మృతుడు శివశంకర్ పై కేసు.. ఫిర్యాదు చేసిన ఎర్రిస్వామి!
కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ఘోర బస్సు ప్రమాదం కేసులో పలు కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి.
By: Raja Ch | 26 Oct 2025 2:09 PM ISTకర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ఘోర బస్సు ప్రమాదం కేసులో పలు కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమమలో ఇప్పటికే బైకర్ శివశంకర్ మద్యం మత్తులో వేగంగా బైక్ నడిపి, డివైడర్ ను తాకి పడి చనిపోయాడని.. రోడ్డుపై పడి ఉన్న ఆ బైక్ పై బస్సు ఎక్కించడం వల్ల రాపిడి జరిగి అగ్నిప్రమాదం జరిగిందని చెబుతోన్న వేళ.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరీ కావేరీ బస్సు కర్నూలులో ఘోర అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ప్రాధమిక కారణం.. బస్సు బైక్ ను ఢీకొట్టడమేనని చెబుతోండగా.. ఆ బైక్ రోడ్డుపై పడటానికి కారణం అయిన శివశంకర్ పై తాజాగా కేసు నమోదైంది.
వివరాళ్లోకి వెళ్తే... కర్నూలు ప్రమాద ఘటనలో మరణించిన బైకర్ శివశంకర్ పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లే బైక్ జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టినట్లు ఎర్రిస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా... బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరం పడిపోయామని.. ఈ క్రమంలో శివశంకర్ ఘటనాస్థలిలోనే మృతి చెందాడని.. మృతదేహాన్ని పక్కకు తీసేందుకు యత్నించగా ఇంతలో తమ బైక్ ను ఓ వాహనం ఢీకొట్టిందని.. అనంతరం వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ ను లాక్కెళ్లిందని.. దీంతో బస్సులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి వివరించాడు.
బైక్ డివైడర్ ను ఢీకొన్న ప్రాంతం పరిశీలన!:
కర్నూలు నగర శివారులో బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసు శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా... కాలిపోయిన బస్సును చూసిన అనంతరం బైక్ మొదట డివైడర్ ను ఢీకొన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో ఓ అంచనాకు వచ్చేందుకు ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశారు.
మరోవైపు కర్నూలు ఫోరెన్సిక్ వైద్య నిపుణులు 19 మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను మంగళగిరి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొలేటరీలో శనివారం అప్పగించారు. మృతుల్లో బిహార్ కు చెందిన అమృతకుమార్, ఒడిశాకు చెందిన దీపక్ కుమార్ రక్త సంబంధీకులు మంగళగిరికి చేరుకొని రక్త నమూనాలు ఇచ్చారు. సోమవారానికల్లా డీఎన్‌ఏ నివేదికలు వచ్చే అవకాశముందని అంటున్నారు.
