర వండేస్తున్నారు. “ప్రభుత్వం కేటాయించే నిధులన్నీ ఏమైపోతున్నాయి? విద్యార్థుల ఆహారంలో కూడా అవినీతి పసందుగా ఉడికిపోతోందా?” అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. "డబుల్ ఇంజిన్ అంటే బడి పిల్లలకు ఇచ్చే పప్పులో నీళ్లను డబుల్ చేయడమేనా?" అంటూ ఘాటైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఇదే క్రమంలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పోలికలు మొదలయ్యాయి. ఇక్కడ వారంలో నాలుగైదు రోజులు కోడిగుడ్లు, పాలు, బలవర్ధకమైన చిక్కీలు, వేడివేడి పప్పు కూరగాయలతో భోజనం పెడుతుంటే... అక్కడ యూపీ బళ్లలో లెక్విడ్ డైట్ ఇస్తున్నందుకు ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులో అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.
అధికారులు స్పందిస్తారా? లేక సర్దుకుపోమంటారా?
ప్రస్తుతానికైతే ఈ వైరల్ దృశ్యాలపై సంబంధిత అధికారులు తమ వంతు "పరిశీలన" ప్రక్రియను స్టార్ట్ చేశారట. ఆ వీడియో ఎప్పటిది నిజంగానే పిల్లలకు నీళ్ల చారు వడ్డించారా లేదా ఆ నీళ్లలో ఆలూ ముక్కలు వెతికే పనిలో ఉన్నారా అనేది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా పిల్లల ఆరోగ్యంతో ఆటలాడే ఇటువంటి నిర్లక్ష్య రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే... రేపు పొద్దున నీళ్ల చారు స్థానంలో ఉత్త గాలి వడ్డించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
