పాకిస్తానీ షరీఫూ.. నువ్వూ కూడా భారత్ కు వార్నింగ్ లు ఇచ్చేస్తున్నావా?
బోలెడన్ని ఆర్థిక సమస్యలు.. కొండంత ద్రవ్యోల్బణం.. తినడానికి తిండి దొరకని పరిస్థితులు.. ఇవీ ఈనాటి పాకిస్తాన్ అసలు స్వరూపం.. అయినా సరే అంతర్జాతీయ వేదికలు దొరికితే చాలు, ఆ దేశ నాయకులకు ఎక్కడ లేని గంభీరం వచ్చేస్తుంది.
By: A.N.Kumar | 26 Sept 2026 11:50 AM ISTబోలెడన్ని ఆర్థిక సమస్యలు.. కొండంత ద్రవ్యోల్బణం.. తినడానికి తిండి దొరకని పరిస్థితులు.. ఇవీ ఈనాటి పాకిస్తాన్ అసలు స్వరూపం.. అయినా సరే అంతర్జాతీయ వేదికలు దొరికితే చాలు, ఆ దేశ నాయకులకు ఎక్కడ లేని గంభీరం వచ్చేస్తుంది. తాజాగా ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గారు ఇచ్చిన హెచ్చరికలు చూస్తుంటే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదు. "సింధు జలాల వాటాను అడ్డుకున్నా.. దారి మళ్లించినా దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తాం" అంటూ ఆయన నోటికొచ్చిన పగల్బాలు పలికారు. నిజంగానే.. ఇది శతాబ్దపు బెస్ట్ కామెడీ కాకపోతే ఇంకేంటి?
గతంలో ఉగ్రవాద మూలాలను పెంచి పోషించిన ఘనత పాకిస్తాన్‌దే. 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చాలా స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒకవైపు సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మరోవైపు శాంతి ఒప్పందాల పేరుతో నీటిని వాడుకుంటామంటే కుదరదని కుండబద్దలు కొట్టింది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్లు న్యూఢిల్లీ స్పష్టం చేసింది. "రక్తం, నీళ్ళు ఒకేసారి ప్రవహించలేవు" అన్నది భారత్ ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా తేల్చి చెప్పిన మాటే..
తీరా భారత్ బిగుతుగా మారేసరికి ఇస్లామాబాద్‌లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి అన్నీ సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. దాన్ని భారత్ ఆపేస్తే తమ పరిస్థితి ఏంటో ఊహించుకుని భయంతో వణికిపోతున్నారు. అందుకే ఐక్యరాజ్యసమితి వేదికను వాడుకుని.. బెదిరింపులకు దిగితే భారత్ లొంగిపోతుందేమోనని షరీఫ్ గారు చిన్నపిల్లల చేష్టలు చేస్తున్నారు.
అంతటితో ఆగకుండా 2025 మే నెలలో రెండు దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణలను ప్రస్తావిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్లే "వందలాది కోట్ల ప్రాణాలు కాపాడబడ్డాయి" అంటూ అభూతకల్పనలు అల్లేశారు. మూడో వ్యక్తి వచ్చి తమను రక్షించాలంటూ ప్రపంచ దేశాల ముందు దేహీ అని అడుక్కోవడం.. పైగా దాన్నే గొప్పగా చెప్పుకోవడం పాకిస్తాన్ నాయకులకే చెల్లింది.
సొంత దేశంలో ప్రజలకు కనీస వసతులు కల్పించలేని పరిపాలనా విఫలత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికే షెహబాజ్ షరీఫ్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నంత కాలం భారత్ తన వైఖరిని మార్చుకునే ప్రసక్తే లేదని న్యూఢిల్లీ ఇప్పటికే తేల్చిచెప్పింది. గాల్లో మేడలు కడుతూ.. అంతర్జాతీయంగా వార్నింగ్‌లు ఇచ్చే బదులు.. షరీఫ్ గారు సొంత ఇంట్లో మండుతున్న నిప్పును ఆర్పుకుంటే పాకిస్తాన్ ఆరోగ్యానికి చాలా మంచిది.
