సీఎం ఎవరు.. సిద్దూనా.. డీకేనా ?
కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పుపై గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తననే కొనసాగించాలని పట్టుబడుతున్నారు.
By: A.N.Kumar | 15 Jan 2026 5:00 AM ISTకర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పుపై గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తననే కొనసాగించాలని పట్టుబడుతున్నారు. మరోవైపు డీకే శివకుమార్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపారు. కానీ ఇప్పటికీ ఆ విషయంలో స్పష్టత రాలేదు. కానీ ఊహాగానాలు మాత్రం ఇరు శిబిరాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ కలిశారు. ఈ సందర్భంలో సిద్ధరామయ్య రాహుల్ వద్ద కీలక అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని మార్చుతారనే అంశంలో ఇప్పటికీ స్పష్టత లేదని, పార్టీలో.. ప్రజల్లో గందరగోళం ఉందని తెలిపినట్టు సమాచారం. మార్పుపై స్పష్టత ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అదే సమయంలో డీకే శివకుమార్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
సిద్ధూ రికార్డ్ ..
నవంబర్ 20తో సిద్ధు సర్కారుకు రెండున్నరేళ్లు పూర్తయింది. దీంతో పాటు ఎక్కువ కాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న రికార్డును సిద్ధరామయ్య సాధించారు. దీంతో మరోసారి ముఖ్యమంత్రి మార్పుపై చర్చ మొదలైంది. దీనికితోడు రాహుల్ కర్నాటక పర్యటన పట్ల కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలోనే రాహుల్ కర్నాటకకు వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఇప్పటికీ స్పష్టత లేకపోవడం గమనార్హం.
కులాల లెక్కలే కీలకం..
సిద్ధరామయ్య ఎక్కువ కాలం పనిచేసిన సీఎంగా రికార్డు సాధించాలనే ఉద్దేశంతో తన ముఖ్యమంత్రి పదవీ కాలం కొనసాగించాలని అధిష్టానం వద్ద కోరినట్టు, అందుకు తగ్గట్టుగానే ఆయనను ఇంకా సీఎంగా కొనసాగిస్తున్నట్టు ఒక ప్రచారం ఉంది. అదే సమయంలో కుల సమీకరణాలను కూడా అధిష్టానం దృష్టిలో ఉంచుకుని మార్పు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. సిద్ధరామయ్యకు బీసీ,ఎస్టీ,ఎస్సీ,మైనార్టీల మద్దతు బలంగా ఉంది. అహింద వర్గాల నాయకుడిగా సిద్ధరామయ్య ఎదిగారు. అదే సమయంలో డీకే శివకుమార్ కు వక్కలిగల మద్దతు ఉంది. కానీ వక్కలిగ సామాజికవర్గం మెజార్టీగా దేవేగౌడ నేతృత్వంలోని జేడీఎస్ తో దశాబ్ధాలుగా నడుస్తోంది. డీకే శివకుమార్ కు వక్కలిగల మద్దతు ఉన్నప్పటికీ ... కాంగ్రెస్ కు వక్కలిగల నుంచి పూర్తీ స్థాయి మద్దతు లేదు. సిద్ధరామయ్యకు బీసీ,ఎస్టీ,ఎస్సీ,మైనార్టీల నుంచి మద్దతు ఉంది. అదేసమయంలో కాంగ్రెస్కు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల మద్దతూ ఉంది. కాబట్టి ఈ లెక్కలను పరిణనలోకి తీసుకుని అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోందన్న వాదన ఉంది.
డీకేకూ కీలక మద్దతు..
పార్టీ కష్టకాలంలో డీకే శివకుమార్ క్రియాశీలకంగా పనిచేశారు. కీలక నాయకుడిగా ఎదిగారు. ఆర్థికంగా స్థితిమంతుడు. కాబట్టి డీకే శివకుమార్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయనకు కూడా బలమైన మద్దతు ఎమ్మెల్యేల నుంచి ఉంది. కానీ సిద్ధరామయ్య మాత్రం తాను రెండున్నర ఏళ్లు సీఎంగా ఉంటానని చెప్పి ఎన్నికలకు వెళ్లలేదని, ప్రజలు ఐదేళ్లు ఉండటానికి అధికారం ఇచ్చారని మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. సిద్ధరామయ్యను మార్చి.. ఆ స్థానంలో డీకేను కూర్చోబెడతారా ?. లేదా ఐదేళ్లూ సిద్ధరామయ్యను ఉంచి.. మరోసారి డీకేకు పూర్తీ స్థాయి ఐదేళ్లు సీఎంగా ఉండే ప్రతిపాదనతో బుజ్జగిస్తారా? అన్న చర్చ కర్ణాటకలో ఉంది.
