ఉగ్రవాదులను ఆపకపోతే.. న్యూయార్క్, లండన్ వీధుల్లో తిరిగేవారు: పాక్ ప్రధాని షెహ్‌బాజ్
ప్రపంచంలో ఎక్కడైనా శాంతి సమావేశాలు జరిగితే పాఠాలు చెప్పడానికి.. లేదంటే ఆక్రందనలు వినడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉంటుంది.
By: A.N.Kumar | 23 Sept 2026 1:00 AM ISTప్రపంచంలో ఎక్కడైనా శాంతి సమావేశాలు జరిగితే పాఠాలు చెప్పడానికి.. లేదంటే ఆక్రందనలు వినడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉంటుంది. తాజాగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్.జీఏ) వేదికగా కూడా పాక్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ సరికొత్త డ్రామాకు తెరలేపారు. అంతర్జాతీయ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే విమర్శకులకు నవ్వులాటగా.. విశ్లేషకులకు విడ్డూరంగా అనిపిస్తున్నాయి.
పాక్ దయ వల్లే న్యూయార్క్ ప్రశాంతంగా ఉందట..
షెహ్‌బాజ్ షరీఫ్ మాటల సారాంశం ఏమిటంటే.. "పాకిస్థాన్ గనుక ఉగ్రవాదులను కట్టడి చేయకపోతే వాళ్లు హాయిగా లండన్, న్యూయార్క్ వీధుల్లో సంచరిస్తూ ఉండేవారట" అంటే లండన్, న్యూయార్క్ నగరాల భద్రత మొత్తం ఇప్పుడు పాకిస్థాన్ చేతుల్లోనే ఉందన్నమాట.. ఇన్నాళ్లూ ఉగ్రవాదానికి ‘సురక్షిత స్వర్గధామం’గా పేరొందిన దేశమే.. ఇప్పుడు ప్రపంచాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుతున్నామని గొప్పలు చెప్పుకోవడం శతాబ్దపు పెద్ద జోక్ కాక మరేమిటి?
మా త్యాగాలు గుర్తించండి బాబోయ్
గత రెండు దశాబ్దాలుగా ఉగ్రవాదంపై పోరాటంలో తామే ముందువరుసలో ఉన్నామని.. దీనివల్ల వేలాది మంది పౌరులను, సైనికులను కోల్పోయామని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగక, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నాశనమైందని వాపోయారు. అయితే పెరట్లో పెంపుడు జంతువులను పెంచినప్పుడు అవి ఒక్కోసారి యజమానిపైనే తిరగబడతాయనే చిన్న సత్యాన్ని ఆయన సౌకర్యవంతంగా మరచిపోయారు. ప్రపంచమంతా ఉగ్రవాదుల అడ్డాలను మూసేయాలని చెబుతుంటే తమ దేశంలో పెంచి పోషించిన "ఫ్యాక్టరీ ఉత్పత్తులు" తిరిగి తమపైనే పడుతుంటే దానిని "విశ్వశాంతి కోసం చేసిన త్యాగం" అని కలరింగ్ ఇవ్వడం పాకిస్థాన్‌కే చెల్లింది.
ఎప్పటిలాగే ‘రోదనలు’.. పొరుగు దేశాలపై నెపం
లాహోర్‌లో ఒకరు చనిపోయినా, న్యూయార్క్‌లో ఒకరు చనిపోయినా ఒక్కటేనంటూ గ్లోబల్ నీతులు చెప్పిన ప్రధాని.. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ), బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) వంటి సంస్థల వల్ల తమకు ముప్పు పొంచి ఉందంటూ రోదనలు ప్రారంభించారు. అంతేకాదు ఈ సంస్థలకు ఆఫ్ఘనిస్థాన్ నుంచి మద్దతు లభిస్తోందని వేలెత్తి చూపారు. సొంత ఇంట్లో మంటలు రేగుతుంటే పొరుగు ఇంటి వైపు వేలు చూపించడం పాక్‌కు అలవాటే కదా.. అయితే ఆఫ్ఘనిస్థాన్ కూడా ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూనే ఉంది.
మొత్తానికి ఐరాసలో పాక్ సీన్ ఇది..
ఐరాస వేదికగా పాకిస్థాన్ చేసిన ఈ ప్రయత్నం వెనుక అసలు ఉద్దేశం ఒక్కటే.. తమ ఉగ్రవాద చరిత్రను కప్పిపుచ్చుకోవడం, అంతర్జాతీయ సమాజం నుంచి మరిన్ని నిధులు లేదా సానుభూతిని పిండుకోవడం.. కానీ ప్రపంచ దేశాలకు పాక్ అసలు రంగు ఏంటో బాగా తెలుసు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి పోరాడుతున్నామని చెప్పడం కాకుండా అసలు తమ దేశంలో ఉన్న ఉగ్ర శిబిరాలను ఎప్పుడు ఖాళీ చేస్తారో చెప్తే ప్రపంచానికి కాస్త నమ్మకం కుదురుతుంది. అంతవరకు షెహ్‌బాజ్ షరీఫ్ చెప్పే ఈ ‘లండన్-న్యూయార్క్’ కథలు ఐరాసలో నవ్వులపాలు కావడానికి మాత్రమే ఉపయోగపడతాయి.
