Begin typing your search above and press return to search.

ద‌లైలామాలా కాదు.. హ‌సీనాను భార‌త్ అప్ప‌గించాల్సిందే(నా)..!

మా దేశానికి వ‌చ్చిన అతిథిని గౌర‌వించ‌డం మా బాధ్య‌త‌.. ఇది బౌద్ధ మ‌త గురువు ద‌లైలామా విష‌యంలో భార‌త్ వైఖ‌రి.

By:  Tupaki Political Desk   |   18 Nov 2025 11:00 AM IST
ద‌లైలామాలా కాదు.. హ‌సీనాను భార‌త్ అప్ప‌గించాల్సిందే(నా)..!
X

మా దేశానికి వ‌చ్చిన అతిథిని గౌర‌వించ‌డం మా బాధ్య‌త‌.. ఇది బౌద్ధ మ‌త గురువు ద‌లైలామా విష‌యంలో భార‌త్ వైఖ‌రి. టిబెట‌న్ల ఉద్య‌మాన్ని చైనా అణ‌చివేయ‌డంతో ప్రాణాలు అర‌చేత ప‌ట్టుకుని 1959 మార్చిలో ఆయ‌న భార‌త్ కు వ‌చ్చేశారు. ప్ర‌వాసంలో గడుపుతూ... చివ‌ర‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర్మ‌శాల‌ను త‌న నివాసంగా చేసుకున్నారు. ఆయ‌న‌ను అప్ప‌గించేది లేదంటూ చైనాకు భార‌త్ తేల్చిచెప్పింది. దీంతో మ‌న దేశంపై చైనా యుద్ధానికి దిగింది. హిందీ చీనీ భాయీ భాయీ అంటూ అప్ప‌టి ప్ర‌ధాని నెహ్రూ ఎంత‌గానో న‌మ్మిన సిద్ధాంతానికి తూట్లు పొడిచింది. నెహ్రూ ఈ మ‌నోవ్య‌ధ‌తోనే చ‌నిపోయార‌ని అంటారు. కాగా, ఇప్పుడు మ‌రో నేత విష‌యంలోనూ భార‌త్ కు సంక‌ట ప‌రిస్థితి ఎదుర‌య్యే ప్ర‌మాదం ఉంది. ఆమెనే బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా. 2024 ఆగ‌స్టులో ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వ‌డంతో హ‌సీనా ప్ర‌త్యేక విమానంలో భార‌త్ కువ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. ఆమె నేరుగా ఢిల్లీ శివారుకు వ‌చ్చిన‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చినా అప్ప‌ట్లోని ఉద్రిక్త ప‌రిస్థితుల రీత్యా ఆ వివ‌రాలేమీ బ‌య‌ట పెట్ట‌లేదు.

ఢిల్లీలో ఉన్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌..

షేక్ హ‌సీనాను త‌మ‌కు అప్ప‌గించాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌భుత్వం భార‌త్ ను కోరింది. కానీ, మ‌న దేశం స్పందించ‌లేదు. అస‌లు భార‌త్ లో ఆమె ఎక్క‌డ త‌ల‌దాచుకుంటున్న‌ది కూడా తొలుత తెలియ‌రాలేదు. గ‌త ఏడాది ఆగ‌స్టు నుంచి మొన్న‌టి వ‌ర‌కు చూస్తే హ‌సీనాను బంగ్లాను వీడి 15 నెల‌లైంది. అయితే, కొంత కాలం కింద‌ట ఆమె ఢిల్లీలో ఉంటున్న‌ట్లు స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రోవైపు హ‌సీనాపై బంగ్లాదేశ్ లో వంద‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. వాటి ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ప్ర‌భుత్వం.. అంత‌ర్జాతీయ నేరాల ట్రైబ్యున‌ల్ (ఐసీటీ)ని పున‌రుద్ధ‌రించింది. గ‌తంలో హ‌సీనానే దీనిని ఏర్పాటు చేసి నిలిపివేశారు. మాన‌వ‌త్వానికి వ్య‌తిరేకంగా నేరాలకు పాల్ప‌డిన‌ట్లు తేల్చిన ఐసీటీ... హ‌సీనాకు మ‌ర‌ణ‌శిక్ష విధించింది.

ఐసీటీ తీర్పున‌కు భార‌త్ తలొంచుతుందా?

హ‌సీనా గ‌నుక ఐసీటీ శిక్ష‌ను స‌వాల్ చేయాల‌న్నా, నోటీసులు తీసుకోవాల‌న్నా బంగ్లాదేశ్ కు వెళ్లాల్సిందే. కానీ, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆ ప‌ని చేస్తే గ‌నుక ఆమెను స‌జీవంగా చూడ‌లేం. బంగ్లాలో హ‌సీనాపై పీక‌ల్లోతు కోపంలో ఉది తాత్కాలిక ప్ర‌భుత్వం. మ‌రి ఈ నేప‌థ్యంలో.. భార‌త్ ఆమెను బంగ్లాకు అప్ప‌గిస్తుందా? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం. అయితే, బంగ్లా ఐసీటీ ప‌రిధి ఆ దేశం వ‌రకే అని తెలుస్తోంది. దీనికి అంత‌ర్జాతీయంగా అంత విలువ లేదనుకోవ‌చ్చు. పైగా బంగ్లాలో హ‌సీనా త‌ప్ప భార‌త్ కు మిత్ర నాయ‌కులు లేరు. కాబ‌ట్టి ఆమెను అప్ప‌గించ‌డం అనేది ఉండ‌క‌పోవ‌చ్చు.

రెండోసారి ప్ర‌వాసంలో..

హ‌సీనా భార‌త్ లో ప్ర‌వాసం ఉండ‌డం రెండోసారి. 1975లో బంగ్లాలో సైనిక తిరుగుబాటు జ‌రిగి.. హ‌సీనా త‌ల్లిదండ్రులు, ముగ్గురు సోద‌రులు, కుటుంబ స‌భ్యుల‌ను హ‌త్య చేశారు. హ‌సీనా, ఆమె చెల్లెలు రెహానా అప్ప‌ట్లో విదేశాల్లో ఉన్నారు. వీరికి ఆ త‌ర్వాత భార‌త ప్ర‌భుత్వం ఆరేళ్ల పాటు ఆశ్ర‌యం ఇచ్చింది. మ‌ళ్లీ నిరుడు అదే హ‌సీనా, రెహానా భార‌త్ కు ప్ర‌వాసం వ‌చ్చారు.