పొలిటికల్ ప్రయోగశాలగా 'సింగరేణి'
అయితే.. ఇప్పటి వరకు సింగరేణిపై ఇలాంటి అవినీతి మరకలు కానీ.. ఎలాంటి అపవాదులు కానీ రాకపోవడం గమనార్హం.
By: Garuda Media | 22 Jan 2026 12:27 PM ISTసింగరేణి-ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 3 లక్షల మందికి పైగా కార్మికులు.. వేలాది మంది అధికారులు ఉన్న అతి పెద్ద బొగ్గుగని!. ఒకప్పుడు సింగరేణి అంటే..ఒక గౌరవం, మర్యాద ఉండేవి. అంతేకాదు.. ఇప్పటి వరకు ఈ బొగ్గు గనిపై ఎలాంటి ఆరోపణలు కూడా రాలేదు. దేశంలో అనేక బొగ్గుగనులు ఉన్నా..వాటిలో చాలా వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాయి. గతంలో కేంద్ర మంత్రిగా దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని బొగ్గు గని వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. సీబీఐ ఆయనను విచారించింది కూడా.
అయితే.. ఇప్పటి వరకు సింగరేణిపై ఇలాంటి అవినీతి మరకలు కానీ.. ఎలాంటి అపవాదులు కానీ రాకపోవడం గమనార్హం. అలాంటిది తొలిసారి సింగరేణి పరిధిలోని ఒడిసాలో ఉన్న నైనీ గనిపై మాత్రం రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీలోనే ఇద్దరు మంత్రులు ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవి వాస్తవమో కాదో తెలియదు కానీ..మొత్తంగా కేటాయిం పులకు సంబంధించిన నోటిఫికేషన్‌నే రద్దు చేసే పరిస్థితి రావడం.. మీడియా కూడా.. ఈ వ్యవహారంపై రెండుగా చీలిపోవడం వంటివి పెద్ద చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితి రావడం.. సింగరేణికి మాయని మచ్చగా మారిందని కార్మికులు చెబుతున్నారు.
సీబీఐ విచారణ..
ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలని కొన్ని పార్టీల నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా బీజేపీలోనే కొందరు నాయకులు ఈ డిమాండ్‌ను తెరమీదికి తీసుకువచ్చారు. అయితే.. రాష్ట్రం కనుక సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరితే.. తాము చేస్తామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి,తెలంగాణకే చెందిన గంగాపురం కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. వాస్తవానికి కేంద్రం సీబీఐ వేయాలని అనుకుంటే.. తిరుగులేదు. తమిళనాడు సహా.. పలు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సీబీఐని వినియోగిస్తున్నారు. కానీ, తెలంగాణకు వచ్చే సరికి మాత్రం రాష్ట్రం నుంచి కన్సర్న్(అనుమతి) కావాలని కోరడం గమనార్హం.
ఈ వ్యవహారం ఇలా ఉంటే.. దేశంలోనేకాదు.. ప్రపంచ స్థాయిలో మంచి పేరున్న సింగరేణికి ఇప్పుడు నైనీ గనుల వ్యవహారం వివాదంగా మారడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందనే ప్రచారం జరుగుతోంది. గనులను దక్కించుకునే వ్యవహారంలో కొందరు చూపిన దూకుడు వ్యవహారం.. రాజకీయ ప్రమేయం.. వంటివి గనిని రాజకీయ దుమారం దిశగా నడిపిస్తోంది. దీనివల్ల అంతర్జాతీయంగా పేరు దెబ్బతింటే.. చివరకు ఆ ప్రభావం రాష్ట్రంపైనే పడుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
