Begin typing your search above and press return to search.

తెలుగులో ప్ర‌మాణం.. తెలంగాణ కొత్త గ‌వ‌ర్న‌ర్ విశేషాలు ఇవే!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌కు చెందిన శివ‌ప్ర‌తాప్ శుక్లా వృత్తి రీత్యా న్యాయ‌వాది. అయితే.. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ వృత్తిని వ‌దులుకున్నారు

By:  Garuda Media   |   11 March 2026 4:13 PM IST
తెలుగులో ప్ర‌మాణం.. తెలంగాణ కొత్త గ‌వ‌ర్న‌ర్ విశేషాలు ఇవే!
X

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా బుధ‌వారం ప్రమాణ స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ నివాసం.. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ నూత‌న గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే.. ఇత‌ర గ‌వ‌ర్న‌ర్ల మాదిరిగా కాకుండా.. ప్రతాప్ శుక్లా.. త‌న ప్ర‌మాణ ప‌త్రాన్ని పూర్తిగా తెలుగులోనే చ‌ద‌వ‌డం విశేషం.

ఎవ‌రీయ‌న‌?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌కు చెందిన శివ‌ప్ర‌తాప్ శుక్లా వృత్తి రీత్యా న్యాయ‌వాది. అయితే.. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ వృత్తిని వ‌దులుకున్నారు. బీజేపీ వ్య‌వ‌స్థాప‌న నుంచి ఆయ‌న ఆ పార్టీలోనే ఉన్నారు. 1989 నుంచి ప్ర‌జాప్ర‌తినిధిగా కూడా ప‌నిచేశారు. 1989 నుంచి 2012 వ‌ర‌కు ఆయ‌న గోర‌ఖ్ పూర్ రూర‌ల్ ఎమ్మెల్యేగా వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. రాష్ట్రంలో ఏర్ప‌డిన తొలి బీజేపీ ప్ర‌భుత్వంలో ఆయ‌న మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత‌.. రాష్ట్ర బీజేపీ సార‌థ్య బాధ్య‌త‌లు కూడా నిర్వ‌హించారు.

ఇక‌, 2016లో రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2017 సెప్టెంబరు 3 నుండి 2019 మే 30 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా శుక్లా ప‌నిచేశారు. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందినప్ప‌టికీ.. ఆయ‌న నిమ్న వ‌ర్గాల అభ్యున్న‌తి, వారి ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు కృషి చేశార‌న్న పేరుంది. 2023 ఫిబ్రవరి 13 నుండి హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ల బ‌దిలీ ప్ర‌క్రియ‌లో భాగంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీపై వ‌చ్చారు. మంచివిద్యావేత్త‌గా, ఆలోచ‌నా ప‌రుడిగా.. ఆయ‌న‌కు పేరుండ‌డం గ‌మ‌నార్హం.