సిద్దూ ఔట్..? కర్ణాటక సీఎంగా డీకే..? వేగంగా మారుతున్న పరిణామాలు?
మొదట ముఖ్యమంత్రి పదవి పోటీ కేవలం సిద్ధరామయ్య - డీకే శివకుమార్ మధ్యనే ఉందని భావించబడింది. కానీ ఇప్పుడు పోటీ మరింత విస్తరించినట్లు తెలుస్తోంది.
By: A.N.Kumar | 24 Nov 2025 7:27 PM ISTకర్ణాటక రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు గురవుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెరతీశాయి. "పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తేనే నేను ఐదేళ్లు సీఎంగా కొనసాగుతాను" అని ఆయన చేసిన వ్యాఖ్యలు, సీఎం మార్పుపై చర్చలను మరింత రగిలించాయి.
ఇప్పటివరకు "ఐదేళ్లు తానే ముఖ్యమంత్రి" అని ధీమాగా చెప్పిన సిద్ధరామయ్య... ఇప్పుడు ఆ స్వరాన్ని కొంత మార్చడం గమనార్హం. ముఖ్యమంత్రి మార్పు పూర్తిగా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వ నిర్ణయమని, తాను , ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆ నిర్ణయాన్ని పాటించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.
రెండున్నరేళ్ల ఫార్ములా గడువు ముగిసింది
2023లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి గద్దె మీదకు వచ్చిన సమయంలోనే, రెండు-రెండున్నరేళ్ల తర్వాత అధికార పంపిణీ జరుగుతుందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో బలంగా వినిపించింది. నవంబర్ 20తో ఆ అనధికారిక గడువు ముగియడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ శిబిరాల నేతలంతా దిల్లీకి తరలివెళ్లడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది.
ముఖ్యమంత్రి కుర్చీ పోటీ పెరిగిందా?
మొదట ముఖ్యమంత్రి పదవి పోటీ కేవలం సిద్ధరామయ్య - డీకే శివకుమార్ మధ్యనే ఉందని భావించబడింది. కానీ ఇప్పుడు పోటీ మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. బెంగళూరులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసాన్ని ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రధాన ఆశావహులు సందర్శించడం రాజకీయ అనుమానాలకు తావిచ్చింది.
డీకేపై అధిష్ఠానం సందేహాలు?
ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై అధిష్ఠానానికి పూర్తిగా సానుకూలత లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నా, పార్టీ అంతటా విస్తృతమైన మద్దతు లేదని కేంద్ర నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సిద్ధరామయ్య తన వర్గానికి చెందిన అహింద వర్గానికి చెందిన నాయకత్వాన్ని బలపరచాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.
రాహుల్ గాంధీ జోక్యం?
ఈ గందరగోళం అంతర్గత అసంతృప్తిని నివారించడానికి రాహుల్ గాంధీ జోక్యం చేసుకునే అవకాశముండొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనే చివరకు అధికార పంపిణీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.
కర్నాటక కాంగ్రెస్‌లో నాయకత్వంపై నెలకొన్న ఈ అస్పష్టత, రాష్ట్రంలోనే కాక జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. తదుపరి రోజుల్లో అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కేవలం కర్ణాటక భవిష్యత్ పాలననే కాదు.. కాంగ్రెస్ అంతర్గత శక్తి సమీకరణాలనూ స్పష్టతచేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
