ఓ వైపు హిందువులను అడిగి చంపుతూ దీపావళి శుభాకాంక్షలు ఏంది షరీఫ్?
పాక్ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేసినప్పటికీ, భారత నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్రంగా స్పందించారు. వారి ఆగ్రహానికి ప్రధాన కారణం ఆ దేశంలో జరుగుతున్న మైనారిటీలపై హింస.
By: A.N.Kumar | 20 Oct 2025 9:00 PM ISTదీపావళి పండుగ సందర్భంగా పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఉన్న హిందూ మైనారిటీలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేసిన పోస్ట్‌పై భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*షెహబాజ్ షరీఫ్ ట్వీట్
ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో, "దీపావళి పర్వదినం సందర్భంగా పాకిస్థాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సోదర సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ మన ప్రపంచంలో శాంతి, ఆనందం, సామరస్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను," అని ట్వీట్ చేశారు.
అంతేకాకుండా పాకిస్థాన్ సమాజంలోని మతాల వైవిధ్యం తమకు గర్వకారణమని, ఇది దేశ సమగ్రతకు.. సంస్కృతికి బలం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధికి హిందువులు ముస్లింలతో కలిసి కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు.
* నెటిజన్ల ఆగ్రహం.. విమర్శలు
పాక్ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేసినప్పటికీ, భారత నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్రంగా స్పందించారు. వారి ఆగ్రహానికి ప్రధాన కారణం ఆ దేశంలో జరుగుతున్న మైనారిటీలపై హింస. ఇటీవల జమ్ము-కాశ్మీర్‌లోని పహల్గాంలో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన హత్యలపై పాక్ ప్రభుత్వం స్పందించకపోవడం, ఇప్పుడేమో పండుగ శుభాకాంక్షలు తెలపడం కపటంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు.
"మత మైనారిటీలపై హింస జరుగుతున్న దేశం నుండి ఇలాంటి శుభాకాంక్షలు ఎలా నమ్మగలము?" అని అనేక మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం శుభాకాంక్షలు చెప్పడం కాకుండా, పాకిస్థాన్‌లో మైనారిటీల భద్రతకు భరోసా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ట్వీట్ శుభాకాంక్షల సందేశం కంటే కూడా పాకిస్థాన్‌లో మైనారిటీల పరిస్థితిపై అంతర్జాతీయంగా చర్చను తిరిగి ప్రారంభించింది.
* ప్రధాని మోదీ దీపావళి సందేశం
మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. "దీపావళి పర్వదినం మన జీవితాలను వెలుగులు, సామరస్యం, సంతోషం, శ్రేయస్సుతో నింపాలని కోరుకుంటున్నాను. మన చుట్టూ సానుకూలత స్ఫూర్తి వ్యాప్తి చెందాలి," అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
మోదీ పరంపర
ప్రతి సంవత్సరంలాగే, ఈసారి కూడా ప్రధాని మోదీ దేశ సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.. ఈసారి గోవాలో నేవి సైనికులతో మమేకమయ్యారు. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఆయనకు కొనసాగుతున్న ఆనవాయితీ.
మొత్తంగా, దీపావళి సందర్భంగా నాయకుల సందేశాలు ఒకవైపు శాంతి, సామరస్యాన్ని కోరుకుంటుంటే, మరోవైపు పాకిస్థాన్ ప్రధాని ట్వీట్ మాత్రం మైనారిటీల భద్రత అనే కీలక అంశంపై నెటిజన్ల తీవ్ర విమర్శలకు దారితీసింది.
