Begin typing your search above and press return to search.

'గబ్బర్' సెకండ్ ఇన్నింగ్స్.. పెళ్లికి రెడీ.. కొత్త ప్రేయసి ఎవరంటే?

వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించినా ధావన్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు.

By:  A.N.Kumar   |   5 Jan 2026 11:08 PM IST
గబ్బర్ సెకండ్ ఇన్నింగ్స్.. పెళ్లికి రెడీ.. కొత్త ప్రేయసి ఎవరంటే?
X

భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్.. అభిమానులు ముద్దుగా 'గబ్బర్' అని పిలుచుకునే శిఖర్ ధావన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ధావన్ మళ్ళీ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. ఐర్లాండ్‌కు చెందిన తన ప్రేయసి సోఫీ షైన్ను ఆయన వివాహం చేసుకోబోతున్నట్లు క్రీడా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఫిబ్రవరిలో వేడుక.. వేదిక ఢిల్లీ

శిఖర్ రెండో వివాహ వేడుక ఫిబ్రవరి మూడో వారంలో నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ వేడుక అత్యంత ఘనంగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయని, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరగనుందని సమాచారం.

రెండేళ్ల ప్రేమాయణం..

శిఖర్ ధావన్ - సోఫీ షైన్ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపించినా ధావన్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఇప్పుడు ఈ బంధాన్ని పెళ్లితో అధికారికం చేయాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

గత చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ..

శిఖర్ ధావన్ వ్యక్తిగత జీవితం గతంలో కొంత ఒడిదుడుకులకు లోనైన సంగతి తెలిసిందే. 2012లో ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని ధావన్ వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా సుదీర్ఘ కాలం విడివిడిగా ఉన్న ఈ జంటకు 2023లో కోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. విడాకుల తర్వాత తన కుమారుడు జోరవర్ జ్ఞాపకాలతో కాలం గడిపిన ధావన్ ఇప్పుడు సోఫీ షైన్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

సెలబ్రిటీల సందడి

ఢిల్లీలో జరగనున్న ఈ పెళ్లి వేడుకకు టీమ్ ఇండియా క్రికెటర్లతో పాటు, బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మైదానంలో తనదైన బ్యాటింగ్ శైలితో అలరించిన ధావన్ ఇప్పుడు జీవితంలో ప్రారంభించబోయే ఈ 'సెకండ్ ఇన్నింగ్స్' విజయవంతం కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. త్వరలోనే ఈ పెళ్లిపై ధావన్ కుటుంబం నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.