ప్రభుత్వ ఉద్యోగులకు డేటింగ్ సర్వీస్.. పెళ్లిళ్ల కోసం సరికొత్త ప్రయోగం!
ప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలను తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో జనాభా తగ్గుదల ఒకటి.
By: A.N.Kumar | 5 Oct 2026 8:07 AM ISTప్రపంచవ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందిన దేశాలను తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో జనాభా తగ్గుదల ఒకటి. మరీ ముఖ్యంగా యువత వివాహాలకు దూరంగా ఉండటం.. ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లలను కనేందుకు ఆసక్తి చూపకపోవడంతో జననాల రేటు గణనీయంగా పడిపోతోంది. ఈ సవాలును అధిగమించడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు రకరకాల ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. అయితే ఆసియా సంపన్న దేశమైన సింగపూర్ మాత్రం అందరికంటే ఒక అడుగు ముందుకేసి.. ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తన ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న యువ ఉద్యోగుల కోసం ఏకంగా ఒక ప్రత్యేక డేటింగ్ వేదికను అందుబాటులోకి తీసుకువచ్చింది.
'ఫస్ట్ డేట్' పేరుతో సరికొత్త ప్లాట్‌ఫామ్
సింగపూర్ ప్రభుత్వం 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న పెళ్లికాని ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ‘ఫస్ట్ డేట్’ అనే డేటింగ్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగానికి చెందిన యువతీ యువకులకు ఒకే విధమైన జీవనశైలి, వృత్తిపరమైన బాధ్యతలు, పని వేళలు ఉంటాయనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశారు.
ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకోవడానికి ఉద్యోగులు దేశ నేషనల్ డిజిటల్ ఐడెంటిటీ (ఎన్.డీఐ) వ్యవస్థ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత తమ వ్యక్తిగత ఆసక్తులు, ప్రాధాన్యతలను నమోదు చేస్తే.. ఈ వ్యవస్థ వారి అభిరుచులకు సరిపోయే సరైన భాగస్వామిని ఎంపిక చేసి 'డేట్'కు వెళ్లే అవకాశం కల్పిస్తుంది.
అరేంజ్డ్ మ్యారేజ్ కాదు.. ఒక వేదిక మాత్రమే..
ప్రభుత్వమే నేరుగా వివాహాలు జరిపించదు. ఇది కేవలం యువత ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి కల్పించిన ఒక అవకాశం మాత్రమే. ఈ వ్యవస్థ సూచించిన ప్రొఫైల్ నచ్చితే.. ఇరువైపులా అంగీకారం ఉన్నప్పుడే వారు డేటింగ్‌కు వెళ్లవచ్చు. ఆ తర్వాత ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా అనేది పూర్తిగా ఆ వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.
జననాల రేటు పెంపే లక్ష్యం
సింగపూర్‌లో జీవన వ్యయం భారీగా పెరిగిపోవడం.. కెరీర్ రేసులో పడిపోవడం.. పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులు వంటి కారణాల వల్ల చాలామంది వివాహాలను వాయిదా వేస్తున్నారు. ఫలితంగా ఆ దేశంలో జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఉద్యోగుల మధ్య పరిచయాలు పెంచి.. వాటిని వివాహాల వరకు నడిపించేందుకు ఈ డేటింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రజల్లో భిన్నాభిప్రాయాలు.. నిపుణుల హెచ్చరికలు
ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పని ఒత్తిడిలో పడి భాగస్వామిని వెతుక్కోలేకపోతున్న వారికి ఇది మంచి అవకాశమని కొందరు మద్దతు ఇస్తుండగా.. వ్యక్తిగత జీవితాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరైంది కాదని మరికొందరు విమర్శిస్తున్నారు. ఉద్యోగుల డేటా భద్రత, గోప్యత ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
మరోవైపు కేవలం డేటింగ్ యాప్‌లు లేదా సర్వీసుల ద్వారా జనాభా సంక్షోభం సమసిపోదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. యువత పెళ్లి, కుటుంబ నిర్మాణం పట్ల ఆసక్తి చూపించాలంటే సమాజంలో ఉన్న ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడంతో పాటు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
ఏది ఏమైనా ఉద్యోగంతో పాటు జీవిత భాగస్వామిని వెతుక్కోవడానికి కూడా ప్రభుత్వమే మార్గం చూపడం ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
