Begin typing your search above and press return to search.

రూ.10 కోట్ల లాటరీ విజేత టిక్కెట్ నంబర్ 327706... ఎవరీ లక్కీ డ్రైవర్!

అవును... అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో తెలియదు.. ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదు.

By:  Raja Ch   |   22 Jan 2026 1:52 PM IST
రూ.10 కోట్ల లాటరీ విజేత టిక్కెట్ నంబర్ 327706... ఎవరీ లక్కీ డ్రైవర్!
X

తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ డ్రైవర్ అదృష్టానికి సంబంధించిన వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఓ సగటు జీవి అయిన ఈ డ్రైవర్ కు సడన్ గా లాటరీలో రూ.10 కోట్లు దక్కింది. దీంతో.. అతని కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామంలోని బంధువులు, స్నేహితులు సైతం సంబరాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యలోనే.. ఈ డ్రైవర్ ఎక్సలేటర్ తో పాటు నక్కతోక కూడా తొక్కాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో తెలియదు.. ఎవరిని ఎప్పుడు వరిస్తుందో తెలియదు. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర ఫేమస్ లాటరీ 'లోహ్రీ – మకర సంక్రాంతి బంపర్ 2026'లో రూ.10 కోట్ల జాక్‌ పాట్ గెలుచుకున్నాడు సిర్సా జిల్లాకు చెందిన డ్రైవర్. రోజు వారీ వేతనంపై పనిచేసే ఈ డ్రైవర్ ఈ దెబ్బతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఇతడు ఈ టిక్కెట్ ను రూ.500 చెల్లించి కొన్నాడు. ఇలా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మూడోసారని చెబుతున్నాడు.

రానియా ప్రాంతంలోని మొహమ్మద్‌ పురియా గ్రామానికి చెందిన పృథ్వీ సింగ్.. కిలియన్‌ వాలి మండిలో లాటరీ టిక్కెట్ల విక్రేత మదన్ లాల్ నుండి కొనుగోలు చేసిన రూ.500 టికెట్‌ తో బంపర్ బహుమతిని పొందాడు. విజేత టికెట్ నంబర్ 327706. దీంతో... పృథ్వీ సింగ్ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో లాటరీ గెలిచిన వార్త తెలియడంతో.. బంధువులు, గ్రామస్తులు గుమిగూడి.. కరెన్సీ నోట్లతో చేసిన దండలతో, డ్రమ్స్ వాయిస్తూ స్వాగతం చెబుతున్నారు!

ఇక... 35 ఏళ్ల పృథ్వీ ఓ వైపు డ్రైవర్ గా పనిచేస్తూ.. ఆ పని లేనప్పుడు కూలికి వెళ్తుంటాడు! అతనికి భార్య సుమన్ రాణి, కూతురు రితిక, ఆరేళ్ల కుమారుడు దక్ష ఉన్నారు. వీరితో పాటు తన తండ్రి దేవి లాల్ కలిసి నివసిస్తున్నాడు. సుమన్ రాణి సమీపంలోని పాఠశాలలో ప్యూన్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన టిక్కెట్ విక్రేత మదన్ లాల్.. ఇప్పటివరకు తాను అమ్మిన టిక్కెట్లకు వచ్చిన అతిపెద్ద బహుమతి ఇదే అని అభివర్ణించాడు.

ఈ సందర్భంగా స్పందించిన పృథ్వీ... ఈ డబ్బును తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగించాలని, పిల్లల భవిష్యత్తుకు కొంత కేటాయించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ విజయం దైవిక ఆశీర్వాదంగా భావిస్తూ.. కుటుంబం తమ జీవితాల్లో ఇంత నాటకీయ మార్పును ఎప్పుడూ ఊహించలేదని సుమన్ రాణి అన్నారు. ఇక తనకు పెద్ద లగ్జరీ కారు కొనుగోలు చేయాలని ఉందని ఆరేళ్ల పృథ్వీ కొడుకు తన కోరికను బయటపెట్టాడు.

ఈ బహుమతిని పొందడానికి.. పృథ్వీ తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్‌ బుక్, టికెట్‌ ను చండీగఢ్‌ లోని లాటరీ కార్యాలయంలో సమర్పించాలి. ఈ క్రమంలో... తప్పనిసరి 30% పన్ను మినహాయింపు తర్వాత.. సుమారు రూ.7 కోట్లకు పైగా సొమ్ము నేరుగా అతని బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.