Begin typing your search above and press return to search.

భారత్ కు పాక్ ప్రధాని వార్నింగ్.. ఇది జోక్ కాదు సీరియస్..

ఈ క్రమంలోనే షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో కొన్ని వింతైన, వినోదాత్మక విషయాలను కూడా వండి వార్చారు.

By:  A.N.Kumar   |   14 Aug 2026 3:06 PM IST
భారత్ కు  పాక్ ప్రధాని వార్నింగ్.. ఇది జోక్ కాదు సీరియస్..
X

పాకిస్థాన్ ప్రశాంతంగా ఉంటే బలహీనత అనుకోవద్దని.. తమ నీటి జోలికొస్తే మాడిపోతారని వినడానికి ఏదో పవర్ ఫుల్ మాస్ సినిమా డైలాగ్‌లా ఉండే వ్యాఖ్యలు స్వయంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోటి నుంచే వచ్చాయి. తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇస్లామాబాద్‌ వేదికగా ప్రసంగించిన ఆయన.. భారత్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సింధూ జలాల ఒప్పందం విషయంలో భారత్ అవలంబిస్తున్న వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు రావాల్సిన నీటిలో ప్రతి ఒక్క చుక్కను తమ దేశ భద్రతకు సంబంధించిన 'రెడ్ లైన్'గా పరిగణిస్తామని ప్రకటించారు. ఆ గీత దాటి తమ నీటి హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదని, చాలా గట్టిగా స్పందిస్తామని టెంపో పెంచి హెచ్చరించారు.

అసలు కథేంటంటే పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రక్తం, నీళ్లు ఒకేసారి పారలేవని.. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికేవరకు నీళ్ల ముచ్చటే లేదంటూ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ దెబ్బతో అప్పటివరకు ఉగ్రవాదానికి మద్దతిస్తూ గంతులు వేసిన పాకిస్థాన్‌కు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. తమ దేశంలో పంట పొలాలు ఎండిపోవడం, తాగునీటికి కూడా కష్టాలు మొదలవ్వడంతో పాక్ పాలకుల్లో వణుకు మొదలైంది. దాంతో ఏం చేయాలో పాలుపోక మళ్లీ పాత పాటనే అందుకుని, బెదిరింపులు, హెచ్చరికల బాట పట్టారు.

ఈ క్రమంలోనే షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో కొన్ని వింతైన, వినోదాత్మక విషయాలను కూడా వండి వార్చారు. గతేడాది సరిహద్దుల్లో జరిగిన సైనిక ఘర్షణల్లో తమదే విజయమంటూ సొంత డబ్బా కొట్టుకోవడం అందులో ఒకటైతే.. ఆ ఘర్షణల తర్వాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమంటూ ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవడం మరొకటి. ఈ మాటలు విన్న సొంత దేశ జనం కూడా కాసేపు ముక్కున వేలేసుకుని ఉంటారు. అయితే భారత్ మాత్రం వెంటనే ఆయన కలల ప్రపంచానికి చెక్ పెట్టింది. మధ్యలో ట్రంప్ జోక్యం ఏమీ లేదని.. ఆ ఒప్పందం నేరుగా రెండు దేశాల సైనిక అధికారుల (డీజీఎంవో) మధ్య జరిగిన చర్చల ద్వారానే కుదిరిందని స్పష్టం చేస్తూ ఆయన భ్రమలను పటాపంచలు చేసింది.

పాక్ ప్రధాని ఎంతగా ఆవేశపడినా 'మాడిపోతారు' అంటూ మాస్ వార్నింగ్‌లు ఇచ్చినా భారత్ మాత్రం ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల ముందు ఎలాంటి ఒప్పందాలైనా దిగదుడుపేనని.. సార్వభౌమత్వ రక్షణ కోసం తగిన నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. ఉగ్రవాదపు పంపును బంద్ చేయనంత కాలం.. భారత్ నుంచి నీటి ట్యాప్‌లు తెరుచుకునే ప్రసక్తి లేదని తెగేసి చెప్పింది. నీళ్లు లేక గొంతు ఎండుతుంటే ఉన్న సమస్యను పరిష్కరించుకోవడం మానేసి, ఇలాంటి డ్రామాలు, సినిమా డైలాగులతో భారత్‌ను భయపెట్టాలని చూడటం నిజంగా ఈ ఏడాదికి బెస్ట్ కామెడీ సీన్ అనక తప్పదు.