ఉద్ధవ్ రాజకీయం ముగిసినట్లేనా... అమిత్ షా కీలక వ్యాఖ్యలు
శివసేన ఎవరిది అంటే రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్న వారు అంతా చెప్పేది ఒక్కటే. మరాఠా యోధుడు బాల్ థాక్రే పెట్టిన పార్టీ అని. ఆయన పుబ్బలో పెట్టి మఖలో మాడిపోయే విధంగా పార్టీని ఏర్పాటు చేయలేదు.
By: Satya P | 21 Jun 2026 9:54 AM ISTశివసేన ఎవరిది అంటే రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్న వారు అంతా చెప్పేది ఒక్కటే. మరాఠా యోధుడు బాల్ థాక్రే పెట్టిన పార్టీ అని. ఆయన పుబ్బలో పెట్టి మఖలో మాడిపోయే విధంగా పార్టీని ఏర్పాటు చేయలేదు. ఆయన బతికి ఉండగానే అర్ధ శతాబ్దం కాలం వైభోగం శివసేన చూసింది. ఆ తరువాత మరో దశాబ్దం పైగా కొనసాగుతూ వస్తోంది. శివసేన ఎవరికి అసలు ఎవరిది కాదు అన్న దాని మీద అయితే కేంద్ర ఎన్నికల సంఘం ముందు పంచాయతీ జరిగి తీర్పు కూడా వచ్చేసింది. గుర్తు ఎవరికి ఉందో వారిదే శివసేన అని తేల్చేసింది. ఆ విధంగా బాణం గుర్తు అయితే ఏక్ నాధ్ షిండేకే ఉంది. పైగా ఆయన వైపు అత్యధిక శాతం ఎమ్మెల్యేలు 2024 ఎన్నికల్లో గెలిచారు. ఏడుగురు ఎంపీలు ఉన్నారు. ఆయన తానుగా మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అది నైతికమా అనైతికమా అన్నది పక్కన పెడితే రాజ్యాంగం ప్రకారం మాత్రం అది కరెక్ట్ అన్నది తేలిపోయిన వ్యవహారమే.
బీజేపీ అలా గుర్తించింది :
అయితే ఇపుడు బీజేపీ షిండేదే అసలైన శివసేన అని గుర్తించడమే రాజకీయ చిత్రంగా ఉంది అని అంటున్నారు. ఈ మాటలు అన్నది కూడా ఎవరో కాదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన మహారాష్ట్రలో కొల్లాపూర్ పర్యటనలో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. అసలు శివసేనలో వర్గాలు ఏమిటి అని అమిత్ షా కొట్టి పారేశారు. మహారాష్ట్రలో ఉన్నది ఒక్కటే శివసేన అని కూడా తేల్చేశారు. శివసేన బాల్ థాక్రే కుమారుడు ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో ఉండగా 2022 లో భారీ చీలిక తెచ్చి షిండే బయటకు వచ్చారు. ఆయనను ఏకంగా బీజేపీ సీఎం నే చేసింది. అలా ఆయన హవా సాగింది. 2024 ఎన్నికల తరువాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా షిండే తన వైపు వచ్చిన వారిని కాపాడుకుంటున్నారు. పైగా ఇపుడు ఉద్ధవ్ థాక్రే వర్గంలో మిగిలిన వారిని కూడా ఆకట్టుకునే పని అయితే జోరుగా సాగుతోంది. ఈ నేపధ్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆసక్తిని రేపుతున్నాయి.
ఉద్ధవ్ పంచన కాంగ్రెస్ :
అమిత్ షా అయితే శివసేన ఉద్ధవ్ వర్గం అన్న దానిని ఏ మాత్రం గుర్తించడం లేదు. ఉద్ధవ్ థాక్రే పంచన చేరిన వారు అంతా కాంగ్రెస్ మద్దతు దారులు చొరబాటు దారులను ఓటు బ్యాంకుగా మార్చి మనుగడ సాగించాలనుకునే వారు అని నిప్పులే చెరిగారు. అలా చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ఆటలు సాగనిచ్చేది లేదని అన్నారు. భారత్ అయితే చొరబాటుదారులకు ధర్మసత్రం కానే కాదని ఆయన స్పష్టం చేశారు ఈ దేశంలో పుట్టిన వారికే ఇక్కడ చోటు ఉంటుంది, చొరబాటుదారులను వెనక్కి పంపేస్తామని కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు.
ఇది ఒక సంకేతమా :
ప్రస్తుతం చూస్తే షిండే వైపు నుంచి ఆపరేషన్ ఆకర్ష్ అన్నది జోరుగా సాగుతోంది అని అంటున్నారు. ఉద్ధవ్ థాక్రే ఎంపీలను ఎమ్మెల్యేలను తమ వైపుగా లాగే కార్యక్రమం అయితే నడుస్తోంది. ఈ నేపధ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. నిజమైన శివసైనికులు అంతా షిండే వైపే ఉండాలన్న సంకేతాలు అమిత్ షా ఈ విధంగా పరోక్షంగా పంపించారా అని అంటున్నారు. షిండేదే శివసేన అని చెప్పడం ద్వారా ఉద్ధవ్ థాక్రే రాజకీయం ముగిసింది అన్న స్పష్టమైన సూచనను కూడా అమిత్ షా ఇచ్చారని అంటున్నారు. ఆయన వెనక ఉన్నది ఆడిస్తోంది కాంగ్రెస్ అని చెప్పడం ద్వారా బాల్ థాక్రే మద్దతుదారులు ఆయన సిద్ధాంతాలను గౌరవించేవారు షిండే వైపు రావాలని పిలుపు ఇచ్చినట్లుగానే ఉందని అంటున్నారు. ఎందుకంటే బాల్ థాక్రే తన జీవిత పర్యంతం కాంగ్రెస్ ని వ్యతిరేకించారు. అదే కాంగ్రెస్ కూటమిలో ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. దాంతోనే ఆయన శివసేన సేనాని కాదని కాషాయం దళం చెప్పదలచుకుందా అని అనుకుంటున్నారు.
