ఆయన వృద్ధుడు..: అయోధ్య విరాళాల కేసులో షాకింగ్ పరిణామం
ఆయనతో పాటు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు సైతం ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
By: Garuda Media | 18 Aug 2026 4:25 PM ISTఉత్తరప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలను చోరీ చేసిన ఘటనలో శ్రీరామ జన్మభూమి ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కు ఎలాంటి సంబంధం లేదని కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. ఆయన వృద్ధుడని పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. ఆయన నిరంతర రామభక్తుడని.. చోరీ వ్యవహారం కూడా ఆయనకు తెలియదని స్పష్టం చేసింది. ఆయనతో పాటు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు సైతం ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ముమ్మర దర్యాప్తు చేసిన సిట్.. ఈ దర్యాప్తునకు సంబంధించిన తుది నివేదికను ఉత్తరప్రదేశ్ హోంశాఖకు అందించింది. అలానే.. శ్రీ రామ జన్మభూమి మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు కూడా ఇచ్చింది. తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా పలు సిఫారసులు చేసింది. అయితే.. ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సహా ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు క్లీన్ చిట్ ఇవ్వడం వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం.
ఇక, విరాళాల చోరీకి సంబంధించి ఇప్పటికే 8 మంది జైల్లో ఉన్నారు. అసలు కీలక సూత్రధారిగా భావిస్తున్న కాంట్రా క్టు ఉద్యోగికి ట్రస్టుతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఆయనకు ఎవరు సహకరించారు. అనే కోణంలో దర్యాప్తు సాగింది. తొలినాళ్ల చంపత్‌రాయ్‌కు అన్నీ తెలుసునని పేర్కొన్న అధికారులు ఆయనకు.. చోరీ సూత్రధారికి మధ్య సంభాషణలు కూడా సాగాయని వివరించారు. కానీ, తాజా తుది నివేదికలో మాత్రం ఆయనను వృద్ధుడిగా పేర్కొనడమే కాకుండా..అసలు సంబంధం లేదని చెప్పడం గమనార్హం.
బాలరామయ్యకు సమర్పించిన వందల కోట్ల రూపాయల విరాళాల్లో పదుల కోట్ల రూపాయల సొమ్ము దారి మళ్లిందని అధికారులు తేల్చారు. సీసీటీవీల కన్ను కప్పి మరీ.. ఈ దోపిడీ సాగిందని వివరించారు. 100 నోట్లతో కట్ట కట్టాల్సిన చోట మరో 50 నోట్లను చేర్చి.. దారి మళ్లించినట్టు పేర్కొంది. అలాగే.. లోదుస్తులలో కూడా నగదును దాచుకుని తీసుకువెళ్లారని ఇది చాలా వారాల పాటు కొనసాగిందని ప్రత్యేక దర్యాప్తు అధికారులు వివరించారు. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టాల్సి ఉంది.
