పెళ్ళిళ్ళకు మూఢం గండం...నో బ్యాండ్ మేళం
ఒంటరిగా ఉన్న వాళ్ళు జంటలు కావాలంటే పెళ్ళి అనే పవిత్ర బంధం అవసరం. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలంటే శుభమైన ముహూర్తాలు ఉండాలి.
By: Satya P | 23 Nov 2025 1:00 AM ISTఒంటరిగా ఉన్న వాళ్ళు జంటలు కావాలంటే పెళ్ళి అనే పవిత్ర బంధం అవసరం. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలంటే శుభమైన ముహూర్తాలు ఉండాలి. అన్ని రోజులూ అందుకు పనికిరావు. దుర్ముహూర్తాలు ఎటూ ఉంటాయి. అయితే మధ్యలో వచ్చే మూఢాలు కూడా పెళ్ళిళ్ళ సీజన్ కి దెబ్బ తీస్తూంటాయి. ప్రతీ ఏటా వేసవి కాలంలో అలాగే ఆగస్టులో మూఢాలు ఎక్కువగా వస్తూంటాయి. కానీ ఈసారి చిత్రంగా మార్గశిర మాసం మంచి ముహూర్తం, మాఘమాసం సైతం మింగేసేలా శుక్ర మూఢం వచ్చిపడింది. దాంతో పెళ్లిళ్ళకు తాత్కాలికంగా బ్రేక్ పడుతోంది.
మూడు నెలల పాటు :
ఈ నెల 26 నుంచి శుక్ర మూఢం మొదలవుతోంది. అది ఏకంగా 2026 ఫిబ్రవరి నెల 17 వ తేదీ వరకూ ఉంటుందని జ్యోతీష్య పండితులు చెబుతున్నారు. దాదాపుగా తొంబై రోజుల పాటు పెళ్ళిళ్ళకు ఈ విధంగా మూఢం గండం వచ్చిపడింది అని అంటున్నారు. శుక్ర మూఢం లో పెళ్ళిళ్ళు కానీ ఏ రకమైన శుభ కార్యాలు కానీ నిర్వహించరు. అలా చేయడం అనాచారమే అవుతుందని పండితులు స్పష్టంగా చెబుతారు.
మూఢమంటే ఏమిటి :
అసలు మూఢాలు ఏమిటి అన్న చర్చ కూడా రావడం సహజం. మంచి ముహూర్తాలు ఎపుడు గురు శుక్ర గ్రహాలలోనే ఉంటాయి.ఈ గ్రహాల బలంతోనే ఎవరైనా ఏదైనా శుభ కార్యం తలపెడితే కనుక అది నూరు పాళ్ళూ సక్సెస్ అవుతుందని కూడా చెబుతారు. అయితే గురు శుక్ర మూఢాలు ఏడాదిలో కనీసం ఒకటి రెండు సార్లు అయినా వస్తాయి. అలా రావడానికి కారణం ఏమిటి అంటే సూర్యుడుతో కలసి ఈ గ్రహాలు ప్రయాణించడమే ఆ విధంగా చేయడం వల్ల ఈ గ్రహాలు తమ స్వీయ విలువను కోల్పోతాయి. ఒక విధంగా ఇవి మబ్బుల్లో ఉన్నట్లు లెక్క. ఆ సమయంలో వీటి బలం తగ్గిపోతుంది కాబట్టి శుభ కార్యాలు చేసుకోరాదు, చేసుకున్నా అవి అచ్చిరావు అని చెబుతారు.
మూఢాలలో నిషేధం :
మూఢాలలో చేయకూడనివి చాలా ఉన్నాయి. పెళ్ళిళ్ళు అందులో అతి ప్రధానమైనవి. పెళ్ళి అంటే రెండు జీవితాలు ఒక్కటి కావడం, దానికి జాతక బలం గ్రహాల అనుకూలత చాలా ముఖ్యం. వాటిని చూసే ముహూర్తాలు పెడతారు. మూఢంలో పెళ్ళిళ్ళు నిషేధిస్తారు. చేసుకోవడం వల్ల ఎడబాటే కానీ మంచి జరగదు అని అంటారు. అలాగే గృహ ప్రవేశాలు కూడా చేసుకోవడాన్ని నిషేధిస్తారు. మంచి ఇల్లు కట్టుకుని పదికాలాల పాటు అందులో జీవించడం ఎవరికైనా ఉద్దేశ్యం. కానీ మూఢ ప్రభావంతో కనుక గృహ ప్రవేశం చేస్తే అది వెంటాడుతుంది. ఫలితంగా చెడు జరిగే పరిస్థితులు వస్తాయని అందుక దీనిని కూడా నిషేధిస్తారు. అలాగే శుభప్రదమైన ఇతర కార్యక్రమాలు ఉప నయనాలు వంటివి కూడా మూఢంలో నిషేషం అని జ్యోతీష్య పండితులు చెబుతారు.
మోగని బ్యాండ్ :
ఇక గత రెండు నెలలుగా లెక్కకు మిక్కిలిగా పెళ్ళిళ్ళు దేశవ్యాప్తంగా జరిగాయి. మంచి రోజులు ఉన్నాయని అవి కూడా ఈ ఏడాది తక్కువగా ఉన్నాయని ముందే పంచాంగంలో ఉండడంతో చాలా మంది గత రెండు నెలలలోనే ముహూర్తాలు ఎంచుకుని వివాహాం చేసుకున్నారు. ఇపుడు చూస్తే మళ్ళీ ఫాల్గుణ మాసం వరకూ ముహూర్తాలు లేవు. అంటే ఈ తెలుగు ఏడాదిలో చివరి నెలలోనే శుభాలకు అనుకూలం అన్న మాట. ఆ తరువాత కొత్త ఏడాది ఉగాది నుంచి మొదలవుతుంది. మరి ఆ ఏడాదిలో మూఢాలు ఎన్ని ఉన్నాయో ఏమిటి అన్నది తరువాత తెలుస్తుంది. మొత్తానికి వివాహాలకు టెంపరరీగా శుక్ర మూఢం ఫుల్ స్టాప్ పెట్టేసింది అని చెప్పాల్సిందే.
