Begin typing your search above and press return to search.

ఓటు అంటే పౌరుడు సర్ !

ఓటు అంటే కేవలం రాజకీయాల్లో లెక్కలు కాదు, ఒకరిని గెలిపించడానికి మరొకరిని ఓడించడానికి ఉపయోగపడే సంఖ్య అంతకంటే కాదు.

By:  Satya P   |   24 Sept 2026 8:53 AM IST
ఓటు అంటే పౌరుడు సర్ !
X

ఓటు అంటే కేవలం రాజకీయాల్లో లెక్కలు కాదు, ఒకరిని గెలిపించడానికి మరొకరిని ఓడించడానికి ఉపయోగపడే సంఖ్య అంతకంటే కాదు. ఓటు అంటే ఒక బలమైన అభిప్రాయం. అంతే కాదు ఓటు వెనక ఓటరు ఉన్నాడు. అతడు ఈ దేశపు పౌరుడు. తన దేశం కోసం ప్రజాస్వామ్య యుతంగా జరిగే ఎన్నికల్లో పాలుపంచుకుని ఆ పవిత్రమైన క్రతువులో తాను ఒక భాగంగా మారి దేశ నిర్మాణం కోసం అడుగులు వేసే ఒక కీలక సూత్రధారి. ఓటు హక్కు కోసం గతంలో ఉద్యమాలే పెద్ద ఎత్తున జరిగాయి అన్నది ఈ తరానికి తెలిసో లేదో కానీ ఓటు హక్కు అన్నది జన్మ హక్కులాంటిది. ఓటరు అంటే ఇక రెండవ మాట లేకుండా ఆ దేశ పౌరుడే అని నిర్ధారించే బలమైన ఆధారం. అలాంటి ఓటుని సర్ ప్రక్రియ పేరుతో తొలగిస్తున్నారు. ఇందులో వారూ వీరూ తేడా లేదు, పేదా గొప్ప అంతరం లేదు. పాతికేళ్ళ నాటి వివరాలను అడిగి అది లేదు అంటే ఇక ఆ ఓటుకు చిల్లు పడినట్లే అని చెప్పకనే చెప్పేస్తున్నారు.

నోటీసులు ఇస్తున్నారు :

ఒక సర్ ప్రక్రియలో ఒక కీలక అంశం 2002లో ఓటు వేసి ఉండాలి. లేకపోతే తన తల్లి తండ్రులు కానీ తాత నాన్నమ్మలు కానీ ఓటేసి ఉంటే వాటితో మ్యాపింగ్ చేస్తున్నారు. అలా మ్యాపింగ్ కి కుదరని వారి ఓటుని సందేహంలో పెడుతున్నారు. వారికి ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు చేర్చినా తిరిగి నోటీసులు ఇస్తున్నారు మీరు ఓటర్లుగా నిరూపించుకోండని కోరుతున్నారు. ఇందులో కూడా పన్నెండు గుర్తింపు పొందిన పత్రాలు తీసుకుని రమ్మని కోరుతున్నారు. వాటిలో కూడా ఒక్క అక్షరం అటు ఇటూ అయినా మళ్ళీ డౌట్ లో పెడుతున్నారు. దాంతో భూమి పుట్టినప్పటి నుంచి దేశ పౌరుడిగా గర్వంగా చెప్పుకుని ఎన్నో ఎన్నికల్లో ఓటేసిన సీనియర్లు అలాగే పెద్దలు అంతా కూడా ఇదేమి పరీక్ష మాకు అని తెగ కలవరపడుతున్నారు. తెలంగాణాకే చెందిన ఒక ఎనభయేళ్ళ సీనియర్ పాత్రికేయుడు అయితే నా దగ్గర ఉన్న వివరాలు మీకు సరిపడడం లేదు, మీరు కోరిన రుజువులు నేను ఇవ్వలేను, నాకు ఈ ఏజ్ లో ఓటరు కాదని చెప్పి అవమానించినా చేసేది లేదు, ఎన్నికలలో ఓటు వేయలేనని బాధపడి ఊరుకుంటాను అని చెబుతూ ఏకంగా సోషల్ మీడియాలోనే పోస్టు పెట్టి దండం పెట్టేశారు.

ఓటరు జీవనాడిగా :

ప్రజాస్వామ్యానికి అసలైన ఇరుసుగా, కీలక సూత్రంగా ఇంధనంగా ఓటరు ఉంటాడు. అలాంటి ఓటర్ల సంఖ్య ప్రతీ ఎన్నికల్లో పెరుగుతోంది. ఎక్కువ మంది ఓటేయాలని ఎన్నికల సంఘం కూడా తరచూ కోరుతోంది. కానీ సర్ ప్రక్రియతో అనేక చోట్ల ఉన్న ఓట్లు పోతున్నాయి. అవి పదులూ వందలు కాదు, వేలల్లో లక్షల్లో ఆఖరికి కోట్లలో. ఈ రోజున దేశంలో 13 కోట్ల దాకా ఓటర్ల పరిస్థితి అయోమయంలో ఉంది అంటే ఇది చాలా పెద్ద నంబర్ గా చూస్తున్నారు. ఓటు కొత్తగా ఇవ్వాలి, ఉన్న ఓటు తీసేయడమేనా ప్రక్రియ అంటే అని ప్రజాస్వామ్య ప్రియులు ప్రశ్నిస్తున్నారు.

దొంగ ఓట్ల కోసం :

నిజమే దొంగ ఓట్లు తీసేయాల్సిందే. నకిలీ ఓట్ల భరతం పట్టాల్సిందే. దాని కోసం అందరినీ దోషులుగా దొంగలుగా చూడడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్నలను మేధావులు సంధిస్తున్నారు. ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు అంతా తగలబెట్టుకుంటామా అని నిలదీస్తున్నారు. అసలు సర్ ప్రక్రియ ఉద్దేశ్యం ఏమిటి ఆచరణలో ఏమి జరుగుతోంది అన్నది నిశితంగా పరిశీలిస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. ఏ మాత్రం అవగాహన లేని సిబ్బంది చేత ఈ ప్రక్రియ నడిపిస్తూ ఓట్లను నిర్ధాక్షిణ్యంగా తీసి పారేస్తూ ఓటరు గౌరవంతో అతని విశ్వాసంతో అన్నింటికీ మించి దేశంతో అతనికి ఉన్న సెంటిమెంట్ తో కూడా చెలగాటమాడుతున్నారని అంటున్నారు. సర్ ప్రక్రియను నిర్వహిస్తున్న యంత్రాంగంలో అత్యధిక శాతం మందికి సరైన అవగాహన లేకపోవడం వల్లనే ఓట్లు భారీగా గల్లంతు అవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా దీని మీద గౌరవనీయ అత్యున్నత రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం పున పరిశీలన చేయాలని అంతా కోరుతున్నారు.