సిట్ ముందు గంటల పాటు వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతిలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ సుదీర్ఘంగా విచారించింది.
By: Satya P | 21 Nov 2025 12:50 AM ISTతిరుమల తిరుపతిలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ సుదీర్ఘంగా విచారించింది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంట్లోనే సిట్ అధికారులు సుబ్బారెడ్డిని విచారించారు. ఏకంగా ఏడు గంటల పాటు ఈ విచారణ సాగింది అని అంటున్నారు.
వివిధ కోణాలలో :
ఈ కేసుకు సంబంధించి వివిధ కోణాలలో సిట్ ఆయనను ప్రశ్నలు సంధించి తమకు అవసరమైన వివరాలు రాబట్టినట్లుగా చెబుతున్నారు. కల్తీ నెయ్యి సరఫరా గురించే ఈ ప్రశ్నలు అన్నీ సంధించారు అని అంటున్నారు. మరో వైపు ఆయన టీటీడీ చైర్మన్ గా ఉన్న కాలంలో బ్యాంక్ లావాదేవీలను కూడా సిట్ అధికారులు పరిశీలించారు అని అంటున్నారు. విచారణ అనంతరం సుబ్బారెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసి ఆయన సంతకం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది అవసరం అయితే మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరు కావాల్సి వస్తుందని కూడా పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.
నెయ్యి సరఫరాపై :
తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరాకు సంబంధించి చేసుకున్న ఒప్పందాల మీదనే మాజీ టీటీడీ చైర్మన్ ని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఇక దీని కంటే ముందు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నని సిట్ విచారించింది. ఆయన ఇచ్చిన సమాచారంతో సుబ్బారెడ్డిని ఇట్ అధికారులు విచారించారు అని అంటున్నారు.
ఆనాటి నిర్ణయాలు :
మరో వైపు 2019 నుంచి 2024 దాకా సాగిన వైసీపీ ప్రభుత్వంలో వైవీ సుబ్బారెడ్డి ఏకంగా నాలుగేళ్ళ పాటు రెండు టెర్ములు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే జరిగిన పలు ఒప్పందాల మీదనే సిట్ ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. ప్రత్యేకించి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా చేసిన సంస్థలు వాటి వివరాలు, ఆయా సంస్థలతో నాడు టీటీడీ కుదుర్చుకున్న ఒప్పందాలు అదే విధంగా ఛైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాలపై సిట్ అధికారులు పూర్తి వివరాలు రాబట్టినట్లుగా చెబుతున్నారు.
