సీఎం కుర్చీ వదలనంతే...కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
సగం లేదు ఏదీ లేదు...టర్మ్ పూర్తయ్యేదాకా నేనే సీఎం...ఆ సీటు నాది అంటూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య తాజాగా అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Political Desk | 20 Dec 2025 1:42 PM ISTసగం లేదు ఏదీ లేదు...టర్మ్ పూర్తయ్యేదాకా నేనే సీఎం...ఆ సీటు నాది అంటూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య తాజాగా అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి వివాదం ఇంకా రగులుతునే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపుడు సీఎం సీటు పవర్ షేరింగ్ ప్రకారం ఉంటుందని. రెండున్నరేళ్లు సిద్దరామయ్య...మరో రెండున్నరేళ్లు డీకే శివకుమార్ అని ఈమేరకు అధిష్టానం వద్ద ఒప్పందం కుదిరిందని వార్తలు వినవచ్చాయి. అనుకున్నట్లుగానే సిద్దరామయ్య సీఎం అయ్యారు. డీకే డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పాలనా కాలం సగం పూర్తికాగానే అసలు కథ షురూ అయ్యింది. డీకే నేరుగా మాట్లాడకపోయినా తన అనుచరగణాలను ఉసిగొలిపి...సిద్దరామయ్య దిగిపోవాలి అనిపిస్తునే ఉన్నారని వార్తలు వినవస్తున్నాయి. మొదట్లో సిద్ధరామయ్య పెద్దగా పట్టించుకోలేక పోయినా ఆ తర్వాత తను గొంతు వినిపించాల్సిన ఆగత్యం వచ్చింది. ఇపుడు నేరుగా అలాంటిదేం లేదు అయిదేళ్ళు నేనే సీఎం అని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ ప్రకటనలు మరింత రాజకీయ జగడానికి కారణాలవుతున్నాయి.
మొన్నటిమొన్న బెళగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఉత్తర కర్ణాటకాభివృద్ధి గురించి మాట్లాడుతున్న సందర్భంలో సీఎం సిద్దరామయ్య ...తను రెండున్నరేళ్ళ ముఖ్యమంత్రి అని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. అధిష్టానం ఆశీస్సులతో అయిదేళ్ళు సీఎం కుర్చీలోనే కొనసాగుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష బీజేపీ నేతలు ఉత్తర కర్ణాటక అబివృద్ధి మీ హయాంలో జరుగుతుందా? అసలే వ్యవధి పూర్తవుతున్నట్లుంది అన్న వాదనకు ప్రతిస్పందిస్తూ సిద్ధరామయ్య నేను అయిదేళ్ళు సీఎం గా ఉండేందుకు అధిష్టానం మొగ్గుచూపుతోందన్నారు. బీజేపీ నేత సునిల్ కుమార్ సిద్దరామయ్య భవితవ్యం గురించి ప్రశ్నించగా...ఇపుడు నేను సీఎంని హైకమాండ్ ఆదేశిస్తే అయిదేళ్ళు సీఎంగానే ఉంటా అని ధీమా వ్యక్తం చేశారు. అయితే బీజేపీ నేత పదే పదే పవర్ షేరింగ్ గురించి ప్రస్తావిస్తుండటంతో...తను ఎప్పుడూ రెండున్నరేళ్ళే సీఎం గా ఉంటానని అనలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మీ నేత యడ్యూరప్ప పూర్తికాలం ఉంటానని చెప్పినా దిగిపోయారు అని వ్యంగ్యంగా అన్నారు సిద్ధరామయ్య. మళ్లీ అదే విషయాన్ని బీజేపీ నేతలు అంటుండటంతో ...మాకు ఎవరి డైరెక్షన్ అక్కర్లేదు...మేమే ప్రొడ్యూసర్లం, యాక్టర్లం, డైరెక్టర్లం. మీకు మాత్రం డైరెక్టర్ ఉన్నారని అన్నారు.
కర్ణాటకలో ఈ పవర్ షేరింగ్ తలనొప్పి ప్రారంభం నుంచే ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరు నేతలు నేనంటే నేనంటూ సీఎం సీటు కోసం పోటీపడిన మాట వాస్తవం. ఉపముఖ్యమంత్రి డీకేశివకుమార్...ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక, సీఎం సీటు తనకు దక్కాల్సిందే అని పట్టుబట్టినా...సిద్ధరామయ్య వ్యూహాత్మకంగా పావులు కదిపి తను ఆ సీటులో కూర్చోగలిగారు. అయితే అప్పట్లో ఇదో వివాదంగా మారింది. అసలు సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించడంలో అంతర్గత ఆలోచన చాలానే ఉందన్నది అప్పటి ప్రచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెనువెంటనే ఎంపీ ఎన్నికలు ముంచుకు రావడంతో...తనను సీఎం చేస్తే అధిక సంఖ్యలో ఎంపీలను తీసుకు వస్తానని సిద్ధరామయ్య అధిష్టానంతో అన్నారని, అందుకే అధిష్టానం కూడా సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపిందని వార్తలు గుప్పుమన్నాయి.
ఆ తర్వాత ఈ వివాదం కాస్త సద్దుమణిగినా...దసరా సంరంభం ముగిసిన వెంటనే మరోసారి పవర్ షేరింగ్ వివాదం తెరపైకి వచ్చింది. అక్టోబర్ తో రెండున్నరేళ్ళ పాలన కాలం ముగిసిపోవడంతో ఇక డీకే సీఎం అవుతారని అతని అనుచరులు ప్రచారం ప్రారంభించారు. అయితే అదేం కాదు అయిదేళ్ళపాటు నేనే సీఎం అని సిద్ధరామయ్య అంటే ఆయన చెప్పిందే ఫైనల్ అని డీకే స్పందించారు. మరోవైపు బీజేపీ బిహార్ ఎన్నికలు ముగిసిన వెంటేనే పవర్ షేరింగ్ పక్కా అని కాంగ్రెస్సే ప్రచారం ప్రారంభించిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి డీకే మొదట బీజేపీ తమ ఆంతరంగిక సమస్యల్ని చక్కదిద్దుకుంటే మంచిదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఇపుడు నేరుగా అసెంబ్లీలోనే పవర్ షేరింగ్ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పవర్ షేరింగ్ వాదాన్ని ఖండించలేదు. ఎన్నికల సమయంలో ఒప్పందం ఉండిందనే అంటున్నారు. కాకపోతే సీఎం సిద్ధరామయ్య తాను అవగాహనతో ఉన్నామని...అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు. ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా..లేదా మరో రెండున్నరేళ్ళపాటు ఇలాగే కొనసాగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. పవర్ షేరింగ్ మాట ఎలా ఉన్నా..ప్రతిపక్ష బీజేపీకి మాత్రం అవసరం వచ్చినప్పుడల్లా వాడుకునే బ్రహ్మాస్త్రంగా మారిందన్నది సత్యం.
