Begin typing your search above and press return to search.

కేటీఆర్‌తో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కామెంట్ ఎందుకు హాట్ టాపిక్ అయింది?

హైదరాబాద్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు కేటీఆర్ , శ్యామలాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి కేటీఆర్‌ను ఆప్యాయంగా పలకరించి, అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు.

By:  A.N.Kumar   |   13 Nov 2025 11:58 PM IST
కేటీఆర్‌తో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కామెంట్ ఎందుకు హాట్ టాపిక్ అయింది?
X

టాలీవుడ్ ప్రముఖ నటుడు, దివంగత కృష్ణంరాజు గారి కుటుంబానికి తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ రంగాల్లో అపారమైన గౌరవం ఉంది. కృష్ణంరాజు గారు గతంలో బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి, కేంద్ర మంత్రిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సతీమణి శ్యామలాదేవి కూడా బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం తెలిసిందే.

అయితే ఇటీవల ఒక వివాహ వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నుద్దేశించి శ్యామలాదేవి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీసింది. బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబానికి చెందిన ఆమె, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్‌ను ఆశీర్వదించడం.. వారికి మద్దతుగా మాట్లాడటం సంచలనంగా మారింది.

కేటీఆర్ – శ్యామలాదేవి భేటీలో కీలక వ్యాఖ్య

హైదరాబాద్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుకకు కేటీఆర్ , శ్యామలాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్యామలాదేవి కేటీఆర్‌ను ఆప్యాయంగా పలకరించి, అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ సమయంలో ఆమె చేసిన కీలక వ్యాఖ్య “నెక్స్ట్ అధికారం మనదే.” ఈ మాటలకు కేటీఆర్ ఆనందంగా స్పందిస్తూ ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియో బయటకు రాగానే క్షణాల్లో వైరల్ అయింది.

శ్యామలాదేవి గతంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సందర్భాలు అందరికీ తెలుసు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కూడా నరసాపురం బీజేపీ అభ్యర్థి తరఫున ఆమె ప్రచారం చేశారు. అలాంటి వ్యక్తి, ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశీర్వదించడం, రాజకీయంగా భిన్నమైన సంకేతాలను పంపిస్తోంది.

ఈ వ్యాఖ్య రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? అనే సందేహాన్ని లేవనెత్తుతోంది. బీజేపీకి మద్దతు ఇచ్చే ప్రముఖులు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారా?

రాబోయే ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు కొత్తగా కూటములు కట్టేందుకు సిద్ధమవుతున్నాయా? అనే చర్చకు తావిచ్చింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి పదేళ్ల పాటు అధికారంలో కొనసాగింది. అయితే, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కేవలం ఒక వివాహ వేదికపై, ఒక ఆత్మీయ సందర్భంలో చేసిన సంభాషణే అయినప్పటికీ, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన “నెక్స్ట్ అధికారం మనదే” అనే వ్యాఖ్య.. కేటీఆర్ ఆశీర్వాదంగా స్వీకరించడం... తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీకి చెందిన ప్రముఖ వ్యక్తి ప్రతిపక్ష పార్టీని ఆశీర్వదించడం అనేది రాబోయే ఎన్నికల దృష్ట్యా రాజకీయ సమీకరణాలపై ఆసక్తికరమైన అంచనాలకు దారితీస్తోంది.