వైసీపీకి లేట్ గానైనా మ్యాటర్ అర్ధం అవుతోందా ?
వైసీపీ నిర్ణయాలు కూడా చాలా లేట్ గా ఉంటాయి. పార్టీకి నష్టం జరుగ్తుంది అంటే టీడీపీ తక్షణం రియాక్ట్ అవుతుంది.
By: Satya P | 17 Dec 2025 1:00 PM ISTలేట్ గా అయినా లేటెస్ట్ గా అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. కానీ వైసీపీ చేసే రాజకీయాల విషయంలో లేట్ గానే అంటే ఒక జీవిత కాలం లేట్ గానే చూడాలని అంటున్నారు. రాజకీయాలు అన్నవి డైనమిక్ గా ఉంటాయి. ఇపుడు సోషల్ మీడియా యుగం సాగుతోంది. దాంతో ప్రతీ సెకనూ కీలకమే. పూర్తి అలెర్ట్ గా ఉంటూ దేనికైనా స్పందించాలి. ఏ విషయంలో అయినా వెంటనే తేల్చేసుకోవాలి. కానీ వైసీపీ మాత్రం ఇంకా రోటీన్ పాలిటిక్స్ చేస్తోంది అన్న భావన ఉంది. పైగా జనాలకు అన్నీ తెలుసు అని దేవుడు చూసుకుంటాడు అన్న ఫిలాసఫీని దాటి ముందుకు రావడం లేదు అని అంటున్నారు
గట్టిగా చెప్పాల్సిందే :
ఏ విషయం అయినా జనాలకు విడమరచి చెప్పాల్సిందే. ఒకటికి పది కాదు వందసార్లు చెప్పాల్సిందే. ఈ విషయంలో చంద్రబాబు చేస్తున్నది కరెక్ట్ అని అంతా అంటారు. ఆయన చెప్పినదే పదే పదే చెబుతారు అని అంటారు కానీ అది చాలా అవసరం నేటి రాజకీయానికి అని ఎక్కువ మంది అభిప్రాయపడతారు బాబు చెప్పేది ఎపుడూ విన్న వారి గురించి కాదు వినని వారి గురించే. ఒకసారి చెబితే కొందరికే రీచ్ అవుతుంది. వంద సార్లు చెబితే అందరికీ అది చేరుతుంది. ఇదే బాబు మార్క్ సూత్రం. వైసీపీకి ఇంకా అలవడని రాజకీయ చిత్రం.
నష్టం జరిగినా :
వైసీపీ నిర్ణయాలు కూడా చాలా లేట్ గా ఉంటాయి. పార్టీకి నష్టం జరుగ్తుంది అంటే టీడీపీ తక్షణం రియాక్ట్ అవుతుంది. వైసీపీ విషయంలో అలా ఉండదని అంటారు చాలా మంది నేతలు అధికారంలో ఉన్నపుడూ ఇపుడూ కూడా నోరు చేసుకుంటూ ఉన్నారు. అయితే వారి విషయంలో వైసీపీ ఎపుడూ జనాలకే వదిలేసి సైలెంట్ గానే చూస్తుంది అని అంటారు. అలా చాలా విధాలుగా నష్టాలు జరిగాయని, నిందలు నిజాలు అయ్యాయని తాము ఎంతో నష్టపోయామని వైసీపీ ఇప్పటికి గ్రహించింది అని అంటున్నారు.
బోరుగడ్డ మ్యాటర్ :
ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ అన్న అతను వైసీపీ మనిషిగానే చలామణీ అయ్యాడు. అతను సామాజిక మాధ్యమాలలో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆనాటి విపక్షాలను నేతలను గట్టిగా టార్గెట్ చేశాడు. అత్యంత జుగుస్పాకరంగా ఆయన పెట్టే పోస్టులు ఉన్నా కూడా వైసీపీ అయితే పట్టించుకోలేదు అని విమర్శలు ఉన్నాయి. పైగా తాను వైసీపీ మనిషిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూంటే వైసీపీ మాత్రం ఏ విధంగానూ రియాక్ట్ కాలేదు, ఇన్నాళ్ళకు ఇపుడు తాపీగా ఆయన మా పార్టీ కాదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. అదే అప్పట్లోనే ఇచ్చి ఉంటే ఆయన ప్రకటనల వల్ల వచ్చిన నెగిటివిటీ పార్టీకి అంటి ఉండేది కాదు కదా అన్నది కూడా చర్చగా ఉంది.
దువ్వాడ మీద కూడా :
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నేత దువ్వాడ శ్రీనివాస్ విషయంలో కూడా చాలా లేట్ గానే పార్టీ రియాక్ట్ అయి సస్పెండ్ వేటు వేసింది అన్న చర్చ ఉంది. ఆయన వ్యక్తిగత వ్యవహారాలు రచ్చగా మారి పార్టీకి ఇబ్బందిగా ఉన్నా చాలా కాలం వరకూ పట్టించుకోలేదని అంటున్నారు. ఇక ఇపుడు కూడా దువ్వాడ తాను పార్టీ మనిషిని అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను టార్గెట్ చేస్తున్న ప్రత్యర్ధులు వైసీపీ ఖాతాలోనే అన్నీ వేస్తున్నారు. దాంతో దువ్వాడ విషయంలో కూడా పార్టీ ఒక కీలకమైన ప్రకటన చేసేందుకు సమాయత్తం అవుతోంది అని అంటున్నారు. ఆయన ఒక్కరని కాదు చాలా మంది నేతల విషయంలో వైసీపీ మా పార్టీ కాదు, మాకు సంబంధం లేదు అని వదిలించుకునేందుకు ఇపుడు రెడీ అవుతోంది అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఈ పని చేస్తే కనుక చాలా పెద్ద లిస్ట్ నే ముందుంచుకోవాలేమో అని సెటైర్లు పడుతున్నాయట.
