Begin typing your search above and press return to search.

వెండి పర్వతారోహణం... కిలో రూ.4 లక్షలు!

అవును... నిన్నటి వరకూ కొండెక్కిన వెండి ధరలు, తాజాగా పర్వతారోహణం దిశగా పయణిస్తున్నాయి.

By:  Raja Ch   |   28 Jan 2026 11:30 AM IST
వెండి పర్వతారోహణం... కిలో రూ.4 లక్షలు!
X

గత కొంతకాలంగా వెండి ధర విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. జనవరి 1, 2025న కిలో వెండి ధర రూ.86,017గా ఉండగా.. జనవరి 20, 2026 నాటి రూ.3 లక్షలు దాటి కొండెక్కింది! అయితే.. కొండెక్కితే సరిపోదని భావించిందో ఏమో కానీ ఇప్పుడు పర్వతారోహణం దిశగా పయణిస్తోంది. తాజాగా పెరిగిన ధరలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

అవును... నిన్నటి వరకూ కొండెక్కిన వెండి ధరలు, తాజాగా పర్వతారోహణం దిశగా పయణిస్తున్నాయి. ఈ క్రమంలో... హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ లో జనవరి 28, 2025 న వెండి ధర ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. ఇందులో భాగంగా.. కిలో వెండి రేటు ఏకంగా రూ.13వేలు పెరిగి రూ.4,00,000కు చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలోనూ దాదాపు ఇదే ధర కొనసాగుతుందని చెబుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో స్వల్ప తేడాలుండొచ్చు!

వాస్తవానికి జనవరి 1, 2025న కిలో వెండి ధర రూ.86,017గా ఉండగా.. ఇది అప్పటికి భారతదేశంలో ఆల్ టైమ్ గరిష్టం. ఇక.. ఒక నెల తర్వాత ఫిబ్రవరి 3న వెండి రూ.7,516 పెరిగి రూ.93,533కి చేరుకున్న ఈ ధర.. పెరుగుదల కంటిన్యూ అవుతూ 2025 చివరి నాటికి 170% పెరిగింది. ఈ క్రమంలో జనవరి 20, 2026 నాటికి రూ.3 లక్షలు దాటి కొండెక్కింది! ఇది కొనసాగిస్తూ ఈనెల 27 నాటికి రూ.3,87,000గా ఉన్న ధర ఒక్కరోజులోనే రూ.13వేలు పెరిగి... తాజాగా రూ.4 లక్షల మార్కును తాకింది.

ఈ నేపథ్యంలో... ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ కాస్త బలహీనపడటం, గ్రీన్‌ లాండ్‌ స్వాధీనానికి ట్రంప్‌ దూకుడుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. సురక్షితమని భావిస్తూ బంగారం, వెండిపైకి పెట్టుబడులు రావడమే వీటి ధరల పెరుగుదలకు కారణమని అంటున్నారు. ఇదే సమయంలో... కొత్త ఇంధన రంగాలు, విద్యుత్తు వాహనాల తయారీ రంగాలలో వెండికి ఉన్న గిరాకీ అంతకంతకూ పెరుగుతుండటం కూడా ఈ ధరల భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు.

మరోవైపు బంగారం ధరల్లోనూ పెరుగుదల కంటిన్యూ అవుతోంది. ఇందులో భాగంగా... 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,220 పెరిగి రూ.1,65,170గా ఉండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,950 ఎగబాకి రూ.1,51,400 పలుకుతోంది! దీంతో... ఈ రెండు లోహాల ధరల్లోనూ తగ్గుదల ఇప్పట్లో ఉండకపోవచ్చని.. ఇవి ఇలా పెరుగుతూనే ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతంది!