రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం.. తిరుమలలో ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వ్యాఖ్యలు దుమారం
ఆమె తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు, రికార్డు చేసిన వీడియోపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By: A.N.Kumar | 22 Nov 2025 5:24 PM ISTప్రముఖ యాంకర్, 'తీన్మార్ సావిత్రి'గా ప్రేక్షకులకు సుపరిచితురాలైన శివజ్యోతి తాజాగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమె తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు, రికార్డు చేసిన వీడియోపై భక్తులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదానికి కారణం ఏమిటి?
శివజ్యోతి తన భర్త గంగులు, బంధువులతో కలిసి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్‌లో ఉన్న సమయంలో టీటీడీ భక్తులకు అందించే ప్రసాదంను స్వీకరించారు. ఈ సందర్భంలో ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రసాదం తీసుకుంటున్న తన బంధువుని ఉద్దేశించి శివజ్యోతి నవ్వుతూ "సోను కాస్ట్ లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్" అని వ్యాఖ్యానించారు. ఆమె బంధువు స్పందిస్తూ "జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు. ఫస్ట్ టైం అడుక్కున్నా" అని అనగా శివజ్యోతి మళ్ళీ నవ్వుతూ "తిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా శ్రీవారి ప్రసాదాన్ని, భక్తులను ఉద్దేశించి 'అడుక్కోవడం', 'బిచ్చగాళ్లు' వంటి పదాలు వాడడంపై భక్తులు, హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
భక్తులు, నెటిజన్ల ఆగ్రహం
శివజ్యోతి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. చాలా మంది భక్తులు ఆమె శ్రీవారి ప్రసాదాన్ని, యాత్రికులను అవమానించిందని భావిస్తున్నారు. నెటిజన్లు ఆమె నిజస్వరూపాన్ని ఇది చూపిస్తుందని, యాత్రికులను బిచ్చగాళ్లతో పోల్చడం తగదని మండిపడుతున్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోల రికార్డింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ, శివజ్యోతి క్యూ లైన్‌లో వీడియో రికార్డ్ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదంపై ప్రముఖ యాంకర్ శివజ్యోతి ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఆమె తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారా లేదా భక్తులకు క్షమాపణ చెబుతారా అనేది చూడాలి. మొత్తానికి, శివజ్యోతి మరో వివాదంలో చిక్కుకొని విమర్శలను ఎదుర్కొంటున్నారు.
