డిజిటల్ బ్లాక్ అవుట్ చేసినా ప్రియాంకను పట్టేసిన పోలీసులు
నేరాలు.. ఘోరాలు చాలానే జరుగుతున్నా.. కొన్నినేరాలు అందరిని కనెక్టు చేయటమే కాదు.. విపరీతమైన వేదనకు గురి చేస్తుంటాయి.
By: Garuda Media | 12 Jun 2026 12:09 PM ISTనేరాలు.. ఘోరాలు చాలానే జరుగుతున్నా.. కొన్నినేరాలు అందరిని కనెక్టు చేయటమే కాదు.. విపరీతమైన వేదనకు గురి చేస్తుంటాయి. ఎలాంటి సంబంధం లేకున్నా.. అయ్యో, మరీ ఇంత దారుణమా? అన్న ప్రశ్న తలెత్తే పరిస్థితి. ఇప్పుడు అలాంటి ఉదంతమే కర్ణాటకలో చోటు చేసుకోవటం తెలిసిందే. ఇద్దరు పిల్లలు.. భర్త, తాను లాయర్ గా ప్రాక్టీస్ చేసే మహిళ.. అందరిని వదిలేసి.. తన చిన్ననాటి స్నేహితుడితో లివింగ్ రిలేషన్ కు మొగ్గు చూపటం ఒక ఎత్తు అయితే.. ఈ క్రమంలో తన ఐదేళ్ల కుమార్తె (వెన్నెల) హత్యను దాచేసి.. అనారోగ్యంతో అకస్మాత్తుగా మరణించిందన్న కట్టుకథ అల్లటం.. ఆపై భర్త లోతైన విచారణతో వారు చేసిన దారుణం వెలుగు చూడటం తెలిసిందే.
ఈ కేసు దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించటమే కాదు.. ఐదేళ్ల చిన్నారిని పొట్టనపెట్టుకున్న విషయం కదిలించేలా చేసింది. ఈ సంచలన కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మోహన్ ను అదుపులోకి తీసుకొని విచారించటం తెలిసిందే. ఎంతకూ ప్రియాంక ఆచూకీ లభించకపోవటం.. డిజిటల్ బ్లాక్ అవుట్ ప్లాన్ ను ఫాలో అవుతున్న ప్రియాంకను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకొన్నారు. ఇంతకూ ఆమెను ఎలా అదుపులోకి తీసుకున్నారు? ఇంతకూ చిన్నారి వెన్నెల ప్రాణాల్ని ఎందుకు తీశారు? ఆ సమయంలో ఏం జరిగింది? కన్నబిడ్డను పోగొట్టున్న తర్వాత కూడా.. ప్రియుడి పక్షాన నిలవటం.. చేసిన తప్పు నుంచి తప్పించుకోవటానికి భారీ ఎత్తున ప్లాన్ చేయటం లాంటి ఉదంతాలతో ప్రియాంక మైండ్ సెట్ మీద కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఐదేళ్ల కూతురు చనిపోయిన వైనంపై ప్రియాంక వేర్వేరు వాదనలు వినిపించటంతో చిన్నారి తండ్రి పాప మరణానికి కారణమైన అంశాలకు సంబంధించిన రిపోర్టులను విదేశాల్లో ఉన్న స్నేహితులకు పంపటం.. వారు సందేహాన్ని వ్యక్తం చేయటంతో.. పోలీసులను ఆశ్రయించటంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిప్పిందని చెప్పాలి. తమ నుంచి వెళ్లిపోయిన తన భార్య ప్రియాంక.. ప్రియుడితో కలిసి ఐవీఎఫ్ ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఉందని.. అందుకే అడ్డుగా ఉన్న చిన్నారిని హత్య చేశారని చిన్నారి తండ్రి ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ మొత్తం ఉదంతాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
పోలీసులు విచారణలో ప్రియాంక ప్రియుడు మోహన్ ఏం చెప్పారు? అన్న విషయానికి వస్తే.. బెంగళూరులోని సీగేహళ్లి పరిధిలోని ఒక విలాసవంతమైన లగ్జరీ విల్లాలో నివసించే తనకు భార్య.. పిల్లలు ఉన్నారు. చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక పరిచయమైన తర్వాత.. ఇంటిని వదిలేసిన అతను ప్రియాంకతో కలిసి ఉండటం మొదలు పెట్టాడు. ఈ విషయంపై మోహన్ సతీమణి పెద్ద గొడవ చేసినా.. దాన్ని పట్టిచుకోని పరిస్థితి. అదే సమయంలో చిన్ననాటి స్నేహితురాలు.. తాజా ప్రియురాలు ప్రియాంక సైతం భర్త.. ఇద్దరు సంతానంలో ఒకరిని వదిలేసి.. ఐదేళ్ల వెన్నెలను తీసుకొని వచ్చేసి లివింగ్ రిలేషన్ ను మొదలుపెట్టారు.
లాయర్ అయిన ప్రియాంక సైతం మోహన్ ఆర్థిక పరిస్థితికి ఆకర్షితురాలైనట్లుగా చెబుతున్నారు. పాప చనిపోయినప్పుడు కేసు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించారే తప్పించి పశ్చాత్తాపానికి గురైంది లేదు. కేసును తప్పుదోవ పట్టించటానికి.. ప్రైవేటు ఆసుపత్రి నుంచి తప్పుడు నివేదికల్ని మేనేజ్ చేసే ప్రయత్నమే చేశారు. ఇంతకూ పాపను చంపేసేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలేం జరిగిందన్న విషయాన్ని ప్రియుడు మోహన్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. మార్చి 24 రాత్రి హోస్కోటేలో బిర్యానీ తిన్న తర్వాత ప్రియాంక-మోహన్ - వెన్నెలలు తిరిగి తమ కారులో వస్తున్నారు. ఇదే సమయంలో వెన్నెలకు ఐస్ క్రీమ్ కొనిపించారు.
అయితే.. ఆ ఐస్ క్రీమ్ తినే వేళలో.. పొరపాటున కారు సీటు మీదా.. మ్యాట్ మీద పడేసుకుంది. తనకు మరో ఐస్ క్రీం కావాలని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ సమయంలో విపరీతమైన కోపానికి గురైన మోహన్.. తన మోచేతితో పాప పొట్ట భాగంగా బలంగా గుద్దాడు. తీవ్రమైన నొప్పిని భరించలేని చిన్నారి గట్టిగా అరుస్తుండటంతో.. ఎక్కడ తాను చేసిన చెత్తపని బయటపడుతుందన్న ఆలోచనతో చిన్నారి నోరు... ముక్కును గట్టిగా నొక్కిపట్టాడు. తీవ్రమైన అంతర్గత గాయాలు.. ఊపిరి ఆడకపోవటంతో చిన్నారి వెన్నెల మరణించింది.
ఈఘటన తర్వాత లాయర్ ప్రియాంక.. కేసు నుంచి తప్పించేందుకువీలుగా ప్లాన్ చేసింది. అయితే.. భర్త ప్రవీణ్ ఈ విషయం లోతుల్లోకి వెళ్లటంతో ప్రియాంక ఆమె ప్రియుడి పాపం పండింది. కన్నకూతురు కళ్ల ముందు చనిపోయినా.. అందుకు కారణమైనోడితో కలిసి నడిచేందుకు ప్లాన్ చేసుకోవటమే కాదు.. ఆ ఘోరాన్ని దాచేందుకు ప్రయత్నించింది. చిన్నారి హత్య తర్వాత కేసు నుంచి తప్పించుకోవటానికి వీలుగా కాఫీ తోటల్లోని ఒక ఫామ్ హౌస్ లాంటి దాంట్లో దాక్కున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
స్వతహాగా లాయర్ కావటంతో ఆమె తన మొబైల్ ఫోన్ ను స్విచాఫ్ చేయటంతో పాటు.. తన డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం లాంటివి చేయకుండా.. పూర్తిగా నగదుతోనే మేనేజ్ చేసే ప్రయత్నం చేసింది. పోలీసుల విచారణలో మోహన్ ఇచ్చిన ఆధారాలతోనే ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం చిన్నారిని కోల్పోయినప్పటికి.. ఎలాంటి బాద ప్రియంకలో లేదని.. పశ్చాత్తాపం అసలే లేదన్న మాట పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని పోలీసులు వెల్లడించాల్సి ఉంటుంది.
