Begin typing your search above and press return to search.

తాను మరణిస్తూ.. ఇతరులకు ప్రాణం.. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆదర్శం..

షెరిన్‌ రెండు కిడ్నీలు పదేళ్ల చిన్నారికి అమర్చారు. ఆ బాలుడి శరీరం ప్రతిరోజూ డయాలసిస్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి బయటపడింది.

By:  Tupaki Political Desk   |   14 Feb 2026 2:48 PM IST
తాను మరణిస్తూ.. ఇతరులకు ప్రాణం.. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆదర్శం..
X

కొన్ని కథలు హృదయాన్ని ముక్కలు చేస్తాయి. మరికొన్ని అదే హృదయంలో ఆశను నాటుతాయి. 10 నెలల చిన్నారి షెరిన్ అబ్రహం కథ ఈ రెండింటికి కనెక్ట్ అయ్యింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఈ చిన్నారి తన చివరి శ్వాసతో ఇతర పిల్లలకు కొత్త జీవితం అందించాడు.

షెరిన్ కు బ్రెయిన్ డెట్..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన షెరిన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించినా, పరిస్థితి విషమించింది. చివరకు వైద్యులు ఆమెను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఏ తల్లిదండ్రుకైనా ఇది భరించలేని క్షణం. కానీ ఆ దుఃఖ సముద్రంలోనూ షెరిన్ తల్లిదండ్రులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. అదే అవయవదానం. తమ బిడ్డను తిరిగి పొందలేమనే నిజాన్ని అంగీకరించిన వారు, ఆమె ద్వారా మరికొన్ని ప్రాణాలు నిలవాలని కోరుకున్నారు. ఈ నిర్ణయం ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి మాటలు సరిపోవు. 10 నెలల చిన్నారి అవయవాలు.. మరణానికి అంచులపై ఉన్న పలువురు చిన్నారులకు ఆశాకిరణాలయ్యాయి.

నిలబడిన నాలుగు ప్రాణాలు..

షెరిన్‌ రెండు కిడ్నీలు పదేళ్ల చిన్నారికి అమర్చారు. ఆ బాలుడి శరీరం ప్రతిరోజూ డయాలసిస్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి బయటపడింది. ఏడు నెలల పాపకు కాలేయం దానం చేయడంతో ఆమెకు కొత్త జీవితం లభించింది. మరో ఇద్దరు పిల్లలకు గుండె కవాటం, కార్నియాలు అమర్చారు. ఒక చిన్నారి చూపు తిరిగి పొందింది. ఇంకొకరికి గుండె స్పందన కొత్త శక్తిని అందుకుంది.

మానవత్వ విజయం..

ఇది కేవలం వైద్య విజ్ఞాన విజయం కాదు. ఇది మానవత్వ విజయం. మన సమాజంలో అవయవదానం గురించి ఇంకా అనేక అపోహలు ఉన్నాయి. ‘మరణం తర్వాత శరీరం పాడైపోతుంది’, ‘పాపం పడుతుంది’ వంటి దురాచార భయాలు చాలా మందిని అవయవదానం నుంచి వెనక్కి నెడతాయి. కానీ షెరిన్ తల్లిదండ్రుల నిర్ణయం ఒక శక్తివంతమైన సందేశం ఇస్తోంది. మన ప్రాణం ఆగిపోయినా, మన అవయవాలు మరొకరికి జీవితాన్ని ఇవ్వగలవు.

అవగాహన పెరగాలి..

భారతదేశంలో అవయవదానం అవసరం భారీగా ఉంది. వేలాది మంది పిల్లలు, పెద్దలు ప్రతి ఏడాది అవయవాల కోసం వేచి చూస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో సరిపడా దాతలు లేకపోవడం పెద్ద సమస్య. ఇలాంటి సమయంలో 10 నెలల చిన్నారి తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది.

షెరిన్ తల్లిదండ్రుల నిర్ణయం గొప్పది..

ఈ కథలో విషాదం దాగి ఉంది. కానీ అదే సమయంలో అపారమైన గౌరవం ఉంది. షెరిన్ జీవితం చిన్నదైనా, ఆమె ప్రభావం అపారమైనది. ఆమె పేరు తెలియకపోయినా.., ఆమె అవయవాలతో బతుకుతున్న ఆ పిల్లల ప్రతి నవ్వులో ఆమె జీవితం కొనసాగుతోంది. మన సమాజం ఇలాంటి కథలను కేవలం భావోద్వేగంతో చదివి మర్చిపోవడం కాదు.. వాటి నుంచి ప్రేరణ పొందాలి. అవయవదానం గురించి అవగాహన పెంచుకోవాలి. కుటుంబ సభ్యులతో చర్చించాలి. ఒక నిర్ణయం.. ఎన్నో జీవితాలను వెలిగించగలదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

తాను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లినా.. షెరిన్ అబ్రహం మరికొన్ని హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఒక చిన్నారి.. మరణాన్ని కూడా జీవనోత్సవంగా మార్చగలదని ఆమె నిరూపించింది.