సింహాచలం అప్పన్న ఆలయం కొత్త రికార్డు
సింహాచలం వచ్చే భక్తులకు అన్నదానం చేయాలన్న మంచి ఆలోచన వచ్చింది అక్కడ పనిచేసే ఉద్యోగులకు.
By: Satya P | 14 Aug 2025 3:36 PM ISTవిశాఖ జిల్లాలో ఉన్న సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కొత్త రికార్డుని సృష్టించింది. స్వామివారి నిత్య అన్నప్రసాదానికి ఈ రోజుతో అక్షరాల 36 ఏళ్ళు పూర్తి అయ్యాయి. సింహాచలం అప్పన్న స్వామి అంటే ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవంగా పేర్కొనాలి. అంతే కాదు స్వామి వారి కరుణా కటాక్షం కోసం ఒడిసా చత్తీస్ ఘడ్, తెలంగాణా సహా ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.
అందుకే అలా శ్రీకారం :
అలా ఆలయానికి ప్రతీ రోజూ వచ్చే వేలాది భక్తులకు ఆకలి అన్న మాట లేకుండా చూడాలన్న పవిత్ర లక్ష్యంతో ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ఒక అద్భుత కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. ఎక్కడా ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతోంది. అన్ని దానాల కంటే అన్నదానం శ్రేష్ఠమని అందులోనూ భగవంతుడి సాన్నిధ్యంలో భక్తుల ఆకలి తీర్చడంకోసం అన్న ప్రసాదాన్ని అందించడం మరింత పుణ్యమని నమ్మకంతో నిత్యాన్నదాన పథకాన్ని సింహాచలం దేవస్థానంలో బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు.
వారే పునాదిగా :
సింహాచలం వచ్చే భక్తులకు అన్నదానం చేయాలన్న మంచి ఆలోచన వచ్చింది అక్కడ పనిచేసే ఉద్యోగులకు. అలా 1989 ఆగస్టు 14న తొలిసారి దేవాలయ ఉద్యోగులు తమ జీతాల నుంచి అంతా తలో కొంత మొత్తాన్ని వేసుకుని ఏకంగా 50 వేల రూపాయలను భూరి విరాళంగా ఆలయానికి సమర్పించారు. అలా అప్పన్న స్వామి వారి నిత్యాన్న ప్రసాదానికి శ్రీకారం చుట్టారు. అది లగాయితూ అన్నదానం ఒక మహత్తరమైన యజ్ఞంగా కొనసాగుతూ వస్తోంది.
వడ్డీతోనే పధకం అమలు :
విరాళంగా వచ్చిన తొలి మొత్తం యాభై వేలను బ్యాంకులో వేసి దాని నుంచి వచ్చిన వడ్డీతో అన్న దానం పధకం ప్రారంభించారు. ఆ మీదట అన్నదానానికి భక్తులు దాతలు తమ వంతుగా విరాళాలు ఇస్తూనే ఉన్నారు అలా కోట్ల రూపాయల విరాళాలు, వాటిపై వచ్చిన వడ్డీతో ఏ రోజుకీ ఏ పేచీ పూచీ లేకుండా ఈ పథకం నిరాటకంగా సాగుతోంది అని అంటున్నారు.
భారీ మొత్తాలతో డిపాజిట్లు :
ఇక ఈ మూడున్నర దశాబ్దాల కోట్ల రూపాయలు అన్న దానానికి విరాళాలుగా వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చూస్తే డిపాజిట్ మొత్తం 36 కోట్ల 45 లక్షల 41 వేల 720 రూపాయలుగా ఉంది. దీని నుంచి ప్రతీ ఆర్థిక సంవత్సరానికి గాను. రెండున్నర కోట్ల రూపాయల దాకా వడ్డీ వస్తుంది. ఆ వడ్డీతో మాత్రమే స్వామివారి నిత్యాన్న ప్రసాదం పథకం నిరాటంకంగా, విజయవంతంగా కొనసాగుతోంది అని ఆలయ అధికారులు తెలియచేస్తున్నరు.
ఏడాదికి లక్షల మంది :
ఈ పధకం ద్వారా స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఏడాది కనీసంగా పదిహేను లక్షల మంది దాకా అన్న ప్రసాదాలు స్వీకరిస్తారు దేవాలయ రికార్డుల ప్రకారం ఈ ఏడాదిలోనే ఆగస్టు నెల దాకా సుమారు పది లక్షలకు పైగా భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారని అధికారులు వెల్లడించారు. 37వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఈ అన్నదాన మహా యజ్ఞం దాతల సహకారం భక్తుల విశ్వాసంతో మరింత విజయవంతంగా సాగాలని అధికారులు కోరుతున్నారు.
