Begin typing your search above and press return to search.

షేక్ హసీనా... చావుకు ఎదురెళ్తున్నారా ?

డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలని షేక్ హసీనా నిర్ణయించుకున్నట్లు ఆమె ప్రతినిధి ప్రకటించారు. తన స్వదేశంలోనే మరణిస్తానని, ఎలాంటి శిక్షనైనా ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేసినట్లు కథనం. అయితే ఆమెను అరెస్ట్ చేస్తామని బంగ్లా ప్రభుత్వం హెచ్చరిస్తుండగా, అప్పగింత అభ్యర్థనను భారత్ పరిశీలిస్తోంది.

By:  Satya P   |   24 Nov 2026 1:54 PM IST
షేక్ హసీనా... చావుకు ఎదురెళ్తున్నారా ?
X

బంగ్లాదేశ్ ని సుదీర్ఘ కాలం పాలించిన అత్యంత శక్తివంతమైన మహిళా నాయకురాలుగా షేక్ హసీనాకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. షేక్ హసీనా 1981 నుండి అవామీ లీగ్ పార్టీకి నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. అలా ఆమె 1996–2001 మధ్య తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. తిరిగి 2009 నుండి ఆగస్టు 2024 వరకు వరుసగా నాలుగు పర్యాయాలు ప్రధాని పదవిలో ఉన్నారు. ఇలా మొత్తంగా చూస్తే అయిదు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె విదేశాంగ విధానం భారత్ కి ఎంతో అనుకూలంగా ఉండేది. అలాగే భారత్ కూడా బంగ్లాదేశ్ కి ఇతోధికంగా సాయం చేస్తూ వచ్చింది.

బంగ్లా పితగా :

ఇక షేక్ హసీనా తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ గొప్ప నాయకుడిగా అక్కడి ప్రజల గుండెలలో నిలిచి పోయారు. ఆయన వల్లనే తూర్పు పాకిస్థాన్ కాస్తా బంగ్లాదేశ్ గా మారింది. అయితే ముజిబుర్ రెహమాన్ ని ఎక్కువ కాలం పదవిలో ఉండనీయలేదు. ఆయనను గద్దె నుంచి దించేసి మరీ హత్య గావించారు. చరిత్రలోకి వెళ్తే 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశమైన బంగ్లాదేశ్‌గా అవతరించింది, అలా ఆ దేశపు మొదటి ప్రధానమంత్రిగా తరువాత అధ్యక్షుడిగా షేక్ ముజిబుర్ రెహమాన్ బాధ్యతలు స్వీకరించారు. అయితే బంగ్లాదేశ్ ఏర్పాటు అయిన కొద్ది సంవత్సరాలకే దేశంలో రాజకీయ అస్థిరత ఆర్థిక సంక్షోభంతో పాటుగా పరిపాలనాపరమైన విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 1975 ఆగస్టు 15న బంగ్లాదేశ్ సైన్యంలోని కొంతమంది అధికారుల బృందం జరిపిన సైనిక తిరుగుబాటులో షేక్ ముజిబుర్ రెహమాన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులలో చాలామంది హత్య చేయబడ్డారు. ఆ సమయంలో షేక్ హసీనా ప్రవాసంలో ఉన్నారు కాబట్టి తప్పించుకోగలిగారు.

రెండేళ్ళ క్రితం చూస్తే :

ఇవన్నీ ఇలా ఉంటే రెండేళ్ళ క్రితం జరిగిన బంగ్లాదేశ్ పరిణామాలను గుర్తు చేసుకుంటే ఒక దేశ ప్రధాని శరణార్ధిగా మారి సొంత దేశం విడిచి పోవాల్సి వచ్చింది. 2024 జూలై–ఆగస్టు నెలలలో బంగ్లాదేశ్ లో చెలరేగిన విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆ ఏడాది ఆగస్ట్ 5న షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశానికి అనివార్యంగా రావాల్సి వచ్చింది. .అలా వచ్చిన ఆమెను భారత్ సమాదరించింది. ఆమెను అతిధిగా గౌరవించింది. ఈలోగా బంగ్లాదేశ్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ వెళ్లేందుకు షేక్ హసీనా ఉద్యుక్తులు అవుతున్నారు. భారత్ లో జీవితమంతా ఉండడం కంటే సొంత గడ్డ మీదనే తన రాజకీయ పోరాటాన్ని చేయడం ద్వారా అమీ తుమీ తేల్చుకునేందుకు ఆమె సిద్ధపడుతున్నారు.

మరణ శిక్ష విధింపు :

ఇక బంగ్లా దేశ్ వదిలి వెళ్ళిన షేక్ హసీనా మీద ఆమె ప్రభుత్వ హయాంలో నియంతృత్వ ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రతిపక్షాల అణచివేతకు సంబంధించిన కేసులో 2025 నవంబర్ 2025లో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెను దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాలని ఇప్పటికే బంగ్లాదేశ్ కోరుతోంది. 2013లో భారత్ బంగ్లాదేశ్ మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను తిరిగి పంపాలని ఆ దేశం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో తానుగానే బంగ్లాదేశ్ వెళ్లాలని షేక్ హసీనా నిర్ణయించుకోవడం కీలకమైన అంశంగా ఉంది.

అక్కడే మరణిస్తాను :

తన సొంత దేశం బంగ్లాదేశ్ లోనే మరణిస్తాను ఏ శిక్షను అయినా ఎదుర్కొంటాను అని షేక్ హసీనా స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 16న బంగ్లాదేశ్ విజయ దినోత్సవం రోజున భారతదేశం నుండి తన సొంత దేశానికి తిరిగి వెళ్లనున్నట్లుగా షేక్ హసీనా అధికారికంగా ప్రకటించారు. మరణ శిక్ష విధింపు తో పాటు అరెస్ట్ హెచ్చరికలు ఉన్నప్పటికీ, తన సొంత గడ్డపై తన ప్రజల మధ్యే మరణించడానికి సిద్ధంగా ఉన్నానని ఎలాంటి శిక్షనైనా ఎదుర్కొంటానని ఆమె స్పష్టం చేశారు. ఇక షేక్ హసీనా 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ విమానంలోనే భారత్‌కు వచ్చినందున తిరిగి ఢిల్లీ నుండి ఢాకాకు ప్రభుత్వ విమానంలో ఆమెను తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలని షేక్ హసీనా ప్రతినిధి సయ్యద్ మొజమ్మెల్ అలీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో బంగ్లాదేశ్ లో అధికారంలో ఉన్న తారిఖ్ రెహమాన్ ప్రభుత్వాన్ని కోరారు.

ఒప్పందం ప్రకారమే :

అయితే ఈ డిమాండ్ ని బంగ్లా ప్రభుత్వం తోసిపుచ్చింది. షేక్ హసీనా ను నేరస్థుల మాదిరిగానే తమ దేశానికి అప్ప్గించాలని కోరుతోంది. ఆమెకు కొత్త పాస్‌పోర్ట్ జారీ చేసే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ తేల్చి చెప్పారు. అర్థం లేని ఇలాంటి డిమాండ్లను తాము పట్టించుకోమని ఆయన స్పష్టం చేశారు. ఆమెను తాము నేరస్థురాలిగానే పరిగణిస్తామని ఆయన అంటున్నారు. షేక్ హసీనా దేశంలోకి అడుగు పెట్టిన వెంటనే ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని కూడా బంగ్లా మంత్రులు హెచ్చరించారు. మరో వైపు చూస్తే బంగ్లాదేశ్ పంపిన అప్పగింత అభ్యర్థన న్యాయపరమైన అంశమని దానిని పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఆరు నూరు అయినా డిసెంబర్ 16న బంగ్లాదేశ్ వెళ్లడానికి షేక్ హసీనా సిద్ధం అవుతున్నారు. ఆమె ఒక విధంగా చావుకు ఎదురెళ్తున్నారా లేక తాను ఓడిన చోట తిరిగి గెలిచి తన శక్తివంతమైన నాయకత్వాన్ని నిరూపించుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.