Begin typing your search above and press return to search.

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం.. ఈ పాడు పని ఎవరిది?

ప్రసిద్ధ పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో దుర్మార్గం చోటు చేసుకుంది. శివ లింగాన్నిధ్వంసం చేసిన దారుణం వెలుగు చూసింది.

By:  Garuda Media   |   31 Dec 2025 3:37 PM IST
ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం.. ఈ పాడు పని ఎవరిది?
X

ప్రసిద్ధ పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో దుర్మార్గం చోటు చేసుకుంది. శివ లింగాన్నిధ్వంసం చేసిన దారుణం వెలుగు చూసింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి లింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్థరాత్రి వేళ ధ్వంసం చేసిన ఉదంతం వెలుగు చూసింది.

మంగళవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు స్పందించారు. విషయం తెలిసినంతనే కాకినాడ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని ధ్వంసమైన శివలింగాన్ని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించారు. డాగ్ స్క్వాడ్ .. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. ఈ ఉదంతం స్థానికంగానే కాదు.. చుట్టుపక్కల గ్రామాల్లోనూ సంచలనంగా మారింది. ఈ దుర్మార్గానికి ఒడిగట్టినోళ్లు ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్ని పట్టుకునేందుకు ఆరు టీంలను ఏర్పాటు చేశారు. పోలీసుల కథనం ప్రకారం సుత్తిలాంటి బలమైన వస్తువుతో శివలింగాన్ని ధ్వంసం చేసినట్లుగా భావిస్తున్నారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో మరో లింగాన్ని ప్రతిష్ఠించి.. ఆలయ పండితులతో ప్రత్యేక పూజలు చేశారు. శివలింగం ధ్వంసమైన ప్రాంతంలో సీసీ కెమేరాలు లేకపోవటంతో.. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమేరాల ఫుటేజ్ ను జల్లెడ పడుతున్నారు. ఈ ఉదంతంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా రియాక్టు అయ్యారు.

బాధ్యులను గుర్తించి.. కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. దర్యాప్తు వివరాల్ని తనకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చెప్పారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో కొత్తది పున:ప్రతిష్ఠ చేయటంతో పాటు.. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో వేదపండితులు.. అర్చకులతో శాస్త్రోక్తంగా క్రతువును పూర్తి చేసినట్లుగా మంత్రి ఆనం వెల్లడించారు. శివలింగాన్ని ధ్వంసం చేసినంతనే ప్రభుత్వం స్పందించిన తీరు స్థానికంగా ఉద్రిక్తతల్ని నివారించింది. అదే సమయంలో ఈ దారుణానికి పాల్పడిన వారిని పోలీసులు పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.