Begin typing your search above and press return to search.

డీకే అతిగొప్ప త్యాగం.. మ‌ళ్లీ క‌ర్ణాట‌క సీఎం సిద్ధునే!

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో అనూహ్యం.. ఏకంగా సీఎం ప‌ద‌వినే త్యాగం.. పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం ర‌క్తిక‌ట్టింది.

By:  Tupaki Political Desk   |   21 Nov 2025 5:00 PM IST
డీకే అతిగొప్ప త్యాగం.. మ‌ళ్లీ క‌ర్ణాట‌క సీఎం సిద్ధునే!
X

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో అనూహ్యం.. ఏకంగా సీఎం ప‌ద‌వినే త్యాగం.. పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం ర‌క్తిక‌ట్టింది. స‌రిగ్గా రెండున్న‌రేళ్ల ప‌ద‌వీ కాలం పూర్త‌యినందున ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య వైదొల‌గాల్సిన ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. 2023 వేస‌విలో జ‌రిగిన ఎన్నిక‌ల అనంత‌రం క‌న్న‌డ నాట కాంగ్రెస్ పార్టీ విజ‌య ప‌తాకం ఎగుర‌వేసింది. దీంతో సిద్ధ‌రామ‌య్య‌, కీల‌క నేత డీకే శివ‌కుమార్ మ‌ధ్య ఎవ‌రు సీఎం అవుతార‌నే చ‌ర్చ మొద‌లైంది. ఇరువురు నాయ‌కులు త‌మ ప‌ట్టు వీడ‌క‌పోవ‌డంతో ప్ర‌తిష్ఠంభ‌న ఏర్ప‌డింది. చివ‌ర‌కు కాంగ్రెస్ అధిష్ఠానం క‌లుగ‌జేసుకుని చెరో రెండున్న‌రేళ్లు ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చింది. దీనికి ఇరు వ‌ర్గాలు ఒప్పుకొన్నాక ముందుగా సీనియ‌ర్ సిద్ధ‌రామ‌య్యకు సీఎం ప‌ద‌వి ద‌క్కింది. అదే స‌మ‌యంలో డీకే డిప్యూటీతో స‌రిపెట్టుకున్నారు. ఇక రెండున్న‌రేళ్ల ఒప్పందం న‌వంబ‌రు 20 (గురువారం)తో ముగిసింది. సిద్ధు దిగిపోయి డీకేకు సీఎం ప‌ద‌వి ద‌క్కాలి. కానీ, ఐదేళ్లు తానే సీఎం అంటూ సిద్ధు తేల్చిచెబుతూ వ‌చ్చారు. చివ‌ర‌కు డీకే వ‌ర్గం ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని క‌లిసే ప్ర‌య‌త్నం చేశారు. అటువైపు త‌న సొంత రాష్ట్రంలో రాజ‌కీయ అనిశ్చితిని ఊహించిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఖ‌ర్గే క‌ర్ణాట‌క‌కు బ‌య‌ల్దేరారు.

డీకే ఎందుకు వెన‌క్కుత‌గ్గారో?

క‌ర్ణాట‌క‌లో ఆర్థికంగా సామాజికంగా బ‌ల‌మైన వ‌ర్గానికి చెందిన డీకే శివ‌కుమార్ కు ఎప్ప‌టికైనా సీఎం కావాల‌నేది క‌ల‌. అలాంటిది ఇప్పుడు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న అనూహ్యంగా త్యాగం చేశారు. శుక్ర‌వారం డీకే విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఐదేళ్లు (మిగ‌తా రెండున్న‌రేళ్లు) క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య‌నే కొన‌సాగుతారు. దీంతో సీఎం మార్పు ప్ర‌చారానికి తెర‌దించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ అనూహ్య ప‌రిణామంతో డీకే వ‌ర్గ‌మే కాదు.. రాజ‌కీయ వ‌ర్గాలూ ఆశ్చ‌ర్యానికి గురై ఉంటాయి అన‌డంలో సందేహం లేదు.

పంతం నెగ్గించుకున్న సిద్ధు

ఒక‌ప్పుడు క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో అప‌ర చాణ‌క్యుడు అంటే దేవెగౌడ అని చెప్పేవారు. ఇప్పుడు ఆ ట్యాగ్ సిద్ధుకు ఇవ్వాల్సి ఉంటుందేమో? ఎందుకంటే డీకే వంటి బ‌ల‌మైన నాయ‌కుడిని కూడా నిలువ‌రించి.. సీఎం ప‌ద‌విని ఆయ‌న అట్టి పెట్టుకున్నారు. వాస్త‌వానికి డీకే ఆర్థికంగా, సామాజికంగా బ‌ల‌మైన వాడు అయితే, సిద్ధ‌రామ‌య్య‌కు ప్ర‌జ‌ల్లో ప‌ట్టు ఉంది. మ‌రీ ముఖ్యంగా సిద్ధు బీసీలు, ఇత‌ర వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను కాంగ్రెస్ కు మ‌ద్ద‌తుదారులుగా మార్చారు. ఆయ‌న ప్ర‌తిపాదించిన అహింద క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌నే మ‌లుపు తిప్పింది.

డీకే వ‌ర్గం ఏం చేస్తుందో?

అధిష్ఠానం మాట‌ను గౌర‌వించారో? లేక సిద్ధును దించ‌డం క‌ష్టం అని భావించారో ఏమో కానీ.. క‌ర్ణాట‌క సీఎం ప‌ద‌విని త్యాగం చేసిన శివ‌కుమార్ మ‌న‌సులో ఏముందో తెలియాల్సి ఉంది. ఒక‌వేళ ఇప్పుడు వెన‌క్కుత‌గ్గినా మున్ముందు అవ‌కాశం దొర‌క్క‌పోదా? అని ఆయ‌న ఆలోచిస్తున్న‌ట్లుంది. రెండేళ్ల కింద‌ట జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ త‌ర‌ఫున కీల‌క పాత్ర పోషించారు డీకే. పార్టీ గెలుపు కోసం పాటుప‌డ్డారు. అలాంటి నాయ‌కుడు క‌ర్ణాట‌క సీఎం ప‌ద‌విని వ‌దులుకోవ‌డం అంటే ఆశ్చ‌ర్య‌మే..!