Begin typing your search above and press return to search.

ప్రభుత్వాధినేతలు, టెర్రరిస్టులు.. ఇప్పుడు క్రికెటర్లు కూడా.. పాకిస్తాన్ ఉగ్ర‘బంధం’ లింకులు ఇవీ!

పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలు, రాజకీయ నాయకులు, అధికార వర్గాల మధ్య ఉన్న లోతైన సంబంధాలపై అంతర్జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

By:  A.N.Kumar   |   27 Jun 2026 5:27 PM IST
ప్రభుత్వాధినేతలు, టెర్రరిస్టులు.. ఇప్పుడు క్రికెటర్లు కూడా.. పాకిస్తాన్ ఉగ్ర‘బంధం’ లింకులు ఇవీ!
X

పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలు, రాజకీయ నాయకులు, అధికార వర్గాల మధ్య ఉన్న లోతైన సంబంధాలపై అంతర్జాతీయ స్థాయిలో ఎన్నోసార్లు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదాస్పద జాబితాలో ఆ దేశ మాజీ క్రికెటర్ల పేర్లు కూడా చర్చకు రావడం క్రీడా ప్రపంచంతో పాటు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర సంచలనంగా మారింది. పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్, ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ షోయబ్ అక్తర్ కుటుంబానికి సంబంధించిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో, అంతర్జాతీయ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది.

అసలేం జరిగింది?

షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ ఇటీవల కన్నుమూశారు. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అభిమానులను ప్రార్థించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇస్లామాబాద్‌లో షాహిద్ అక్తర్ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ అంతిమయాత్రకు హాజరైన కొందరు వ్యక్తుల వివరాలు బయటకు రావడంతో అసలు వివాదం మొదలైంది. అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాద సంస్థగా ముద్రపడిన లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌గా గుర్తింపు పొందిన కసూరి ఈ అంత్యక్రియల్లో పాల్గొనడం తీవ్ర దుమారాన్ని రేపింది. అతడితో పాటు లష్కరే తోయిబాకు రాజకీయ ముఖచిత్రంగా, అనుబంధ సంస్థగా భావించే పాక్ మార్కజీ ముస్లిం లీగ్ కు చెందిన పలువురు కీలక నాయకులు, ఇతర అనుమానిత వ్యక్తులు కూడా ఈ అంతిమయాత్రకు హాజరైనట్లు ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు

అంత్యక్రియల సందర్భంగా బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు, వీడియోల్లో లష్కరే తోయిబా ప్రతినిధి కసూరి సహా పలువురు నేతలు.. షోయబ్ అక్తర్ కుటుంబ సభ్యులతో ఎంతో సన్నిహితంగా, పరామర్శిస్తూ కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ దృశ్యాలను ఆధారంగా చేసుకుని, పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలకు కేవలం రాజకీయ, అధికార వర్గాలతోనే కాకుండా.. సెలబ్రిటీలు, సామాజిక, ప్రజా వర్గాలతో ఎలాంటి అనుబంధాలు ఉన్నాయనే దానిపై అంతర్జాతీయ సమాజంలో మళ్లీ పాత ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.

మౌనంలో షోయబ్ అక్తర్.. అసలు నిజం ఏమిటి?

తన సోదరుడి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న షోయబ్ అక్తర్.. అంత్యక్రియలకు ఉగ్రవాద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారనే వివాదంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన లేదా వివరణ ఇవ్వలేదు. ఇప్పటికే ప్రపంచ దేశాల వేదికలపై పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు సేఫ్ హెవెన్ కల్పిస్తోందనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. ఈ తాజా ఘటన ఆ దేశంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ల వేర్లను మరోసారి ప్రపంచానికి చూపేలా చేసింది.

అయితే కేవలం ఒక అంత్యక్రియల కార్యక్రమానికి కొందరు వ్యక్తులు హాజరైనంత మాత్రాన.. షోయబ్ అక్తర్ లేదా ఆయన కుటుంబానికి ఆ ఉగ్రవాద సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని నిర్ధారించలేము. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు వివిధ వర్గాల ప్రజలు వస్తుంటారు. కాబట్టి, ఈ అంశంపై పాక్ అధికార సంస్థల నుంచి లేదా స్వయంగా షోయబ్ అక్తర్ నుంచి అధికారిక వివరణ వెలువడితేనే ఇందులో ఎంతవరకు నిజముందో స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోల ఆధారంగానే ఈ ఉగ్ర‘బంధం’ వివాదం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.