Begin typing your search above and press return to search.

భారత్ లో బిగ్ అరెస్ట్ చేసిన ఎఫ్.బీ.ఐ

తన ఆరేళ్ల కొడుకుని హత్య చేసి పారిపోయిన టెక్సాస్ మహిళ సింధి రోడ్రిగ్జ్ సింగ్‌ను ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులు భారత్‌లో అరెస్టు చేశారు.

By:  A.N.Kumar   |   22 Aug 2025 12:00 AM IST
భారత్ లో బిగ్ అరెస్ట్ చేసిన ఎఫ్.బీ.ఐ
X

తన ఆరేళ్ల కొడుకుని హత్య చేసి పారిపోయిన టెక్సాస్ మహిళ సింధి రోడ్రిగ్జ్ సింగ్‌ను ఎఫ్‌బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) అధికారులు భారత్‌లో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సింధి రోడ్రిగ్జ్ సింగ్ తన కొడుకును చంపి, మార్చి 2023లో కుటుంబంతో సహా విమానంలో భారత్‌కు పారిపోయింది. పోలీసులు ఆమె కొడుకు గురించి విచారించినప్పుడు, ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని పటేల్ పేర్కొన్నారు.

సింధి రోడ్రిగ్జ్ సింగ్‌పై ప్రాసిక్యూషన్‌ను తప్పించుకోవడానికి అక్రమంగా పారిపోవడం.. 10 సంవత్సరాల లోపు వయస్సు గల వ్యక్తిని హత్య చేయడం (క్యాపిటల్ మర్డర్) వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. ఎఫ్‌బీఐ ఆమెను తమ 'టాప్ 10 మోస్ట్ వాంటెడ్ ఫ్యూజిటివ్' జాబితాలో చేర్చింది. ఆమె ఆచూకీ తెలిపిన వారికి $250,000 రివార్డు కూడా ప్రకటించారు.

- కేసు వివరాలివీ..

అక్టోబర్ 2022న ఆరేళ్ల నోయెల్ అల్వారెజ్ అనే బాలుడిని చివరిసారిగా చూశారు. మార్చి 2023 నోయెల్ కనిపించడం లేదని ఫిర్యాదు అందింది. పోలీసులు విచారణకు వచ్చినప్పుడు, సింధి తన కొడుకు మెక్సికోలో ఉన్నాడని అబద్ధం చెప్పింది.

రెండు రోజుల తర్వాత సింధి తన భర్త అర్ష్‌దీప్ సింగ్.. ఆరుగురు పిల్లలతో కలిసి భారత్‌కు పారిపోయింది. నవంబర్ 2023న టెక్సాస్‌లోని జిల్లా కోర్టు ఆమెపై 'క్యాపిటల్ మర్డర్' అభియోగాలను నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

- అరెస్టు.. అప్పగింత

కాష్ పటేల్ తన ట్వీట్‌లో ఆమెను ఎక్కడ అరెస్టు చేశారో స్పష్టం చేయలేదు. కానీ ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం, భారత అధికారులు.. ఇంటర్‌పోల్ సహకారంతో ఆమెను భారత్‌లో పట్టుకున్నారు. అరెస్టు తర్వాత, ఆమెను అమెరికాకు తిరిగి అప్పగించారు. టెక్సాస్ అధికారులకు ఆమెను అప్పగిస్తారు. నోయెల్ మృతికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.