దువ్వాడ ఆత్మీయ సమ్మేళనం.. సిక్కోలు జిల్లాలో హాట్ టాపిక్
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా కాళింగ సామాజికవర్గానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లాలో జనాభా పరంగా ప్రధాన సామాజిక వర్గాలలో కాళింగ ఒకటి.
By: Tupaki Political Desk | 29 Dec 2025 4:11 PM ISTశ్రీకాకుళం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్న సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా విపక్ష వైసీపీలో అంతర్గత రాజకీయాలు వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ఇందుకు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేస్తున్న అడుగులే కారణమని ప్రచారం జరుగుతోంది. దువ్వాడ జోక్యంతో ఆదివారం శ్రీకాకుళంలో నిర్వహించిన కాళింగ సమ్మేళనం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలకు చెందిన కాళింగ సామాజికవర్గ నేతలు హాజరైనప్పటికీ, ప్రధానంగా వైసీపీలో అంతర్గత రాజకీయాలే ఈ సమ్మేళనానికి కారణమన్న గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తన సామాజిక వర్గాన్ని ఏకం చేసేలా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు, వైసీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ లక్ష్యంగా దువ్వాడ చేస్తున్న విమర్శల వల్ల కాళింగ సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనం కాకరేపుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా కాళింగ సామాజికవర్గానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లాలో జనాభా పరంగా ప్రధాన సామాజిక వర్గాలలో కాళింగ ఒకటి. కాళింగ, వెలమ, తూర్పుకాపు, యాదవ సామాజికవర్గాలు రాజకీయంగా చురుగ్గా ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు ఎక్కువగా వెలమ సామాజికవర్గం దక్కించుకుంటోందని మిగిలిన సామాజికవర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పలుమార్లు బహిరంగంగా ప్రస్తావించారు. అంతేకాకుండా తన సొంత సామాజికవర్గమైన కాళింగ నేతలు ఎదగకుండా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ తొక్కేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధర్మాన సోదరులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుమ్మక్కు అవడంతో వైసీపీ నుంచి కాళింగ నేతలు ఎన్నికల్లో గెలవలేకపోతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై గతంలో ధర్మాన, కింజరాపు కుటుంబాలను కేడీ బ్రదర్స్ అంటూ విమర్శించారు దువ్వాడ. అయితే వైసీపీలో అంతర్గత రాజకీయాల కారణంగానే ధర్మాన సోదరులపై దువ్వాడ విమర్శలు గుప్పిస్తున్నారని ఇంతకాలం అంతా భావించారు. కానీ, ఆదివారం దువ్వాడ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర సమీపంలో కాళింగ సామాజికవర్గం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. దీనికి టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కూన రవికుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ కుమార్ హాజరయ్యారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతోపాటు వైసీపీలో వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఎక్కువగా హాజరయ్యారు. మాజీ స్పీకర్ తమ్మినేని ఆయన రాజకీయ ప్రత్యర్థి కూన రవికుమార్ ఈ సమ్మేళనానికి వచ్చినా ఆ ఇద్దరి మధ్య పోటీ ఉండటం వల్ల తాజా కలయికపై ఎవరూ పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదని అంటున్నారు.
కానీ, ఇదేసమయంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ చేసిన కొన్ని వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారితీశాయి. ఒకవైపు దువ్వాడను పార్టీ నుంచి పంపేలా ధర్మాన సోదరులు పనిచేశారని ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో.. తమ్మినేని బదులుగా మరో సమర్థుడైన నేతను చూస్తున్నామని కొద్దిరోజుల క్రితం ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించడం, మరోవైపు నుంచి తమ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారంటూ దువ్వాడ పదే పదే విమర్శలు గుప్పించడంతో కాళింగ సామాజిక వర్గం ఆత్మీయ కలయిక వైసీపీలో పెద్ద చర్చకు కారణమైందని అంటున్నారు. ఒకవైపు దువ్వాడ, మరోవైపు తమ్మినేని వంటి కాళింగ సామాజికవర్గ నేతల ఎదుగుదలపై వారి అనుచరులు బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేయడం కూడా పెద్ద చర్చగా మారింది.
పార్టీ బహిష్కరణ తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తిన్నారనే అంచనాల మధ్య కాళింగ సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా తన సత్తా ఏంటో అధిష్టానానికి తెలియజేయాలనే వ్యూహంతోనే ఆయన అడుగులు వేస్తున్నారని అంటున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో వైసీపీ నేతలు ధర్మాన బ్రదర్స్ కు లింకులు ఉన్నాయని, అందుకే తాను వరుసగా ఓడిపోతున్నానని చాటి చెప్పడం ద్వారా సొంత సామాజికవర్గం సానుభూతి పొందడంతోపాటు పార్టీ అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేసే వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి దువ్వాడ ప్లాన్ ఎంతవరకు హిట్ అవుతుందో కానీ, ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.
