Begin typing your search above and press return to search.

స్టేజీ మీదే పెళ్లికొడుకును పొడిచేశారు.. షాకింగ్ వీడియో

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ వీడియో స్థానికంగా పెను కలకలం సృష్టిస్తోంది.

By:  A.N.Kumar   |   13 Nov 2025 5:40 PM IST
స్టేజీ మీదే పెళ్లికొడుకును పొడిచేశారు.. షాకింగ్ వీడియో
X

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ వీడియో స్థానికంగా పెను కలకలం సృష్టిస్తోంది. పెళ్లి వేడుక ఆనందాన్ని కమ్మేస్తూ వెడ్డింగ్ రిసెప్షన్ వేదికపైనే పెళ్లికొడుకుపై కత్తిపోట్ల ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన మరింత స్పష్టమైన వీడియో ఒకటి బయటకు రావడంతో ఇది మరింత సంచలనంగా మారింది.

రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సమయంలో పెళ్లికొడుకు సుజల్ రామ్ తన పెళ్లికూతురితో కలిసి స్టేజీపై ఫొటోలు దిగుతున్నారు. అతిథులు, బంధువులతో రిసెప్షన్ హాల్ కిక్కిరిసి ఉంది. ఈ సమయంలోనే అకస్మాత్తుగా ఓ యువకుడు స్టేజీపైకి దూసుకొచ్చాడు. నేరుగా పెళ్లికొడుకు సుజల్ రామ్ వద్దకు వెళ్లిన ఆ దుండగుడు.. తన చేతిలో ఉన్న కత్తితో సుజల్ తొడపై వరుసగా పలుమార్లు పొడిచాడు.

అతిథుల్లో భయాందోళన

ఈ ఊహించని దాడితో కొద్దిసేపు ఎవరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతా నిశ్చేష్టులయ్యారు. కత్తిపోట్లు పడగానే సుజల్ రామ్ కుప్పకూలగా, అక్కడున్న బంధువులు, అతిథులు వెంటనే తేరుకుని ఆ దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ యువకుడు వేగంగా స్టేజ్ నుంచి దూకి రిసెప్షన్ హాల్ నుంచి పారిపోయాడు. ఈ దారుణ దృశ్యం మొత్తం రిసెప్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలతో పాటు, అక్కడున్న వ్యక్తులు తమ మొబైల్స్‌లో తీసిన వీడియోల్లో స్పష్టంగా రికార్డు అయింది.

వ్యక్తిగత కక్షలే కారణమా?

కత్తిపోట్లకు గురైన పెళ్లికొడుకు సుజల్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో ఈ దాడి వెనుక వ్యక్తిగత కారణాలు, కక్షలు ఉన్నాయనే అనుమానాలను పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. అయితే, దాడికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. పూర్తి దర్యాప్తు తర్వాతే అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన పెళ్లి వేడుకలకు హాజరైన వారిలో భయాందోళనలు రేకెత్తించింది.