Begin typing your search above and press return to search.

వైసీపీ సీనియర్ల మౌనం- దేనికి సంకేతం ?

వైసీపీ రెండేళ్ళ క్రితం దాకా ఏపీని ఏలిన పార్టీ. రెండు దఫాలుగా మంత్రులను మార్చి దాదాపుగా నలభై మందికి పైగా నేతలకు కేబినెట్ లో అవకాశాలను జగన్ ఇచ్చారు.

By:  Satya P   |   3 Feb 2026 11:06 PM IST
వైసీపీ సీనియర్ల మౌనం- దేనికి సంకేతం ?
X

వైసీపీ రెండేళ్ళ క్రితం దాకా ఏపీని ఏలిన పార్టీ. రెండు దఫాలుగా మంత్రులను మార్చి దాదాపుగా నలభై మందికి పైగా నేతలకు కేబినెట్ లో అవకాశాలను జగన్ ఇచ్చారు. ఇక ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఇతర కీలక పదవులలో చాలా మంది నేతలు ఉన్నారు. వైసీపీలో ఆది నుంచి సీనియర్ నేతలు అధికంగానే ఉన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా వైసీపీ సంక్షోభం ఎదుర్కొంటూంటే సీనియర్లు మౌన ముద్రలో ఉండడం అయితే చర్చకు దారి తీస్తోంది.

సహచరుల మీద అలా :

మాజీ మంత్రులు ఇద్దరి ఇళ్ళ మీద వరుసగా దాడులు జరిగాయి. ఏకంగా పెట్రో బాంబులే వేసి ఇళ్ళ మీద పెద్ద ఎత్తున ఎటాక్ చేశారు. అఫ్ కోర్స్ ఈ మాజీ మంత్రులు ఏమేమి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అన్నది వేరే విషయం. దానిని చట్ట ప్రకారం వారు ఎదుర్కోవాలి. తగిన విధంగా ఆ పని జరుగుతుంది. కానీ నేరుగా ఇంటి మీదకు వచ్చి దాడులు చేయడం అంటే సీరియస్ ఇష్యూగా వైసీపీలో ఎంత మంది భావిస్తున్నారు అన్నదే చర్చగా ఉంది.

వారు తప్పించి :

ఇక వైసీపీలో చూస్తే స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. అదే విధంగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రియాక్ట్ అయ్యారు. మాజీ మంత్రులు పేర్ని నాని అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు సైతం గట్టిగానే సౌండ్ చేశారు అయితే ఇంకా చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు కదా సీనియర్ నేతలు ఉన్నారు కదా అన్న చర్చ వస్తోంది. ఉత్తరాంధ్రాలో చూస్తే మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు క్రిష్ణదాస్ వంటి వారు ఉంటే విశాఖకు చెందిన గుడివాడ అమర్నాధ్ మాత్రమే రియాక్ట్ కావడం మీద కూడా చర్చ సాగుతోంది.

ఉప ముఖ్యమంత్రులుగా :

వైసీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రులుగా చాలా మంది చేశారు. అయితే వీరంతా ఫుల్ సైలెంట్ మోడ్ లో ఉండడం విశేషం. తమ సొంత జిల్లా కావడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ హోం మంత్రి కూడా అయిన మేకతోటి సుచరిత ఈ ఘటనల మీద ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముఖంగా మాత్రమే రియాక్ట్ అయ్యారు. కానీ కీలక నేతల సంగతేంటి అన్నదే అందరినీ ఆలోచనలో పడవేస్తోంది.

అసంతృప్తినా లేక :

పార్టీ పోకడల పట్ల అసంతృప్తితో ఉన్నారా లేక తనకు ఎందుకు అన్న ధోరణిలో సీనియర్ నేతలు సైలెంట్ అయ్యారా అన్నదే అర్ధం కావడం లేదు అని అంటున్నారు. జోగి రమేష్ ఇంటి మీద పెట్రో బాంబులు వేశారని ఆ సమయంలో ఆయన ఇంట్లో ఉంటే పోయేవాడు అని పేర్ని నాని మీడియా ముందు చెప్పుకొచ్చారు. అంబటి ఇంట్లో కారు కింద మంట పెట్టారని అక్కడ పెట్రోల్ పేలితే ఏమవుతుందో ఎవరికి తెలుసు అని జనసేనకు రాజీనామా చేసిన మహిళా ఆడ్వకేట్ రజనీ అన్నారు. అంటే చావు అంచుల దాకా ఈ ఇద్దరు మాజీ మంత్రులు వెళ్ళారని దాడి ఘటన మీద అంతా అంటున్న మాట.

అత్యంత క్లిష్ట దశలో :

కానీ వైసీపీలో చాలా మంది సీనియర్లు మాత్రం దీనిని అంత తీవ్రంగా తీసుకోవడం లేదా అన్నదే చర్చగా ఉంది. నోరా వీపుకు చేటు అని సామెత ఉంది. అలా కొందరు వైసీపీ నేతలు అతి ఉత్సాహంతో ఈ రకమైన పరిస్థితులు కోరి తెచ్చుకుంటున్నారని అన్న భావన చాలా మంది నేతలలో ఉండబట్టే తామెందుకు ఈ గబ్బు రాజకీయాల జోలికి అని మౌనం వహించారు అని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ అత్యంత క్లిష్ట దశలో ఉంది. అందరినీ కలుపుకుని పోవాల్సిఉంది. మరి అది ఎలాగో అధినాయకత్వం చూసుకోవాలని అంటున్నారు.