'సిట్' ముందు సెలబ్రెటీలు.. బెట్టింగ్ యాప్ కేసులో మరో కీలక అప్ డేట్!
అవును... బెట్టింగ్ యాప్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోంది.
By: Raja Ch | 22 Nov 2025 11:46 AM ISTబెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ లను సినీ, టీవీ ఇండస్ట్రీకి చెందిన సుమారు పాతిక మంది సెలబ్రెటీలు ప్రచారం చేసినట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ సమయంలో ఇప్పటికే సుమారు 22 మంది సెలబ్రెటీల నుంచి సిట్ అధికారులు స్టేట్ మెంట్లు రికార్డ్ చేశారు. వీరిలో పలువురు హీరోలు, యాంకర్లు ఉన్నారు.
అవును... బెట్టింగ్ యాప్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, అనన్య నాగళ్లతో పాటు యాంకర్లు శ్యామల, విష్ణుప్రియ, హర్ష సాయి, టేస్టీ తేజతోపాటు మరికొందరి వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డ్ చేయగా... ఇంకా మంచు లక్ష్మి, రితూ చౌదరి, భయ్యా సన్నీ యదవ్ ల స్టేట్ మెంట్లు రికార్డ్ చేయాల్సి ఉంది!
వీరిలో.. మరింత సమయం కావాలని మంచు లక్ష్మి గడువు కోరగా.. రితూ చౌదరి బిగ్ బాస్ హౌస్ లోనూ, సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నారు! త్వరలో వీరి స్టేట్ మెంట్లు రికార్డ్ చేయనున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఇప్పటికే స్టేట్ మెంట్లు రికార్డు చేసిన సెలబ్రెటీల బ్యాంక్ లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు చెబుతున్నారు!
దగ్గుబాటి రానా వెర్షన్ ఇదే!:
కాగా ఇటీవల హైదరాబాద్ లోని సీఐడీ కార్యాలయంలో దగ్గుబాటి రానా సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... బెట్టింగ్ యాప్ ల ప్రచారం కేసులో రానాను సుమారు గంటన్నర పాటు సీఐడీ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించారు! ఈ సమయంలో.. అనుమతి ఉన్న యాప్ అని తెలిసిన తర్వాతే తాను ప్రచారం చేసినట్లు రానా.. సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిపారు!
'మళ్లీ ప్రమోట్ చేయను'!:
అదే సమయంలో.. ఇటీవల సిట్ విచారణకు విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా... బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ల నిమిత్తం తీసుకున్న పారితోషకాలు, కమిషన్లు, అగ్రిమెంట్ పత్రాలు, ఈ యాప్ ల వల్ల జరిగే పరిణామాలు, మొదలైనవాటి గురించి విజయ్ ను అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయనని విజయ్, సిట్ అధికారుల ముందు చెప్పినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
కాగా... బెట్టింగ్ యాప్స్ ల ప్రమోషన్లకు సంబంధించి పలువురు నటీనటులు, సెలబ్రెటీలపై వివిధ పోలీస్ స్టేషన్ లలో గతంలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. వాటి ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసి విచారించింది! అనంతరం.. ప్రభుత్వం ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించింది. దీంతో సిట్ ను ఏర్పాటు చేశారు.
