పాక్ ప్రధాని షెహబాజ్ భయపడ్డారా? పీవోకేపై చర్చలకు అదే కారణమా?!
పాక్ ప్రధాని వెనక్కి తగ్గారు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) నిరసనలపై తొలిసారి పెదవి విప్పారు.
By: Tupaki Political Desk | 11 Aug 2026 5:22 PM ISTపాక్ ప్రధాని వెనక్కి తగ్గారు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) నిరసనలపై తొలిసారి పెదవి విప్పారు. నిరసనలతో అట్టుడుకుతున్న పీవోకే ఆందోళనకారులతో చర్చించేందుకు సిద్ధమంటూ ఆసక్తికర ప్రకటన చేశారు. పీవోకేలో గత రెండు నెలలుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన తాజా ప్రకటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తామన్న ఆలోచన నుంచి వెనక్కి తగ్గిన పాక్ ప్రధాని, ఆందోళనకారులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చేసిన ప్రకటన సానుకూల పరిస్థితులకు అవకాశం కల్పించినట్లైందని అంటున్నారు.
భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు, భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ప్రాంతీయ ఆర్థిక నిర్లక్ష్యం, వివాదాస్పద ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకంగా 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (జేఏఏసీ) ఆధ్వర్యంలో పీవోకే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కఠిన అణచివేత ధోరణిని అవలంబించిన పాక్ ప్రభుత్వం, అకస్మాత్తుగా చర్చల దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుందని చెబుతున్నారు. ఇక పీవోకే ఎన్నికల్లో తామే అధికారంలోకి రాబోతున్నామని, తమ పార్టీ ప్రభుత్వమే జేఏఏసీ ప్రతినిధులతో చర్చలు జరుపుతుందని, తద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని ప్రధాని షెహబాజ్ హామీ ఇచ్చారు. అయితే, శాంతియుతంగా సమస్యలను లేవనెత్తే వారికే ఈ అవకాశం ఉంటుందని, ప్రాంతంలో అరాచకాన్ని సృష్టించే శక్తులను మాత్రం ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మరోవైపు పీఎంల్-ఎన్ సలహాదారు రానా సనాఉల్లా కూడా జేఏఏసీ సభ్యుల్లో 99 శాతం మంది దేశభక్తులేనని పేర్కొనడం గమనిస్తే ఆందోళనకారులతో రాజీకి పాక్ ప్రభుత్వం సిద్ధమవుతున్న సంకేతాలిస్తోందని అంటున్నారు.
ఎన్నికల సమయంలో నెత్తుటిధారలు
ఇక పీవోకేలో మూడు దశల్లో జరుగుతున్న ఎన్నికలు హింసాత్మక ఘటనలకు వేదికగా మారాయని కథనాలు వస్తున్నాయి. బ్యాలెట్ బాక్సుల అపహరణ, రిగ్గింగ్ ఆరోపణలు, భద్రతా దళాల అణచివేతతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. భారీగా ప్రాణనష్టం వాటిల్లినట్లు ప్రచారం జరుగుతోంది. జూన్ నుండి జరిగిన ఆందోళనల్లో సుమారు 400 మంది మరణించారని జేఏఏసీ ఆరోపిస్తుండగా, పాక్ ప్రభుత్వం మాత్రం ఈ లెక్కలను కొట్టిపారేస్తోంది. అయితే కొన్ని స్వతంత్ర సంస్థల నివేదికల ప్రకారం పీవోకేలో హింసాత్మక ఘర్షణల్లో సుమారు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అంచనా వేస్తున్నారు.
కాగా, ఆందోళనకారుల వెనుక టెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) వంటి ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో ఆందోళనకారుల మరణాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అయితే అమ్నెస్టీ ఇంటర్నేషనల్, పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ వంటి సంస్థలతో పాటు ఐక్యరాజ్యసమితి ఆందోళనకారులకు మద్దతుగా నిలుస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజల హక్కులను కాపాడాలని, హింసాత్మక ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని, పాకిస్థాన్ ఆ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని భారత విదేశాంగ శాఖ మరోసారి స్పష్టం చేస్తోంది.
