Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కాంలో వెరైటీ దొంగ.. రూ.కోట్లు కొట్టేసిన ఒడిశా కి'లేడీ'

లిక్కర్ స్కాంలో ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న లిక్కర్ స్కాంపై సీఐడీ సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది.

By:  Tupaki Political Desk   |   17 Nov 2025 5:11 PM IST
లిక్కర్ స్కాంలో వెరైటీ దొంగ.. రూ.కోట్లు కొట్టేసిన ఒడిశా కిలేడీ
X

లిక్కర్ స్కాంలో ఊహించని ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్నట్లు చెబుతున్న లిక్కర్ స్కాంపై సీఐడీ సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కమీషన్ల రూపంలో వసూలు చేసిన డబ్బు ఎక్కడుంది? అన్న కోణంలో విచారణ చేస్తున్న సిట్ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. గతంలో హైదరాబాదు శివార్లలో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి సన్నిహితుల వ్యవసాయ క్షేత్రంలో దాచిన రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా కేసిరెడ్డి మరో సహచరుడు లిక్కర్ స్కాం నిందితుడైన సైమన్ ప్రసన్న, ఆయన బావమరిది మరో నిందితుడు మోహన్ కొల్లిపురి ఇంట్లోనూ డబ్బు దాచగా, అందులో కొంత మొత్తం చోరీకి గురైన విషయం దర్యాప్తులో వెల్లడైంది. ఆ డబ్బు లెక్కల్లో చూపనది కావడంతో లిక్కర్ స్కాం నిందితులు గప్ చుప్ గా ఉండిపోయారు. ఇక సిట్ రంగ ప్రవేశం చేయడంతో చోరీ విషయం వెలుగు చూడటమే కాకుండా, చోరీచేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.

సిట్ పోలీసులు కథనం ప్రకారం మద్యం డిస్టలరీల నుంచి వసూలు చేసిన కమీషన్ డబ్బును ఏ1 రాజ్ కేసిరెడ్డి, ఏ9 కిరణ్ కుమార్ రెడ్డి సాయంతో హైదరాబాదులో పలు డెన్ లలో దాచారట.. ఇందులో ఏ41 సైమన్ ప్రసన్న, ఏ44 మోహన్ కొల్లిపురి ఇళ్లలోనూ కొంత నగదు దాచారని సమాచారం. సైమన్, మోహన్ బావాబావమరుదులు కాగా, మోహన్ బావమరిది విశాఖ వాసి అనిల్ కుమార్ కాలు విరిగిపోవడంతో హైదరాబాద్ కు తీసుకువచ్చారు. అనిల్ కుమార్ కు సపర్యలు చేయడానికి ఆయన ప్రియురాలైన ఒడిశాలోని కటక్ కు చెందిన రష్మిత ను పిలిపించారని సమాచారం. కటక్ లో స్పా, సెలూన్లు నడిపే రష్మిత అనిల్ కోసం హైదరాబాద్ రాగా, ఆయన బావ మోహన్ ఇంట్లో అట్ట పెట్టెల్లో నగదు దాచిన విషయం తెలుసుకుంది. ఎప్పటికప్పుడు కొందరు వ్యక్తులు వచ్చి డబ్బు పెడుతుండటాన్ని గమనించిన రష్మిత అది దొంగ డబ్బుగా భావించి కొట్టేయాలని ప్లాన్ చేసింది.

ఇక ఆలోచన వచ్చిందే తడువుగా కటక్ లో ఉన్న తన మరో ప్రియుడు ఈర్షద్ అహ్మద్ కు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. మోహన్ ఇంట్లో ఉన్న డబ్బంతా దొంగ డబ్బేనని, కొట్టేసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేరని తెలిపింది. దీంతో కటక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఈర్షద్ అహ్మద్ హైదరాబాద్ లోనే ఉండే తన స్నేహితుడు ముబారక్ అలీకి విషయం తెలియజేశాడు. వీరిద్దరు మరో ఆరుగురితో కలిసి 2023 జనవరి 13న రెక్కీ చేసి మోహన్ ఇంట్లో చోరీ చేశారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ ముఠా మోహన్ ఇంట్లోకి వెళ్లేందుకు రష్మిత సహకరించింది. తలుపు గడియ పెట్టకుండా వదిలేయడంతో చోరీకి వచ్చిన వారు దర్జాగా చొరబడి అట్టపెట్టెల్లో దాచిన డబ్బు కొట్టేశారు.

మొత్తం ఆరు అట్టపెట్టెల్లో పెట్టిన రూ.5.80 కోట్లను దొంగలు కొట్టేశారు. ముందుగా ముబారక్ అలీ ఇంటికి ఈ డబ్బు తరలించగా, అతడు రెండు పెట్టెలను కాజేశాడు. మిగిలిన 4 పెట్టెలను ఈర్షద్ కు ఇవ్వగా వాటితో అతడు, రష్మిత కలిసి కటక్ లో స్థిరాస్థులు కొనుగోలు చేశారు. రెండు రోజుల తర్వాత ఇంట్లో డబ్బు పోయిందని సైమన్ గుర్తించి.. ఏ9 ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేశాడు. అయితే డబ్బు విషయంలో రాజీ పడని ఏ9 నిందితుడు.. సైమన్, మోహన్ వద్ద ఉన్న డబ్బు, బంగారం అంతా తాకట్టు పెట్టించి కొంత డబ్బు వసూలు చేశాడు. అదేసమయంలో ఇంట్లో సీసీ పుటేజీ చెక్ చేయగా, రష్మిత ఆధ్వర్యంలో జరిగిన చోరీ బయటపడింది. అయితే ఈ విషయమై హైదరాబాదులో ఫిర్యాదు చేస్తే తెలిసిపోతుందని భావించి కటక్ లో ఫిర్యాదు చేశారు. కానీ, అక్కడ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ డబ్బు తిరిగి రాలేదని అంటున్నారు.

ఇక ఏ1 కేసిరెడ్డి, ఏ9 ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో సంబంధాలు ఉండటంతో సిట్ సైమన్, మోహన్ ను కూడా కొద్దిరోజుల క్రితం అరెస్టు చేసింది. అదేవిధంగా మోహన్ బావమరిది అనిల్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ మొత్తం వ్యవహరం వెలుగు చూసింది. అతడు చెప్పిన సమాచారంతో సిట్ పోలీసులు కటక్ లో ఉన్న రష్మిత, ఆమె ప్రియుడు ఈర్షద్, అతడి స్నేహితుడు హైదరాబాదుకు చెందిన ముబారక్ అలీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు లిక్కర్ సొమ్ముతో సొంత ఆస్తులు కొనుగోలు చేయడంతో వాటిని జప్తు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.